నల్గోండ, సెప్టెంబర్ 30
నల్గొండ`రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహకార సంఘం మదర్ డైరీలో వివాదాలు రచ్చకెక్కాయి. డైరెక్టర్ల పదవుల కోసం ఎమ్మెల్యేలు పోటీ పడటం వివాదాస్పదమవుతోంది. కోఆపరేటివ్ చట్టానికి వ్యతిరేకంగా బోర్డు తీసుకున్న నిర్ణయంపై ప్రతిపక్షాలు, ఆశావహులు ఆందోళనకు దిగారు. మదర్ డైరీలో మంత్రి జగదీష్ రెడ్డి పెత్తనం చెలాయిస్తూ రాబందులు డైరీగా మార్చేశారని కాంగ్రెస్ నేత బీర్ల ఐలయ్య సంచలన ఆరోపణలు చేశారు. గతంలోనూ రెండుకోట్లకు చైర్మెన్ పదవిని అమ్ముకున్నారని ఆరోపించారు. ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్, నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డిలు జోక్యం చేసుకుని ఓడిపోతామనే భయంతో ఎన్నికలు నిర్వహించకుండా వాయిదా వేస్తున్నారని ఆరోపించారు. గతంలో డైరెక్టర్లుగా పనిచేసిన గుత్తా సుంఖేందర్ రెడ్డి, దివంగత నర్సింహారెడ్డి, గుత్తా జితేందర్ రెడ్డి మదర్ డైరీని అభివృద్ధి చేస్తే..ప్రస్తుత చైర్మెన్ భ్రష్టుపట్టించారని విమర్శలు గుప్పించారు.అసెంబ్లీ ఎన్నికలు వస్తున్నందున రెండు పోస్టులను ఆలేరు అభ్యర్థులకే ఇస్తే రాజకీయ ప్రయోజనం కలుగుతుందని ఎమ్మెల్యే గొంగిడి సునీత ఆశించారు. కానీ, అందుకు పోటీగా నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య వర్గం కూడా డైరెక్టర్ పదవిని ఆశిస్తోంది. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సోదరుడు గుత్తా జితేందర్ రెడ్డిని డైరెక్టర్ గా చేయాలని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పట్టుబడుతున్నారు. ఎమ్మెల్యేల మధ్య పోటీ ఒక ఎత్తైతే కాంగ్రెస్ నేత బీర్ల అయిలయ్య తన క్యాండిడేట్ ను డైరెక్టర్ పదవికి నిలబెట్టాలని చూస్తున్నారు.ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఈనెల 21 వరకు నామినేషన్లను స్వీకరించాలి. వచ్చిన అప్లికేషన్లను పరిశీలించి తుది జాబితాను ఈనెల 27 తేదీన ప్రకటించాల్సి ఉంది. అదే రోజున జనరల్ బాడీ విూటింగ్ పెట్టి, ఎన్నికలు నిర్వహించాల్సింది?. కానీ, సహేతుకమైన కారణాలు చూపకుండా బోర్డులోని 15 మంది డైరెక్టర్లు ఏకపక్షంగా తీర్మానం చేసి ఎన్నికల ప్రక్రియను అర్ధాంతరంగా ఆపేశారు. ఈనెల 30వ తేదీన మూడు డైరెక్టర్ల స్థానాలు ఖాళీ కానున్నాయి. రంగారెడ్డి జిల్లాలో ఒకటి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో రెండు స్థానాలకు ఎన్నికలు నిర్వహించాలి. రంగారెడ్డి జిల్లా పోస్టు రిజర్వ్ కేటగిరిలో ఉన్నందున మిగిలిన రెండు పోస్టుల కోసం నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, ఆలేరు ఎమ్మెల్యే గొంగడి సునీత భర్త డీసీసీబీ చైర్మన్ మహేందర్ రెడ్డి పోటీ పడుతున్నారు. అత్యధిక సొసైటీలు ఆలేరు నియోజకవర్గంలో ఉన్నందున రెండు డైరెక్టర్ల స్థానాలు తనకే కావాలని ఎమ్మెల్యే వర్గం పట్టుబడుతోంది.కోఆపరేటివ్ యాక్ట్ ప్రకారం ప్రతి ఏడాది సెప్టెంబర్ 30వ తేదీలోగా జనరల్ బాడీ విూటింగ్ నిర్వహించాలి. రొటేషన్ సిస్టమ్ డైరెక్టర ఎన్నికలు జరపాలి. అలాగే ఆడిట్ రిపోర్ట్ ఆమోదం పొందాలి. ఇవేవీ జరగకపోతే మొత్తం పాలక మండలి రద్దవుతుంది. అంతేగాక మూడేళ్ల పాటు పాలక మండలిలోని 15 మంది డై రెక్టర్లు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులవుతారు. ఒకవేళ ఎన్నికలు ఆపాల్సి వస్తే బలమైన కారణాలు చూపించాలి. ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే తప్ప ఎన్నికలు వాయిదా వేయడానికి వీల్లేదు. అది కూడా కో `ఆపరేటివ్ కమిషనర్ అనుమతి తీసుకున్నాకే ఎన్నికలు వాయిదా వేయాలి. కానీ, ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసి, నామినేషన్లు తీసుకునే క్రమంలో ఉన్నపళంగా వాయిదా వేయడం సొసైటీ రూల్స్ కు పూర్తి విరుద్ధమనే వాదన వినిపిస్తోంది.
Leave a comment