విజయవాడ, అక్టోబరు 7
టీడీపీతో కలిసి వెళ్తామని ఎవ్వరూ ఊహించని టైంలో ప్రకటించారు పవన్ కల్యాణ్. సడెన్‌గా చేసిన ఈ ప్రకటనపై మిత్రపక్షం బీజేపీతో పాటు ఏపీ రాజకీయ వర్గాల్లో కూడా ఆశ్చర్యం వ్యక్తమైంది. ఈ ప్రకటనైతే వస్తుంది కానీ.. కొంచెం ఆలస్యం అవుతుందని భావించారు అంతా. కానీ ఇంత సడెన్‌గా.. అదీ.. చంద్రబాబు జైల్లో ఉండగా వస్తుందని ఎవ్వరూ అంచనా వేయలేదు. దీంతో ఒక విధంగా అందరికీ షాక్ తగిలినట్టే ఉందట. అయితే.. వాళ్లూ వీళ్లూ షాకైతే ఫర్వాలేదు. చేయాల్సిన కామెంట్లు చేస్తారు.. విమర్శిస్తారు. కానీ, పార్టీ కేడర్‌కే ఆ పరిస్థితి ఎదురైతే ఎలా? వాళ్ళ నమ్మకం సడలితే ఎలాగన్నది ఇప్పుడు బిగ్ క్వశ్చన్. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు.. పవన్ కామెంట్లను కనుక విశ్లేషిస్తే.. ఆయన ప్రకటనను ఆ పార్టీ కార్యకర్తలు.. పవన్ అభిమానులే జీర్ణించుకోలేకపోతున్నారా..? అనే చర్చ జరుగుతోంది. ఈ ఫీడ్ బ్యాక్ ఉండబట్టే? ఆయన లైన్, మాట తీరు కూడా మారిందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. టీడీపీతో పొత్తు ఉంటుందని ప్రకటించిన తర్వాత నుంచి పవన్ మాట తీరులో స్పష్టంగా మార్పు కన్పించింది. అర్థం చేసుకోండి.. సర్దుకుపోండి.. కలహాలు వద్దు.. ఎగ్రెసివ్‌గా వెళ్లొద్దు.. గొడవలు పడొద్దు.. గతం గతః అనే రీతిలో ఉన్నాయి ఆయన మాటలు.పార్టీ విస్తృత స్థాయి సమావేశంలోనూ.. ఆ తర్వాత జరిగిన అవనిగడ్డ బహిరంగ సభలోనూ ఇదే తరహాలో మాట్లాడారాయన. అలాగే బందరులో జరిగిన ఇన్‌సైడ్ విూటింగ్‌లోనూ పవన్‌తో పాటు పార్టీ ఇతర పెద్దలు కూడా ఇదే కామెంట్లను వారి వారి స్టైల్లో రిపీట్ చేస్తూ వస్తున్న పరిస్థితి. అలాగే పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో వివిధ జిల్లాల్లో పర్యటిస్తూ నాగబాబు చేస్తున్న కామెంట్సే ఇందుకు నిదర్శనమంటున్నారు. వరస చూస్తుంటే.. పవన్ ఓవైపు.. నాగబాబు మరోవైపు.. నాదెండ్ల మనోహర్ ఇంకో వైపు ఉండి పార్టీ కేడర్‌ను.. లీడర్లను పొత్తుకు అంగీకరింప చేసే విధంగా ఒత్తిడి తీసుకురావడమో.. ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేస్తుండడమోలాంటివి కనిపిస్తున్నాయన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. టీడీపీతో పొత్తుకు వెళ్లాలన్న పవన్ నిర్ణయాన్ని బహిరంగంగా ఎవ్వరూ వ్యతిరేకించకున్నా?కేడర్‌కు మింగుడుపడటంలేదా అన్న చర్చ జరుగుతోంది. దీంతో అసలుకే మోసం వస్తుందని, పొత్తు పండదేమోననే ఆందోళనతో పవన్ అండ్ టీమ్.. ప్లీజింగ్ జానర్‌ను ఎంచుకున్నారనేది ఏపీ పొలిటికల్ సర్కిల్సులో వినిపిస్తున్న మాట. ఇదే సందర్భంలో మరో చర్చా జరుగుతోంది. ప్రస్తుత పరిణామంతో అవునన్నా.. కాదన్నా.. పవన్ టీడీపీకి పెద్ద దిక్కుగా మారడంతో పాటు.. ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఓ విధంగా చెప్పాలంటే కింగ్ మేకర్ పాత్ర పోషించే పరిస్థితికి ఎన్నికలకు ముందే చేరుకున్నారనేది జనసేన వర్గాల్లో కొందరి అభిప్రాయం. ఇప్పుడు తాము లేనిదే జగన్‌ను ఎదుర్కొవడం కష్టమని.. టీడీపీ నేతలు భావిస్తున్నా.. జనసేన ఉండటంతోనే టీడీపీకి బలం వచ్చిందని వైసీపీ లెక్కలేస్తున్నా.. అంతా తమ చుట్టే తిరుగుతోందనే విషయాన్ని గుర్తించాలని అంటున్నారు.ఈ పరిస్థితుల్లో ఎన్నికల తర్వాత పోషించే కింగ్ మేకర్ పాత్రను ముందుగానే పవన్ పోషిస్తున్నారని భావించొచ్చుగా అని ప్రశ్నిస్తున్నారు ఆ నాయకులు. తమ అధినేత సడెన్‌గా నిర్ణయాన్ని ప్రకటించడం వల్లనే కేడర్‌ను కన్విన్స్ చేసుకోవాల్సిన అవసరం వచ్చిందని అంటున్నారు. లీడర్లే కాదు.. గతంలో తాను కూడా చంద్రబాబుతో విబేధించాననే విషయాన్ని వివరించడం ద్వారా.. రాష్ట్రం కోసం.. పార్టీ కోసం వ్యూహాత్మకంగా ఏ విధంగా సర్దుకుపోవాలో చెప్పి కన్విన్స్ చేస్తున్నారని అంటున్నాయి పార్టీ వర్గాలు. అయితే? ఆయన సర్దుకుపోయినట్టు కేడర్.. లీడర్లు సర్దుకుపోతారా..? సర్దేసుకుంటారా..? అనేది చూడాలన్న చర్చ కూడా మొదలైంది. ముందు ముందు గ్లాస్ పార్టీలో పరిణామాలు ఎలా మారతాయో చూడాలి.
Leave a comment