Bharatha Sakthi

‘పుష్ప’ నటుడు జగదీశ్ అరెస్ట్.. అసలు విషయం ఏంటంటే..?

admin 07/12/2023
Updated 2023/12/07 at 6:37 AM

పుష్ప’ (Pushpa) సినిమాలో అల్లు అర్జున్‌ (Allu Arjun) పక్కనే ఉండే కేశవ (Keshava) పాత్ర పోషించిన నటుడు జగదీశ్.. ఒక మహిళ ఆత్మహత్య కేసులో అరెస్టయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాకినాడకు చెందిన ఓ మహిళకు ఆరు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. కొద్దిరోజుల తర్వాత విడాకులు తీసుకుని నగరానికి వచ్చింది. సోమాజిగూడలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటోంది. సినీ పరిశ్రమలో ఆర్టిస్టుగా, చిన్న చిన్న డాక్యుమెంట్లు తీస్తున్న క్రమంలో ఆమెకు జగదీశ్(31)తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం వారి మధ్య సంబంధానికి దారి తీసింది. ఇద్దరూ కలిసి కొద్దిరోజులు ఉన్నారు. వివాహం చేసుకుందామని ఆమె అనుకుంది. కానీ, జగదీశ్ (Jagadeesh Prathap Bandari) వేరే యువతిని వివాహం చేసుకున్నాడు. ఈ విషయం తెలియగానే ఆమె అతడిని దూరం పెట్టింది.

అయితే, ఆమెను మరిచిపోలేని జగదీశ్ తరచూ ఆమె ఉండే అపార్ట్‌మెంట్‌ వద్దకు వెళ్లేవాడు. అయినా ఆమె అతడిని పట్టించుకోలేదు. అదే సమయంలో మరో యువకుడితో ఆమెకు ఏర్పడిన పరిచయం సన్నిహిత సంబంధానికి దారి తీసింది. కిందటి నెల 27వ తేదీన.. రాత్రి ఆమె తన ఫ్లాట్‌లోనే ఆ యువకుడితో అర్ధనగ్నంగా ఉండగా వంటింటి కిటికీలో నుంచి జగదీశ్ తన సెల్‌ఫోన్‌లో వారి ఫొటోలు తీశాడు. కొద్దిసేపటి తరువాత తలుపులు కొట్టడంతో ఆమె తలుపులు తెరిచింది. జగదీశ్ తాను తీసిన ఫొటోలను ఆమెకు చూపగా.. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆమెతో ఉన్న యువకుడు జగదీశ్‌ను వారించడమే కాక.. పోలీసులకు ఫోన్‌ చేస్తానని హెచ్చరించడంతో అతడు అక్కడ నుంచి వెళ్లిపోయాడు. తర్వాత రెండు రోజులూ జగదీశ్ ఆ మహిళకు.. తాను తీసిన ఫొటోలు వాట్సాప్‌లో పంపించాడు. తన మాట వినకపోతే వాటిని సామాజిక మాధ్యమాల్లో పెడతానని బెదిరించాడు. దీంతో ఆమె ఆందోళనకు గురై 29న తన ఫ్లాట్‌లోనే ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది.

మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. జగదీశ్‌పై అనుమానం ఉందని వారు తెలపడంతో.. అతడి కోసం గాలింపు ప్రారంభించారు. మృతురాలి ఫోన్‌ నంబర్‌ ఆధారంగా.. ఆమె మరణించడానికి ముందు ఎవరెవరు ఫోన్‌ చేశారు? ఆమె ఎవరితో మాట్లాడిందో తెలుసుకున్నారు. ఆమె ఆత్మహత్య చేసుకునే ముందు రోజు వరకూ ఆమెతో ఉన్న యువకుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. అతడు 27వ తేదీ రాత్రి జరిగిన విషయాన్ని పోలీసులకు తెలిపాడు. దర్యాప్తు జరిపిన పోలీసులు.. ఆమె మృతికి ప్రధాన కారకుడిగా భావించి జగదీశ్‌పై ఐపీసీ 354(సి), 306 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు.

Share this Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *