రాజమండ్రి, అక్టోబరు 7
అరటి ధరలు ప్రస్తుతం నేలచూపులు చూస్తున్నాయి. కొన్ని పండగలకు ఊరిస్తూ…. మరికొన్ని పండగలకు ఉసూరుమనిపిస్తున్నాయి. శ్రావణమాసంలో కర్పూర రకం అరటి గెల రూ.400 నుంచి రూ.600 వరకూ అమ్ముడుపోయింది. వినాయకచవితికి ఈ ధర రూ.400 పరిమితం కాగా, ప్రస్తుతం రూ.200 నుంచి రూ.250కి మించిలేదు. చక్రకేళి రకం గెల గత నెలలో రూ.550 ఉండేది. ప్రస్తుతం రూ.350కు ధర పతనమైంది. అమృతపాణి రకం గెల రూ.350 నుంచి రూ.250కు దిగజారింది. నెల వ్యవధిలో ధరలు పడిపోవడంతో ఎకరా ఒక్కంటికీ రూ.50వేల వరకూ నష్టం వస్తోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రావులపాలెం, ఆత్రేయపురం, కొత్తపేట, అంబాజీపేట మండలాల్లో విస్తారంగా అరటి సాగవుతోంది. తూర్పుగోదావరి జిల్లాలో కొవ్వూరు, పెరవలి, ఉండ్రాజవరం, తాళ్లపూడి మండలాల్లో ఈ పంటను అధికంగా సాగు చేస్తున్నారు. ఈ రెండు జిల్లాల్లోని మరో ఎనిమిది మండలాల్లో అక్కడక్కడా అరటి సాగులో ఉంది. అధికారిక గణాంకాల ప్రకారం ఈ రెండు జిల్లాల్లో సుమారు 45 వేల ఎకరాల్లో అరటిని సాగు చేస్తున్నారు. సుమారు ఎనిమిది లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. అరటి పంటపై ఆధారపడి 25 వేల మంది రైతులు, వ్యాపారులు, మూడు వేల మంది కార్మికులు జీవిస్తున్నారు. ప్రధానంగా కర్పూరం, తెల్ల చక్రకేళి, బుసావళి ఎర్ర చక్రకేళి తదితర రకాల అరటిని రైతులు సాగు చేస్తున్నారు. రకాన్ని బట్టి వీటి సాగు, రవాణాకు ఎకరా ఒక్కంటికీ రూ.70 వేలు నుంచి రూ.1.50 లక్షల వరకూ పెట్టుబడి అవుతోంది. గెల రూ.500 నుంచి రూ.700 పలికితేనే తమకు గిట్టుబాటు అవుతుందని, లేకుంటే పెట్టుబడి ఖర్చులు కూడా రావని రైతులు చెబుతున్నారు. అరటి సాగుకు ప్రభుత్వం కొన్నేళ్లుగా రాయితీ ఇవ్వడం లేదు. మే నెల నుంచి ఈదురుగాలులు, వర్షాలు, వరదలు, తెగుళ్ల ప్రభావంతో అరటి పంటకు నష్టం వాటిల్లింది. మహారాష్ట్రలో అత్యధికంగా అరటి సాగు జరుగుతోంది. శబరి నదీ పరివాహక ప్రాంతాల్లోనూ ఈ ఏడాది దిగుబడి ఆశాజనకంగా రావడంతో లోకల్ అరటికి ఆశించిన స్థాయిలో మార్కెట్లో డిమాండ్ లేదు. అరటిని నిల్వ చేసుకొనే సౌకర్యాలు కల్పించాలని, ఆ దిశగా అధికార యంత్రాంగం చొరవ చూపించాలని రైతులు కోరారు.మూడున్నర ఎకరాల్లో అరటి సాగు చేశాను. మార్కెట్లో ఒక్కో రోజు ఒక్కో ధర ఉంటోంది. ధర ఉందని అధిక సంఖ్యలో గెలలు దించితే ఒకేసారి ధరలు పడిపోతున్నాయి. పచ్చి వ్యాపారం కావడంతో వ్యాపారులు అడిగిన ధరకు విక్రయించక తప్పడం లేదు. ప్రభుత్వం అరటిని నిల్వ చేసుకునే సౌకర్యాలు కల్పిస్తే, కొంత ఊరట కలిగే అవకాశాలుంటాయి. దసరాపైనే ఆశలు పెట్టుకున్నామని రైతులు చెబుతున్నారు
Leave a comment