కర్నూలు, అక్టోబరు 13
ప్రస్తుతం యువతకు ప్రపంచ కప్ క్రికెట్ ఫీవర్ అంటుకుంది. ఇదే అదునుగా, కొంతమంది బెట్టింగ్ రాయుళ్లు అమాయకులను బెట్టింగ్ రొంపిలోకి లాగుతున్నారు. ఒకప్పుడు కేవలం పట్టణాలకు మాత్రమే పరిమితవగా, పల్లెలకు సైతం పాకింది. బెట్టింగ్ కు కావాల్సిన ఆర్థిక వనరులు లేకపోయినా, అప్పులు చేసి మరీ బెట్టింగ్ లో పాల్గొంటున్నారు. చివరకు డబ్బంతా పోగొట్టుకుని అప్పులపాలై వ్యసనాలకు బానిసలౌతున్నారు.ఉమ్మడి కర్నూలు జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ జోరుగా సాగుతోంది. స్మార్ట్ ఫోన్ల రాకతో తారాస్థాయికి చేరుకుంది. తెల్లారితే చాలు యువత ఏ రోజు ఏ మ్యాచ్ ఉందని, ఏఏ జట్లపై బెట్టు వెస్తే డబ్బులొస్తాయో ఊహించుకుని గ్రూపులుగా బెట్టింగులు వేస్తున్నారు. రాత్రి మ్యాచ్ ముగిసే వరకు మద్యం సేవిస్తూ, టెన్షన్ పడుతూ మరీ స్మార్టు ఫోన్లకు అతుక్కుపోతున్నారు. ప్రస్తుతం విద్యార్థులు కళాశాలలకు వెళ్లినా, కళాశాలల నుంచి ఇళ్లకు తిరిగొచ్చినా ఎక్కడికెళ్లకుండా ఇళ్లు, మైదాన ప్రాంతాల్లోని చెట్లు, పాఠశాలల చెంతకు చేరుకుని బెట్టింగులు వేసుకుంటూ యువత దారి తప్పుతోంది. ఆన్ లైన్ యాప్ లలో రుణాలు తీసుకొని మరీ, బెట్టింగ్ కాస్తున్నారు. చివరకు అప్పులపాలై కుటుంబ సభ్యులకు చెప్పుకోలేక అటు అప్పు తీర్చే మార్గం కనబడక ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు అనేకం ఉన్నాయి.ఉమ్మడి కర్నూలు జిల్లాలో జోరందుకున్న క్రికెట్ బెట్టింగులపై పోలీసులు నిఘా ఉంచారు. గతేడాది కర్నూలు, నంద్యాల, ఆదోని, ఆలూరు, ఎమ్మిగనూరు, ఆళ్లగడ్డ, ఆత్మకూరు, నందికొట్కూరు వంటి ప్రధాన కేంద్రాల్లో ఐపీఎల్ సీజన్‌లో ఆన్ లైన్‌లో క్రికెట్ బెట్టింగులకు పాల్పడే వారిని గుర్తించి మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని అరెస్టులు చేసిన ఘటనలు చాలా ఉన్నాయి. అంతేకాకుండా నిందితుల నుంచి భారీ ఎత్తున నగదు స్వాధీనం చేసుకున్నారు. అది కూడా పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు మాత్రమే దాడులు చేసి నిందితులను పట్టుకోగలిగారు. అంటే ఈ క్రికెట్ బెట్టింగ్ మాఫియా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎంతలా వేళ్లూనుకుందో అర్థం చేసుకోవచ్చు. బెట్టింగ్ మాఫియా తమ కార్యకలాపాలను చాలా పకడ్బందీగా నిర్వహిస్తోంది.
Leave a comment