హైదరాబాద్, జూన్ 30
కొద్దిరోజుల కిందటే దళితబంధు పథకం రెండో విడత అమలుకు తెలంగాణ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. అయితే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుందనే దానిపై మాత్రం క్లారిటీ రావటం లేదు.
దళితబంధు… హు?జురాబాద్ ఉపఎన్నికల వేళ తీసుకొచ్చిన ఈ స్కీమ్ ను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తున్నారు. తొలి విడతలో భాగంగా… దాదాపు 35వేలకు మందికి అందజేశారు. అయితే స్థానిక ఎమ్మెల్యేలకు లబ్ధిదారుల ఎంపిక బాధ్యతలను అప్పగించటం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. కేవలం అధికార పార్టీకి చెందిన కార్యకర్తలకే దళితబంధు ఇచ్చారనే ఆరోపణలు వచ్చాయి. ఇదే అంశంపై పలువురు హైకోర్టును కూడా ఆశ్రయించారు. దీనిపై విచారించిన న్యాయస్థానం…. ఎమ్మెల్యేల ప్రమేయంపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఎంపిక బాధ్యతలతో వారి ప్రమేయమే ఉండొద్దని స్పష్టం చేసింది. అయితే తాజాగా రెండో విడతకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఈసారి కూడా పాత పద్ధతినే పాటిస్తారా…? అలా చేస్తే దరఖాస్తు విధానం ఉంటుందా…? హైకోర్టు ఆదేశాలు ఉన్న నేపథ్యంలో… ఎంపిక ఎలా ఉండబోతుందనేది చర్చనీయాంశంగా మారింది.రెండో విడతలో రాష్ట్రవ్యాప్తంగా 1.30లక్షల దళిత కుటుంబాలకు పథకాన్ని అందించాలని సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు దళితబంధు రెండో విడత పథకం అమలుకు అవసరమైన చర్యలు తీసుకోవాలంటూ అన్ని జిల్లాల కలెక్టర్లకు సూచిస్తూ ఎస్సీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు. ఒక్కో నియోజకవర్గానికి 1,100 మంది చొప్పున హుజూరాబాద్ మినహా మిగతా 118 నియోజకవర్గాలు కలిపి మొత్తం 1,29,800 యూనిట్లను అందించనున్నారు. లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను జిల్లా కలెక్టర్లకు అప్పగిస్తున్నట్లు కార్యక్రమ అమలు ఆదేశాల్లో ఎస్సీ సంక్షేమశాఖ పేర్కొంది. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో ఎంపిక చేయాలని సూచించింది.రెండో విడత దళితబంధుకు సంబంధించి ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరిస్తుందా లేదా అనేది క్లారిటీ లేదు. స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో అంటే… నేరుగా ఎంపిక చేస్తారా…? దరఖాస్తులను స్వీకరించి… పరిశీలించిన తర్వాత ప్రకటిస్తారా అనేది తేలాల్సి ఉంది. అయితే దరఖాస్తు విధానం లేకుండా ఎలా గుర్తిస్తారని దళితబంధు ఆశిస్తున్న కుటుంబాలు ప్రశ్నిస్తున్నాయి. దళితబంధు పోర్టల్ ద్వారా ఎంపిక, పరిశీలన, యూనిట్ల మంజూరు ఉంటుందని పేర్కొన్నప్పటికీ…. అధికారికంగా మార్గదర్శకాలు వెలువడని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు అక్రమాలకు పాల్పడ్డారన్న వార్తలు రావటం… స్వయంగా కేసీఆర్ హెచ్చరించటం వంటివి కూడా జరిగాయి. ఇలాంటి నేపథ్యంలో… రెండో విడత దళితబంధు లబ్దిదారుల ప్రక్రియ ఏ విధంగా ఉండబోతుందనే దానిపై మాత్రం స్పష్టత కరువైందన్న టాక్ వినిపిస్తోంది. ఈ అంశంపై సర్కార్ నుంచి క్లారిటీ వస్తే? ఎంపిక ప్రక్రియ తేలనుంది.
Leave a comment