గత రెండునెలలుగా బ్రహ్మశ్రీ వద్ధిపర్తి పద్మాకర్ గారు అమెరికా, కెనడా దేశాలలో చేస్తున్న ఆధ్యాత్మిక, సాహితీ పర్యటనలో భాగంగా అమెరికాలో వివిధ రాష్ట్రాలలో ప్రవచానాలు, ఒక అష్టావధానము, ఒక శతావధానము కూడా నిర్వహించి ఇప్పుడు కెనడాలో మరొక అష్టావధానం చేశారు. సమస్య, ఆశువు, వర్ణన, అప్రస్తుతప్రసంగం ఇలా అన్ని అంశాలతో సభను మరింత రక్తికట్టించిన పృచ్ఛకులను, తెలుగువాహిని, ఒంటారియో తెలుగు ఫౌండేషన్ మరియు తెలుగుతల్లి కెనడా సంస్థలను శ్రీ పద్మాకర్ గారు ప్రశంసించారు. అత్యంత వైభవంగా నిర్వహించబడిన ఈ సాహితీసదస్సు తెలుగు భాషాప్రియులకు కన్నులపండుగ అని పలువురు వారి అభిప్రాయం వ్యక్తం చేశారు.
తెలుగుతల్లి కెనడా వ్యవస్థాపకురాలు శ్రీమతి లక్ష్మి రాయవరపు గారు మాట్లాడుతూ ” ఏ దేశమేగినా ఎందు కాలిడినా చక్కటి తెలుగు మా ప్రాణ ప్రదం, తల్లి భూమి భారతిని గౌరవించడమే జాతికి నిండుతనం అన్న భావంతో తెలుగు తల్లి కెనడా నెలకొల్పబడింది. తెలుగుతల్లి పత్రిక కెనడాలో ఉన్న తెలుగు ప్రతిభనంతా ఒక చోటికి చేర్చే వేదిక” అని చెప్పారు.
తెలుగువాహిని అధ్యక్షులు శ్రీ త్రివిక్రం సింగరాజు గారు మాట్లాడుతూ ” శ్రీకృష్ణ దేవరాయల ఆముక్త మాల్యద చదవడం నించి, సభ్యులలో భావుకత పెంచే నేటి తరం వచన కవితలు వ్రాయించే దాకా పూచీ తెలుగువాహినిది” అని తెలియజేసారు.
ఓంటారియో తెలుగు ఫౌండేషన్ వ్యవస్థాపక సభ్యులు శ్రీ మురళి పగిడేల గారు మాట్లాడుతూ ” ఓంటారియోలో ఉంటున్న తెలుగువారికి కావలసిన సహాయం చేసి, సంస్కృతిని సంప్రదాయాన్ని కాపాడడమే ఓటీ ఎఫ్ ముఖ్య ఉద్దేశ్యమ”ని తెలిపారు.