ములుగు జిల్లా ప్రతినిధి, జనవరి 5 (భారత శక్తి) : ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా ప్రజా పాలన దరఖాస్తులను కట్టుదిట్టంగా ఎలాంటి తప్పులు దొర్లకుండా ఆన్ లైన్ లో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠీ అన్నారు.
శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజా పాలన దరఖాస్తులను ఆన్ లైన్ లో నమోదు చేసే అంశంపై డేటా ఎంట్రీ ఆపరేటర్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పాల్గొన్నారు.
కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజా పాలన కార్యక్రమం ద్వారా వచ్చిన దరఖాస్తులను ఆన్ లైన్ లో నమోదు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక పోర్టల్ రూపోందించిందని, మండలాల వారీగా వచ్చిన దరఖాస్తులను డేటా ఎంట్రీ ఆపరేటర్ లు ఆన్ లైన్ ప్రజా పాలన వెబ్ సైట్ లో నమోదు చేయాలని కలెక్టర్ తెలిపారు.
ప్రభుత్వంపై నమ్మకంతో ప్రజలు ప్రజా పాలన కార్యక్రమానికి వచ్చి తమ దరఖాస్తులు సమర్పించారని, అర్హులైన ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందించేందుకు సదరు దరఖాస్తులను ఆన్ లైన్ లో నమోదు చేయడం చాలా కీలకమని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునే దిశగా డేటా ఎంట్రీ ఆపరేటర్లు దరఖాస్తుదారుల వివరాలను ఎలాంటి చిన్న పొరపాటు కూడా లేకుండా ఆన్లైన్లో భద్రపరచాలని కలెక్టర్ పేర్కొన్నారు.
ప్రజాపాలన వెబ్ సైట్ లో డేటా ఎంట్రీ ఆపరేటర్ లకు లాగిన్ అందిస్తామని, మండలాలలో అవసరమైన మేర కంప్యూటర్లు, వేగవంతమైన అంతర్జాలం మొదలగు ఏర్పాట్లు చేశామని, వెంటనే దరఖాస్తులు ఆన్లైన్ లో నమోదు చేయడం ప్రారంభించి ప్రభుత్వం నిర్దేశించిన జనవరి 17 గడువులోగా మన జిల్లాలో వచ్చిన ప్రజా పాలన దరఖాస్తులను పూర్తిస్థాయిలో ఆన్లైన్లో నమోదు చేయాలని కలెక్టర్ తెలిపారు.
ప్రజా పాలన దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేసే సమయంలో దరఖాస్తుదారుల ఆధార్ కార్డు, రేషన్ కార్డు నెంబర్, వారి కుటుంబ సభ్యుల వివరాలు, వారు దరఖాస్తు చేసుకున్న పథకాలకు సంబంధించిన వివరాలను ఎలాంటి పొరపాట్లు లేకుండా కట్టుదిట్టంగా నమోదు చేసి సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు.
ప్రజా పాలన దరఖాస్తులు ఆన్లైన్ లో నమోదు
చేసే సమయంలో దరఖాస్తుదారుల వివరాలు అసంపూర్ణంగా ఉంటే వెంటనే సంబంధిత ఎంపీడీవో లేదా తహసిల్దార్ కు సమాచారం అందించాలని, దరఖాస్తుదారుల నుంచి అసంపూర్ణంగా ఉన్న సమాచారం సేకరించి వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలని ఎట్టి పరిస్థితుల్లో దరఖాస్తులను తిరస్కరించడానికి వీలులేదని కలెక్టర్ తెలిపారు.
జిల్లాలో ఇప్పటివరకు ప్రజా పాలన కార్యక్రమం ద్వారా 93 వేల దరఖాస్తులు వచ్చాయని కార్యక్రమం పూర్తి అయ్యేవరకు ఒక లక్ష 30 వేల దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని కలెక్టర్ తెలిపారు.
డాటా ఎంట్రీ ఆపరేటర్స్ దరఖాస్తు దారుని వివరాలను ఆన్లైన్లో ఎంటర్ చేసిన అనంతరం దరఖాస్తుదారుల పారాలను తిరిగి సంబంధిత గ్రామపంచాయతీ కార్యదర్శి లేదా పంచాయతీ కార్యాలయంలో అప్పజెప్పాలని సూచించారు. దరఖాస్తు విషయంలో డాటా ఎంట్రీ ఆపరేటర్లు తప్పుగా నమోదు చేస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ సూచించారు.
ఈ శిక్షణ కార్యక్రమానికి వివిధ మండలాల నుంచి డాటా ఎంట్రీ ఆపరేటర్లు హాజరయ్యారు వీరికి ఆన్లైన్ విధానంలో వివరాలు ఏ విధంగా నమోదు చేయాలో ములుగు జిల్లా ఈ డిస్టిక్ మేనేజర్ దేవేందర్ పూర్తి వివరాలు వివరించారు.
ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారులు డి ఆర్ డి ఓ పిడి నాగ పద్మజ, జిల్లా వైద్య అధికారి అల్లేం అప్పయ్య, మత్స్యశాఖ అధికారి శ్రీపతి, తహసిల్దార్ విజయ భాస్కర్, వివిధ మండలాల డాటా ఎంట్రీ ఆపరేటర్లు పాల్గొన్నారు.