Bharatha Sakthi

కోర్టు హాలులోనే బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రోహిత్ రాజీనామా

Bharath Sakthi 06/08/2023
Updated 2023/08/06 at 7:05 AM

ముంబై: బాంబే హైకోర్టులో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. అప్పటి వరకు వేర్వేరు కేసుల్లో వాదనలు విన్నఓ న్యాయమూర్తి.. ఆకస్మాత్తుగా తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా కోర్టు హాలులోని వారంతా ఆశ్చర్యపోయారు. బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రోహిత్ డియో తన వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
నాగ్‌పూర్‌లోని బాంబే హైకోర్టు బెంచ్ కోర్టులో జస్టిస్ రోహిత్ డియో ఈ ప్రకటన చేసినట్లు ఆ సమయంలో అక్కడున్న న్యాయవాది తెలిపారు. ఆత్మగౌరవం విషయంలో రాజీపడలేని రోహిత్ డియో రాజీనామా చేసిన సందర్భంలో చెప్పారని న్యాయవాది వెల్లడించారు. ఇంకా రెండేళ్ల పదవీకాలం ఉండగానే జస్టిస్ రోహిత్ డియో తన పదవికి రాజీనామా చేశారు .
‘కోర్టులో ఉన్న మీ అందరికీ(న్యాయవాదులు, కోర్టు సిబ్బంది)కి నా క్షమాపణలు. నేను ఎన్నోసార్లు మీపై ఆగ్రహం వ్యక్తం చేశాను. మిమ్మల్ని బాధ పెట్టాలని అలా చేయలేదు. మీరు మరింత మెరుగుపడాలనే ఉద్దేశంతోనే అలా అన్నాను. మీరంతా నా కుటుంబసభ్యుల్లాంటివారు. మీకు ఈ విషయం చెబుతున్నందుకు మీరంతా నన్ను క్షమించాలి. నేను నా పదవికి రాజీనామా చేశాను. నా ఆత్మగౌరవానికి వ్యతిరేకంగా పనిచేయలేను. మీరంతా కష్టపడి పనిచేయాలి’ అని జస్టిస్ రోహిత్ డియో చెప్పినట్లుగా న్యాయవాది మీడియాకు తెలిపారు.
మరోవైపు, కోర్టు బయట జస్టిస్ రోహిత్ డియో మీడియాతో మాట్లాడుతూ.. తన వ్యక్తిగత కారణాలతో తన పదవికి రాజీనామా చేసినట్లు తెలిపారు. ‘నా రాజీనామా లేఖ రాష్ట్రపతికి పంపబడింది. వ్యక్తిగత కారణాలతో నేను సర్వీసుకు రాజీనామా చేశాను’ అని జస్టిస్ డియో తెలిపారు.
కాగా, మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో అరెస్టైన ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సాయిబాబాను జస్టిస్ రోహిత్ డియో గత సంవత్సరం నిర్దోషిగా ప్రకటించారు. ఆయనకు విధించిన జీవితఖైదును కొట్టేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, ఈ తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఇక నాగ్‌పూర్-ముంబై సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వేకు సంబంధించి జనవరి 3న మహారాష్ట్ర ప్రభుత్వం చేసిన తీర్మానంపైనా జస్టిస్ రోహిత్ డియో గత వారం స్టే విధించారు.
జస్టిస్ డియో మహారాష్ట్ర అడ్వకేట్ జనరల్‌గా ఉన్నసమయంలో జూన్ 2017లో అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఏప్రిల్ 2019లో శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. ఆయన డిసెంబర్ 4, 2025న పదవీ విరమణ చేయవలసి ఉంది.

Share this Article