Bharatha Sakthi

300 కోట్లతో శ్రీ కాళహస్తి మాస్టర్‌ ప్లాన్‌

admin 13/10/2023
Updated 2023/10/13 at 10:03 AM

తిరుపతి, అక్టోబరు 13
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని ముక్కంటి క్షేత్రం. దక్షిణ కాశీగా వీరాజిల్లుతోంది. రాహు కేతు క్షేత్రంగా నిత్యం వేలాది మంది భక్తులతో కిటకిట లాడుతోంది. సాధారణ రోజుల్లో 25 వేల నుంచి 30 వేల వరకు రద్దీ రోజుల్లో 40 వేలకుపైగా భక్తులు వాయు లింగేశ్వరుడి దర్శనానికి వస్తుండడంతో శ్రీకాళహస్తి దేవస్థానంలో మాస్టర్‌ ప్లాన్‌ అమలు అనివార్యమైంది. ఈ మేరకు 2018 లోనే మాస్టర్‌ ప్లాన్‌ అమలు కోసం భూ సేకరణ జరిగింది. దాదాపు రూ.100 కోట్ల కు పైగా పరిహారం చెల్లించి భూసేకరణ కూడా పూర్తిచేసినా ఎలాంటి నిర్మాణ పనులు చేపట్టలేకపోయిన దేవస్థానం మాస్టర్‌ ప్లాన్‌ ను అటకెక్కించిందికొన్ని కోర్టు కేసులతో భూసేకరణ కు సంబంధించి నిర్మాణాల కూల్చివేత అగి పోవడంతో మాస్టర్‌ ప్లాన్‌ పనుల నిర్మాణం ప్రారంభం కాకపోగా 6 ఏళ్లు పూర్తి అయినా మాస్టర్‌ ప్లాన్‌ నిర్మాణం డిజైన్‌ దశ కూడా పూర్తి కాలేదు. ఈ నేపథ్యంలోనే స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌ రెడ్డి, పాలకమండలి అధ్యక్షుడు అంజూరు తారక శ్రీనివాస్‌ ప్రత్యేక చొరవ చూపారు. మూడు దశల్లో పనులు చేపట్టాలని నిర్ణయించిన ఆలయ పాలక మండలి మాస్టర్‌ ప్లాన్‌ రూపకల్పన చేసింది. ద్రోణ కన్సల్టెన్సీ సంస్థ తయారు చేసిన డిజైన్ల మేరకు చేపట్టాల్సిన రూ. 300 కోట్ల మాస్టర్‌ ప్లాన్‌ పనులను మూడు దశల్లో పూర్తి చేసేలా ప్రభుత్వ ఆమోదం కోసం ప్రతిపాదనలు పంపింది . సీఎం జగన్‌ ను కలిసి శ్రీకాళహస్తి ఆలయ మాస్టర్‌ ప్లాన్‌ అమలు విషయాన్ని దృష్టికి తీసుకెళ్లారు. ఈమేరకు హావిూ పొందిన పాలకమండలి అధ్యక్షుడు అంజూరి శ్రీనివాస్‌ మూడు దశల్లో మాస్టర్‌ ప్లాన్‌ పనులు చేపట్టేలా దేవాదాయ శాఖ నుంచి అనుమతి పొందేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.మొదటి దశలో రెండు బారీ భవన నిర్మాణాలను చేపట్టేలా నిర్ణయం తీసుకున్నారు. గాలిగోపురం నుంచి జల వినాయకుడి ఆలయం వరకు రెండతస్తుల భవనం, అక్కడి నుంచి 4వ నెంబర్‌ గేటు వరకు ఆలయం చుట్టూ భవన నిర్మాణం జరిగేలా చర్యలు చేపట్టారు. ఇప్పటికే రూ. 105 కోట్ల తో 6 ఏళ్ల క్రితమే భూసేకరణ పూర్తి చేసిన దేవస్థానం మరో 10 రోజుల్లో మొదటి దశ మాస్టర్‌ ప్లాన్‌ పనులు ప్రారంభించేందుకు దేవస్థానం ఉందన్న విషయాన్ని స్పష్టం చేశారు. మొదటి దశ లో క్యూ కాంప్లెక్స్‌ లు, సర్పదోష మండపాలు, దూర్జటి కళా మండపం నిర్మాణ పనులు చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రెండోదశలో స్వర్ణ ముఖి ప్రక్షాళన స్నాన ఘట్టాలు, మూడోదశలో భరద్వాజ తీర్థం, అతిధి గ్రహాల నిర్మాణపనులు చేపట్టనున్న ఆలయ పాలకమండలి చైర్మన్‌ అంజూరు శ్రీనివాస్‌ స్పష్టం చేశారు. రూ. 300 కోట్లతో 3 ఏళ్ల లో మాస్టర్‌ ప్లాన్‌ పనులు పూర్తి చేయాలని నిర్ణయం తీసుకుంటున్న విషయాన్ని స్పష్టం చేశారుఆలయ పాలకమండలి చైర్మన్‌ అంజూరు తారక శ్రీనివాస్‌.ఇక మాస్టర్‌ ప్లాన్‌ అమలులో భక్తుల సౌకర్యానికి పెద్ద పీట వేస్తున్న దేవస్థానం మల్టీప్లెక్స్‌ నిర్మాణాలను చేపట్టబోతోంది. ఒకటో నెంబర్‌ గేట్‌ నుంచి నాలుగో నెంబర్‌ గేటు వరకు 500 విూటర్ల పొడవుతో రెండు భారీ భవన నిర్మాణాలు చేపట్టనుంది. మొదటి భవనంలో రెండు అంతస్థల నిర్మాణాలు ఉండగా 330 విూటర్ల పొడవుతో రెండు వైపులా గాలి వెలుతురు ఉండేలా ఓపెన్‌ క్యూ కాంప్లెక్స్‌ లు, కారు, బైక్‌ పార్కింగ్‌ ప్రాంతాలు ఉండేలా నిర్మాణాలు జరగబోతున్నాయి. ఉచిత దర్శనం, రూ. 50, రూ. 200 టికెట్లు తీసుకున్న భక్తులు దాదాపు 15 వేల మంది వరకు మూడు గంటల సమయంలో స్వామి అమ్మవారిని దర్శించుకునేలా క్యూ కాంప్లెక్స్‌ నిర్మాణం మాస్టర్‌ ప్లాన్‌ అమల్లో భాగంగా జరగనుంది. ఒక్కో భక్తునికి 6 చదరపు అడుగుల విస్తీర్ణం ఉండేలా ఆలయంలోకి వెళ్లి వచ్చేలా క్యూ లైన్లను సౌకర్యవంతంగా ఉండేలా ఏర్పాటు చేయబోతోంది.ఇక రెండోభవనం నిర్మాణంలో మూడో నెంబర్‌ గేట్‌ నుంచి నాలుగో నెంబర్‌ గేట్‌ వరకు 170 విూటర్ల పొడవుతో రెండంతస్తుల భవనం నిర్మాణం జరగబోతోంది. మొదటి అంతస్తు మల్టీపర్పస్‌ గా వినియోగించుకునేందుకు ఓపెన్‌ హాల్‌ నిర్మాణంగా ఉంటుంది. మహాశివరాత్రి రోజు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకునేలా మిగతా రోజుల్లో రాహు కేతు పూజలు పాల్గొనే భక్తులు వేచి ఉండే వెయిటింగ్‌ హాల్‌ గా వినియోగించుకునేందుకు వీలుగా రూపకల్పన చేశారు. రాహుకేతు పూజలు జరుపుకునే మండపాల నిర్మాణాలు, వీఐపీలు వివిఐపి భక్తులు నేరుగా నాలుగో నెంబర్‌ గేట్‌ నుంచి వెళ్లి దర్శనం చేసుకునేలా క్యూ లైన్‌ ఏర్పాటు కోసం నిర్మాణం జరగనుంది. ఇక రెండు మూడు దశల్లో స్వర్ణముఖి నది ప్రక్షాళన, స్నాన ఘట్టాలు, భరద్వాజ తీర్థం బ్యూటిఫికేషన్‌ లాంటి పనులతో మాస్టర్‌ ప్లాన్‌ పనులు పూర్తి కానున్నాయి.

Share this Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *