ఇజ్రాయెల్ దాడులతో గాజా ప్రాంతం ధ్వంసమైంది. వైమానిక దాడులతో గాజాపై ఇజ్రాయెల్ విరుచుకుపడడంతో ఆ ప్రాంతమంతా విషాదఛాయలు అలుముకున్నాయి. అనేక భవనాలు, ఇళ్లు నేల కూలి పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ క్రమంలో వందలాది మంది ప్రాణాలు కోల్పోగా.. వేల సంఖ్యలో గాయాలపాలయ్యారు. లక్షలాది మంది ఆశ్రయం కోల్పోయి నిరాశ్రయులయ్యారు. తినడానికి తిండి లేక, తాగడానికి మంచి నీరు లేక, ఉండడానికి నివాసం లేక వారంతా రోడ్డునపడ్డారు. ప్రాణాలను అరచేతిలో పట్టుకుని బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ఏ క్షణంలో ఎటువైపు నుంచి ఎటువంటి ప్రమాదం ముంచుకోస్తుందోననే భయంతోనే సగం చచ్చిపోతున్నారు. కనీసం తమ ఆకలి, దాహం తీర్చే వారికోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే గాజా వాసులకు చెదోడువాదోడుగా నిలవడానికి అగ్రరాజ్యం అమెరికా ముందుకొచ్చింది. గాజాకు 100 మిలియన్ డాలర్ల మానవతా సాయం చేయనున్నట్టు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. ప్రస్తుతం ఇజ్రాయెల్ పర్యటనలోనే ఉన్న బైడెన్ గాజా ప్రజలకు ఆహారం, నీరు, మందులు, ఆశ్రయం అవసరమని పేర్కొన్నారు. గాజా పౌరుల ప్రాణాలను రక్షించేందుకు మానవతా సహాయాన్ని అందించడానికి అంగీకరించాలని ఇజ్రాయెల్ మంత్రివర్గాన్ని కోరినట్లు కూడా ఆయన చెప్పారు.
ఈ విషయాన్ని బైడెన్ ఎక్స్ (ట్విట్టర్)లో ఓ ట్వీట్ ద్వారా వెల్లడించారు. గాజా, వెస్ట్ బ్యాంకుకు 100 మిలియన్ డాలర్ల సహాయాన్ని అందంజేయనున్నట్టు ఆయన తెలిపారు. ఈ సాయం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఒక మిలియన్ పైగా ఉన్న పాలస్తీనియన్లకు ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ సహాయం బాధితుల వద్దకు చేరుకోవడానికి తమ వద్ద అవసరమైన యంత్రాంగాలు కూడా ఉన్నాయని తెలిపారు. నిజానికి గాజాలోకి ప్రవేశించాలంటే గాజా-ఈజిప్ట్ సరిహద్దులో ఉన్న రఫా సరిహద్దు క్రాసింగ్ గుండా వెళ్లాల్సి ఉంటుంది. అయితే పలు కారణాలతో ఈ సరిహద్దును ఈజిప్ట్ మూసివేసింది. దీంతో ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతా అల్ సిసితో బైడెన్ చర్చలు జరిపారు. చర్చలు ఫలించి రఫా బార్డర్ క్రాసింగ్‌ను తెరిచేందుకు ఈజిప్ట్ అంగీకరించింది. దీంతో గాజాకు సాయం చేయడానికి మార్గం సుగుమమైంది. ఈ మేరకు వైట్ హౌజ్ నుంచి కూడా అధికారిక ప్రకటన విడుదలైంది. అలాగే హమాస్‌తో వివాదంలో ఇజ్రాయెల్‌కు మద్దతు ఇవ్వడంపై అమెరికా వైఖరిని బైడెన్ పునరుద్ఘాటించారు. “ఇజ్రాయెల్‌పై దాడి చేయాలని ఆలోచిస్తున్న ఏ రాష్ట్రానికైనా లేదా మరే ఇతర శత్రువులకైనా నా సందేశం వారం క్రితం మాదిరిగానే ఉంది – వద్దు. చేయవద్దు. వద్దు.’’ అని అన్నారు. అలాగే ఇజ్రాయెల్‌పై హమాస్ దాడిని యుఎస్‌లోని 9/11 ట్విన్ టవర్ దాడులతో బైడెన్ పోల్చారు. ఈ దాడిని ఇజ్రాయెల్ 9/11 గా వర్ణించడాన్నితాను చూశానని పేర్కొన్నారు.