ఢిల్లీ: నేడు జాతిపిత మహాత్మాగాంధీ 154వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. గాంధీకి నివాళులర్పించేందుకు ఉదయం 7.30 గంటలకు ప్రధాని రాజ్‌ఘాట్‌కు చేరుకున్నారు. అక్కడ మహాత్ముడికి పూలు సమర్పించి నివాళులర్పించారు. అంతకుముందే గాంధీజీ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. బాపు కాలాతీత బోధనలు ప్రతి ఒక్కరి మార్గాన్ని ప్రకాశవంతం చేస్తూనే ఉన్నాయని ఆ ట్వీట్‌లో ప్రధాని పేర్కొన్నారు. ‘‘గాంధీ జయంతి సందర్భంగా నేను మహాత్మా గాంధీకి నమస్కరిస్తున్నాను. ఆయన నిత్య బోధనలు మన మార్గాన్ని ప్రకాశింపజేస్తూనే ఉన్నాయి. మహాత్మా గాంధీ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉంది. అది ఐక్యత, కరుణ స్ఫూర్తిని మరింత ముందుకు తీసుకెళ్లడానికి మొత్తం మానవాళిని ప్రేరేపిస్తుంది. ఆయన కలలను నెరవేర్చేందుకు మనం ఎల్లప్పుడూ కృషి చేద్దాం. గాంధీజీ ఆలోచనలు ప్రతి యువకుడికి అతను కలలుగన్న మార్పునకు కారకునిగా, ఐక్యత, సామరస్యాన్ని పెంపొందించడానికి వీలు కల్పిస్తుంది.’’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. కాగా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, ఢిల్లీ ఎల్జీ వీకే సక్సేనా, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తదితరులు మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.