Bharatha Sakthi

గొర్రెల పంపిణీ పథకం.. గొర్రెల పెంపకంలో రాజస్థాన్‌ను మించిన తెలంగాణ

admin 09/06/2022
Updated 2022/06/09 at 3:14 AM

తెలంగాణలో కురుమ గొల్ల, యాదవుల కోసం సబ్సిడీలో గొర్రెలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకాన్ని తెచ్చింది. 2017 జూన్ 20న రూ.12 వేల కోట్ల బడ్జెట్‌తో ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. సిద్ధిపేట జిల్లా, గజ్వేల్ సమీపంలోని కొండపాకలో రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఈ పథకాన్ని ప్రారంభించారు.

గొల్ల, కురమ వర్గాల వారు తమ సంప్రదాయ వృత్తులలో సాధికారత సాధించడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందనే ఉద్దేశ్యంతో తెలంగాణ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. గొర్రెల పంపిణీ కార్యక్రమం తొలి విడత విజయవంతంగా అమలైన తర్వాత.. రెండో విడతను గతేడాది నుంచి అమలు చేస్తోంది. దీని కోసం రూ.6 వేల కోట్లను కేటాయించింది. రెండు విడతలను కలుపుకుని మొత్తంగా రూ.11 వేల కోట్లను ఇప్పటి వరకు ఈ పథకం కోసం కేటాయించారు. మొదటి విడతలో లాగానే గొర్రెల యూనిట్ సంఖ్య ఉండగా.. గతంలో రూ.1,25,000గా ఉన్న యూనిట్ ధరను రూ.1,75,000కు పెంచింది తెలంగాణ ప్రభుత్వం.

ఇందులో రూ.1,31,250ను తెలంగాణ ప్రభుత్వం భరిస్తుండగా.. రూ.43,750ను లబ్దిదారుడు భరించాలి. ఒక్కో యూనిట్ కింద 21 గొర్రెలను ఇస్తున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో తెలంగాణలో గొర్రెల సంఖ్య భారీగా పెరిగి రాజస్థాన్‌ను అధిగమించి, దేశంలోనే అగ్రస్థానానికి చేరుకుంది.

గొర్రెల పంపిణీ పథకం తొలి దశలో 79.16 లక్షల గొర్రెలను ప్రభుత్వం పంపిణీ చేసింది. ఇవి మరో 30 లక్షల పిల్లలకు జన్మనిచ్చాయి. వీటి ద్వారా రూ.7,800 కోట్ల ఆదాయం సమకూరింది. గొర్రెలు ఏడాదికి 93 వేల టన్నుల మాంసాన్ని ఉత్పత్తి చేశాయి.

గొర్రెల పంపిణీ పథకానికి అర్హులెవరు..?
తెలంగాణలో యాదవ, కురుమ వర్గాలకు చెందిన వారు ఈ స్కీమ్ కింద అర్హులు. స్థానిక తహశీల్దారుని సంప్రదించి ఈ స్కీమ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. లేదంటే ఆన్‌లైన్‌లో http://elaabh.telangana.gov.in/ లో కూడా దరఖాస్తులు అందుబాటులో ఉంటాయి.
18 ఏళ్లను పైబడిన యాదవ, కురుమ వర్గాలకు చెందిన కమ్యూనిటీలకు చెందిన వారు దీని కింద దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ స్కీమ్ కింద మొబైల్ వెటరినరీ యూనిట్లను ప్రభుత్వం ప్రారంభించింది. వీటి ద్వారా అనారోగ్యం పాలైన గొర్రెలకు చికిత్సను అందిస్తోంది. ఈ స్కీమ్ కోసం టోల్ ఫ్రీ నెంబర్ 1962ను కూడా కేటాయించింది.

గొర్రెలకు ఇన్సూరెన్స్..
ఒకవేళ ఈ పథకంలో పొందిన గొర్రెలు ప్రమాదవశాత్తు మరణిస్తే ప్రభుత్వం ఒక్కో గొర్రెకు రూ.5 వేల ఇన్సూరెన్స్ ఇస్తుంది. పొట్టేలుకు రూ.7 వేలను అందిస్తుంది. పది రోజుల్లోనే ఈ ఇన్సూరెన్స్ డబ్బులను లబ్దిదారుల ఖాతాల్లోకి వస్తుంది.

గొర్రెలకు, పొట్టేళ్లకు కావాల్సిన మేత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం 75 శాతం రాయితీని కల్పిస్తుంది. ప్రభుత్వానికి చెందిన ఖాళీ స్థలాలో వీటికి మేతను పండిస్తోంది. ప్రతి జిల్లాల్లో గొర్రెల మార్కెట్లను ఏర్పాటు చేసేందుకు 5 ఎకరాల స్థలాలను గుర్తించాలని కలెక్టర్లను కూడా ప్రభుత్వం ఆదేశించింది.

Share this Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *