ముంబై: మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో గల శంకర్‌రావు చావన్ ప్రభుత్వాస్పత్రిలో రోగుల మరణాలు కొనసాగుతున్నాయి. సమయం గడిచే కొద్దీ మరణాల సంఖ్య పెరుగుతుంది కానీ ఆగడం లేదు. సోమవారం వరకు 24 గంటల్లో 24 మంది చనిపోగా తాజాగా మరో ఏడుగురు ప్రాణాలు విడిచారు. చనిపోయిన ఏడుగురిలో నలుగురు పిల్లలు ఉన్నారు. దీంతో నాందేడ్ ప్రభుత్వాస్పత్రిలో గత 48 గంటల్లో మరణించిన వారి సంఖ్య 31కి చేరింది. చనిపోయిన వారిలో ఏకంగా 15 మంది పిల్లలు ఉండడం బాధాకరం. చనిపోయిన ఇద్దరు పాము కాటుతో చనిపోగా.. మిగతా వారు వివిధ అనారోగ్య సమస్యలతో ప్రాణాలు విడిచారు. మరణాలకు సంబంధించిన వివరాలను మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేశారు.
మందుల కొరత కారణంగానే ఈ మరణాలు సంభవించాయని శంకర్‌రావు చవాన్ ప్రభుత్వ ఆసుపత్రి అధికారులు సోమవారం తెలిపారు. మరణించిన 12 మంది చిన్నారుల్లో ఆరుగురు బాలికలు, ఆరుగురు బాలురు ఉన్నారని ఆసుపత్రి డీన్ తెలిపారు. చనిపోయిన పన్నెండు మంది పెద్దలు పాము కాటుతో సహా వివిధ వ్యాధుల కారణంగా మరణించారని ఆయన తెలిపారు. ఆసుపత్రి తృతీయ స్థాయి కేర్ సెంటర్ మాత్రమేనని తెలిపారు. అయితే 70-80 కి.మీ పరిధిలో ఉన్న ఏకైక ఆరోగ్య సంరక్షణ కేంద్రం ఇదొక్కటే కావడంతో వివిధ ప్రాంతాల నుంచి రోగులు వస్తున్నారని వివరించారు. ఆసుపత్రిలో చేరే రోగుల సంఖ్య కొన్నిసార్లు ఇన్‌స్టిట్యూట్ బడ్జెట్‌ను మించిపోతుందని, అందుకే మందుల కొరత ఏర్పడిందని ఆయన తెలిపారు.