హైదరాబాద్, అక్టోబరు 13
గ్రేటర్ హైదరాబాద్‌లో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వివిధ నియోజకర్గాల్లో దాదాపు 20,000 మంది చనిపోయిన వారు, ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారి పేర్లు ఓటర్ల జాబితాలో కొనసాగుతున్నాయి. ఈ విషయాన్ని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సీనియర్ అధికారులు ఈ విషయాన్ని అంగీకరించారు. ఇలాంటి పేర్లను దుర్వినియోగం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన, ఆరోపణలు చేస్తున్నారు.బహదూర్‌పురా నియోజకవర్గంలో 2021లో ఓ కుటుంబాన్ని కరోనా బలితీసుకుంది. ముగ్గురు కుటుంబ సభ్యులు మరణించారు. అయితే వారి పేర్లు ఓటర్ల జాబితాలో ఇప్పటికి ఉన్నాయి. కోవిడ్ కారణంగా తల్లి, సోదరుడు, భార్యను కోల్పోయానని ఆ ఇంటి పెద్ద సంతోష్ కుమార్ తెలిపారు. ఎన్నికల అధికారులు తన ఇంటికి వచ్చినప్పుడు కుటుంబ సభ్యుల మరణం గురించి చెప్పి వారి ఓట్లు తొలగించమని కోరినట్లు చెప్పారు. పోలింగ్ రోజున ఈ ఓట్లు దుర్వినియోగం అవుతాయనే ఆందోళన ఆయన వ్యక్తం చేశారు. శేర్లింగంపల్లె నియోజకర్గంలో ఇలాంటి పరిస్థితే ఉంది. 2020లో ఓ కుటుంబం ఇంటి పెద్దను కోల్పోయింది. అయితే మూడేళ్లుగా ఆ ఇంటి పెద్ద పేరు ఓటరు జాబితా నుంచి తొలగించలేదు. కాంగ్రెస్ నాయకుడు ఫిరోజ్ ఖాన్ ఆందోళన వ్యక్తం చేశారు. తమ దృష్టికి వచ్చిన వాటిని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లామని, వారు కొన్ని సందర్భాల్లో మాత్రమే తొలగింపు ప్రక్రియను చేపట్టారని ఆరోపించారు. 1995 నుంచి ఇప్పటి వరకు 2,704 మంది చనిపోయిన ఓటర్లు ఉన్నట్లు చెప్పారు. ఎన్నికల అధికారులు ఓట్ల తొలగింపుపై లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారని 470 మంది సజీవంగా ఉన్నట్లు సమాధానం వచ్చిందన్నారు. తొలగింపు ప్రక్రియను ప్రారంభించినట్లు చెప్పారని అన్నారు. ఎన్నికల కమిషన్ ప్రకారం, 698 మంది ఓట్లు కనుగొనబడలేదని చెబుతున్నారని. వాటిని ఎందుకు తొలగించలేదని ప్రశ్నించారు. 2015 నుంచి 2023 మధ్య, నాంపల్లి నియోజకవర్గంలో ఉఊఓఅ వివరాల మేరకు 7,767 మంది చనిపోయారు. వారిలో కేవలం 1,869 మాత్రమే తొలగించారు. మిగతా వారి పేర్లు ఇప్పటికీ ఓటరు జాబితాలో ఉన్నాయని అన్నారు.రంగారెడ్డి జిల్లాలో శేరిలింగంపల్లి, ఎల్‌బీ నగర్, రాజేంద్రనగర్, మహేశ్వరంతో పాటు ఇతర నియోజకవర్గాలల్లో 7,121 మంది చనిపోయిన ఓటర్లుగా గుర్తించారు. వీరిలో 2,780 మంది ఓటర్ల పేర్లను ఫారం`7 ద్వారా తొలగించారు. దీనిపై బీజేపీ నేత రవికుమార్ యాదవ్ స్పందిస్తూ.. నకిలీ, దొంగ, చనిపోయిన వారి ఓట్లను పెద్ద మొత్తంలో చూపించామని, కానీ వాటిలో ఎన్నికల అధికారులు 10 శాతం కూడా తొలగించలేదన్నారు. ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే న్యాయమైన, పారదర్శకమైన ఎన్నికలు ఎలా నిర్వహిస్తారంటూ ఆయన నిలదీశారు. ఓటర్ల జాబితాలోని సమస్యలపై తాను అనేక ఫిర్యాదులు చేశానని, అయితే చాలా వరకు పరిష్కారం కాలేదని అన్నారు. దీనిపై ఎన్నికల అధికారుల వాదన మరోలా ఉంది. చనిపోయిన వారి ఓట్లు తొలగించాలంటే కుటుంబ సభ్యులు ఫారం 7 ఇవ్వాల్సి ఉంటుందని, అప్పుడే ఓటు తొలగింపు సాధ్యమన్నారు. ఎలక్టోరల్ రోల్‌ల నుంచి ఓటరు పేరును తప్పుగా తొలగించడం చట్టరీత్యా నేరమని, దీని కారణంగా ఎవరూ తప్పుగా భావించకూడదని భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) వర్గాలు పేర్కొన్నాయి. దీనిపై పార్టీలు, కార్యకర్తలు మండిపడుతున్నారు.
Leave a comment