ముంబై: ఆసియాక్రీడల్లో స్వర్ణంతో అదరగొట్టిన భారత మహిళల టీ20 జట్టు ఇప్పుడు పటిష్ఠ ఇంగ్లండ్ జట్టును ఢీకొనబోతోంది. నేటి నుంచి ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల సిరీస్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లన్నీ స్థానిక వాంఖడే స్టేడియంలోనే జరుగనున్నాయి. అయితే వరల్డ్ నెంబర్‌టూ ర్యాంక్‌లో ఉన్న ఇంగ్లండ్ మహిళలను ఓడించడం హర్మన్‌ప్రీత్ సేనకు సవాల్ కానుంది. స్వదేశంలో ఆడిన 9 మ్యాచ్‌ల్లో భారత్ గెలిచింది రెండు మాత్రమే. భారత్‌లో చివరిసారి గెలిచింది 2018, మార్చిలో కావడం గమనార్హం. ఇక ఓవరాల్‌గా చూసుకున్నా ఇరు జట్ల మధ్య 27 టీ20 మ్యాచ్‌లు జరిగితే భారత్ ఏడు మాత్రమే నెగ్గింది. ఈ పేలవ రికార్డును అధిగమించేందుకు దూకుడే మంత్రంగా సాగాలని భావిస్తోంది. అటు కొత్త కోచ్ అమోల్ మజుందార్ కూడా తమ ప్లేయర్స్‌ను భయం లేకుండా ఆడాలని సూచిస్తున్నాడు. షఫాలీ, జెమీమా తమ సహజశైలిలో ఆడితే భారీ స్కోర్లు ఖాయమే.
సీనియర్లు హర్మన్‌ప్రీత్, స్మృతి మంధాన నిలకడైన ఆటతీరును కొనసాగించాలని కోరుకుంటున్నారు. డబ్ల్యూపీఎల్‌లో రాణించిన స్పిన్నర్లు శ్రేయాంక పాటిల్, సైకా ఇషాక్‌లతో పాటు అండర్-19 వరల్డ్‌క్‌పలో ఆకట్టుకున్న స్పిన్నర్ మన్నత్ కశ్యప్ తమ అరంగేట్రం కోసం ఎదురుచూస్తున్నారు. మరోవైపు హీథర్‌నైట్ సారథ్యంలోని ఇంగ్లండ్ జట్టు వచ్చే ఏడాది బంగ్లాదేశ్‌లో జరిగే టీ20 వరల్డ్‌కప్ కోసం ఈ సిరీస్‌ను సన్నాహకంగా ఉపయోగించుకోనుంది.