Bharatha Sakthi

రిటైర్మెంట్ ప్రకటించిన మిథాలీ.. నూతన ప్రస్థానం దిశగా అడుగులు!

admin 09/06/2022
Updated 2022/06/09 at 2:51 AM

Mithali Raj Retirement | భారత దిగ్గజ క్రికెటర్ మిథాలీ రాజ్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు ఆమె వెల్లడించారు. వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన మహిళా క్రికెటర్‌గా, ప్రపంచ క్రికెట్లో సుదీర్ఘ కాలం కొనసాగిన అతి కొద్ది మందిలో ఒకరిగా మిథాలీ రాజ్ గుర్తింపు పొందారు. మహిళా క్రికెట్లోని దిగ్గజాల్లో ఒకరిగా మిథాలీని పరిగణిస్తారు. 232 మ్యాచ్‌ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన మిథాలీ.. 50.68 సగటుతో 7805 పరుగులు చేశారు. అందులో 7 సెంచరీలు, 64 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

మిథాలీ ప్రస్థానం..
1997 మహిళల వరల్డ్ కప్‌కు మిథాలీ ఎంపికైనప్పటికీ.. తుది జట్టులో ఆమెకు చోటు దక్కలేదు. 1999లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన మిథాలీ రాజ్.. 232 వన్డేలు, 89 టీ20లు, 12 టెస్టులు ఆడారు. టీ20ల్లో 2364 పరుగులు చేసిన మిథాలీ 17 హాఫ్ సెంచరీలు కొట్టారు. టెస్టుల్లో ఆమె 699 రన్స్ చేశారు. 39 ఏళ్ల వయసులో ఆమె క్రికెట్ నుంచి వైదొలుగుతుండటం గమనార్హం.

దాదాపు 23 ఏళ్లపాటు మిథాలీ వన్డే క్రికెట్ ఆడారు. పురుషుల క్రికెట్లోనూ ఎవరికీ సాధ్యం కాని రికార్డ్ ఇది. అత్యధిక వన్డేలు ఆడిన మహిళా క్రికెటర్ కూడా మిథాలీనే కావడం విశేషం. మహిళల వరల్డ్ కప్‌లో రెండుసార్లు భారత్‌కు నాయకత్వం వహించిన రికార్డ్ కూడా మిథాలీ పేరిటే ఉంది. మహిళ టెస్టు క్రికెట్లో డబుల్ సెంచరీ బాదిన పిన్న వయస్కురాలు కూడా మిథాలీనే.

మిథాలీ ట్వీట్..
‘ఇన్నేళ్లుగా మీరు చూపించిన ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు. మీ అందరి ఆశీస్సులు, మద్దతుతో రెండో ఇన్నింగ్స్ దిశగా ప్రయాణం మొదలుపెట్టబోతున్నా’ అని మిథాలీ రాజ్ (Mithali Raj) ట్వీట్ చేశారు.

‘‘అన్ని ప్రయాణాల్లాగే.. ఈ ప్రయాణం కూడా కచ్చితంగా ముగియాల్సిందే. ఈ రోజు నేను అన్ని ఫార్మాట్లలో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నాను. మైదానంలో అడుగుపెట్టిన ప్రతిసారి భారత్ విజయానికి దోహదపడాలనే తపనతో నా ఉత్తమ ప్రదర్శనను ఇచ్చాను. భారత జట్టు ఇప్పుడు సమర్థులైన యువ క్రికెటర్ల చేతిలో ఉంది. దేశ క్రికెట్ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. కాబట్టి నా కెరీర్‌కు వీడ్కోలు పలికేందుకు ఇదే సరైన తరుణమని భావిస్తున్నా.

ఓ క్రికెటర్‌గా, కెప్టెన్‌గా ఇన్నేళ్లపాటు ఆడేందుకు నాకెంతగానో సహకరించిన బీసీసీఐకి, బీసీసీఐ కార్యదర్శి జై షాకు ధన్యవాదాలు. చాలా ఏళ్లపాటు ముందుండి జట్టును నడపడం గౌరవంగా భావిస్తున్నాను. ఇది నన్ను, భారత మహిళల క్రికెట్‌ను ఎంతగానో ప్రభావితం చేసింది. నా ప్రయాణం ముగిసి ఉండొచ్చు. కానీ నేనెంతో ఇష్టపడే ఆటలో.. భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా మహిళా క్రికెట్ పురోగతి కోసం కృషి చేస్తాను. ఎంతో ప్రేమాభిమానాలు చూపించిన అభిమానులందరీకి ప్రత్యేక ధన్యవాదాలు’ అని మిథాలీ రాజ్ ట్విట్టర్లో పోస్టు చేశారు.

రిటైర్మెంట్ ప్రకటించిన మిథాలీ రాజ్‌కు మాజీ క్రికెటర్, మాజీ కోచ్ అనిల్ కుంబ్లే అభినందనలు తెలిపారు. ‘నువ్వు ఒక రోల్ మోడల్, ఎందరికో స్ఫూర్తి. నీ సెకండ్ ఇన్నింగ్స్ బాగుండాలని ఆశిస్తున్నా’ అని మిథాలీ ట్వీట్‌కు కుంబ్లే బదులిచ్చారు.

Share this Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *