డిసెంబర్ 14వ తేదీ నుంచి మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడేందుకు గాను పాకిస్తాన్ జట్టు శుక్రవారం ఆస్ట్రేలియాకు చేరుకుంది. అక్కడికి చేరుకోగానే.. ఎయిర్‌పోర్టు పరిధిలో పాకిస్తాన్ ఆటగాళ్లు తమ కిట్ బ్యాగ్‌లు, లగేజీని ఓ ట్రక్కులో లోడ్ చేస్తూ కనిపించారు. మహమ్మద్ రిజ్వాన్ తన తోటి క్రికెటర్ల లగేజ్ అందుకొని, ట్రక్కులో అమర్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో.. నెటిజన్లు ఆస్ట్రేలియా, పాకిస్తాన్ క్రికెట్ బోర్డులపై మండిపడుతున్నారు. ‘‘లగేజ్ బ్యాగ్‌లను లోడ్ చేసేందుకు కనీసం అధికారిక స్టాఫ్‌ని కూడా నియమించలేదా? ఇది నిజంగా దారుణం. ఆస్ట్రేలియా, ఇలాగేనా స్వాగతం పలికేది’’ అంటూ ఫైర్ అవుతున్నారు. ఇది నిజంగా అవమానకరమని, ఆస్ట్రేలియా జట్టుకు PCB ఇచ్చిన ప్రెసిడెన్షియల్ ప్రోటోకాల్‌ను గుర్తుంచుకోవాలని సూచిస్తున్నారు. ఇదే పాకిస్తాన్‌లో ఇతర ఆటగాళ్ల పట్ల జరిగి ఉంటే.. అది ప్రపంచ వార్తగా మారేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు
ఇదిలావుండగా.. వరల్డ్ కప్ మెగా టోర్నీలో అత్యంత పేలవమైన ప్రదర్శన కనబరిచినందుకు గాను పాకిస్తాన్ జట్టులో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. అన్ని ఫార్మాట్ల నుంచి బాబర్ ఆజం కెప్టెన్‌గా వైదొలిగితే.. పాకిస్తాన్ క్రికెట్ టీం మొత్తం మేనేజ్‌మెంట్‌ని తొలగించింది. రెడ్-బాల్ జట్టుకి షాన్ మసూద్‌ని, టీ20 జట్టుకి షాహీన్ ఆఫ్రీదిని కెప్టెన్లుగా పీసీబీ నియమించింది. మొహమ్మద్ హఫీజ్ క్రికెట్ డైరెక్టర్‌గా నియమితులవ్వగా.. మాజీ పేసర్ వహాబ్ రియాజ్ సెలెక్టర్ల ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. కమ్రాన్ అక్మల్, రావ్ ఇఫ్తికర్ అంజుమ్, సల్మాన్ బట్‌లను వాహబ్‌కు రియాజ్‌కు కన్సల్టెంట్ సభ్యులుగా అపాయింట్ చేసింది. వారి నియామకం తక్షణమే అమల్లోకి వస్తుంది. అటు.. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ముగిసిన అనంతరం జనవరి 12వ తేదీ నుంచి న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల T20I సిరీస్ ప్రారంభం కానుంది.