Bharatha Sakthi

11 లక్షల 66 ఎకరాల అసైన్డ్‌ ల్యాండ్‌ లకు రికార్డులు

admin 07/12/2023
Updated 2023/12/07 at 6:36 AM

రాజమండ్రి, డిసెంబర్‌ 7
భూమిలేని పేదలకు దశాబ్దాల కాలంగా అనేక ప్రభుత్వాలు పంపిణీ చేసిన అసైన్డ్‌ భూముల్లో రాష్ట్ర వ్యాప్తంగా 11.61 లక్షల ఎకరాలకు సరైన రికార్డులు లేవని ప్రభుత్వం చెబుతోంది. ఇందులో కేవలం 11,266 ఎకరాల భూములు నీటివనరుల (వాటర్‌బాడీ) కింద ఉన్నాయి. ఇదిలా ఉంటే మిగిలిన భూములకు యజమానులు వీరేననే నిర్ధారించేందుకు సరిపడా రికార్డులు లేవని ప్రభుత్వం పేర్కొంటుండటం వ్యూహాత్మకమేనా అనే చర్చ నడుస్తోంది. ఆ సాకుతో గ్రామ స్థాయిలోని పెత్తందారులు, రాజకీయ నాయకులు, బడా బాబులకు ఆయా భూములను సులభంగా కట్టబెట్టేందుకే ఈ ప్రయత్నమని అంటున్నారు. అసైన్డ్‌ ల్యాండ్స్‌ పంపిణీ చేసి 20 ఏళ్లు దాటినా నిజమైన లబ్ధిదారులకు ఆయా భూములకు సంబంధించి భూ యాజయాన్య హక్కులు కల్పించేందుకు వీలుగా ఆంధ్రప్రదేశ్‌ అసైన్‌మెంట్‌ ల్యాండ్స్‌ (ప్రొహిబిషన్‌ ఆఫ్‌ ట్రాన్స్‌ఫర్స్‌) యాక్ట్‌`1977కు ప్రభుత్వం సవరణలు చేసింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం అసైన్డ్‌ ల్యాండ్స్‌ లబ్ధిదారులను గుర్తించే ప్రక్రియలో ఇప్పటి వరకు 10.58 లక్షల ఎకరాల భూములకు యాక్ట్‌ నెంబరు 35 ఆఫ్‌ 2023 ప్రకారం ఆయా భూ యజమానులకు భూ యాజమాన్య హక్కులకు సంబంధించి పత్రాలు పంపిణీ చేసే కార్యక్రమం ఒకవైపు నడుస్తోంది.ఫ్రీహోల్డ్‌ సర్టిఫికెట్‌ (యాజమాన్య హక్కు) ఇవ్వడానికి ఇకెవైసి పద్ధతిని ప్రభుత్వం అవలంభిస్తోంది. ఇందుకు సంబంధించిన భూములను వెబ్‌ల్యాండ్‌లో మార్పులు చేసేందుకు గ్రామ రెవెన్యూ అధికారులు భూ యజమానిని ధ్రువీకరించాల్సి ఉంటుంది. తొలుత విఆర్‌ఒ, అనంతరం తహశీల్దార్‌, ఆర్‌డిఒ, జాయింట్‌ కలెక్టర్‌, కలెక్టర్‌ ద్వారా ఆయా సర్వే నెంబర్లకు సంబంధించిన ఫైలు అప్రూవల్‌ అయిన అనంతరం 22(ఎ) నుంచి తొలగించడానికి జిల్లా రిజిస్ట్రార్‌లకు పంపించడం జరుగుతుంది. ఇటీవల జరిగిన రెవెన్యూ వర్క్‌షాపులో తీసుకున్న నిర్ణయం ప్రకారం రీ వెరిఫికేషన్‌ కోసం విఆర్‌ఒ లాగిన్‌లోకి ఆయా భూముల వివరాలు పంపుతున్నట్లు కలెక్టర్లకు నాడు పంపిన ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.అసైన్డ్‌ భూమిగా నమోదు చేయబడిన సందర్భాల్లో పట్టాదారు కాలమ్‌లో ‘మిగులు భూమి’, ‘ప్రభుత్వ భూమి’, తెలియనది, ‘క్ల్తెయిమ్‌ చేయని భూమి’ పట్టాదారు అసైన్డ్‌ భూములు, ఎడబ్ల్యుడి భూములు లేదా ఏదైనా ఇతర వ్యక్తీకరణ (పట్టాదారు పేరు కాకుండా) ఉన్న భూములు 2023 చట్టం 35 ప్రకారం అసైన్డ్‌ చేయబడి, అర్హత కలిగి ఉన్నయో లేదో తనిఖీ చేయడానికి తిరిగి ధ్రువీకరించాలని ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. విఆర్‌ఒలు ధ్రువీకరించిన భూములను ఎలక్ట్రానిక్‌ రెవెన్యూ (వెబ్‌ల్యాండ్‌) రికార్డుల్లో పట్టాదారు పేరును చేర్చడానికి సదుపాయం కల్పించవచ్చని ప్రభుత్వం పేర్కొంది. కర్నూలు జిల్లాలో కొన్ని అసైన్డ్‌ భూములు ప్యూరిఫికేషన్‌ ఆఫ్‌ ల్యాండ్‌ రికార్డ్సులో ప్రభుత్వ భూమి ‘కేటాయించలేదు’ అని నమోదు చేసినట్లు గుర్తించినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఆయా భూములకు నిజమైన యజమానులు ఎవరనే అంశాన్ని గుర్తించేందుకు విఆర్‌ఒ లాగిన్‌లోకి పంపడం జరిగిందని సమాచారం. ఇక్కడే పెద్ద ఎత్తున రాజకీయ నాయకుల ఒత్తిడులతో భూములు చేతులు మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, ముఖ్యంగా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల ఒత్తిడులు అధికంగా ఉంటాయనే చర్చ నడుస్తోంది.చుక్కల భూములను ప్రభుత్వం నాలుగు రకాలుగా వర్గీకరించింది. 22(ఎ)(1)(ఎ),(బి), (సి),(డి), అండ్‌ (ఇ) కింద నిషేధించబడిన జాబితాలో పొందుపరిచారు. వీటిలో షరతుల గల పట్టా భూములు, ప్రభుత్వ భూములు/లంక భూములు కొత్త అసైన్‌మెంట్‌, గ్రామ సేవా ఇనామ్‌లు భూములను నిషేధిత భూముల జాబితాలో తొలగించి వెబ్‌ ల్యాండ్‌ సవరణ చేయవచ్చని సూచించారు.

Share this Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *