హైదరాబాద్, అక్టోబరు 13
తెలుగు రాష్ట్రాల్లో ఈ సంవత్సరం వానలు సరిగా పడలేదు. చూస్తుండగానే వానాకాలం ముగిసిపోయింది. త్వరలో చలికాలం మొదలవుతోంది. అయినా సరే ఎండలు మండిపోతున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో అసాధారణంగా విద్యుత్ వినియోగం పెరిగిపోయింది. నిరంతర విద్యుత్ సరఫరాకు రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు నా నా ఇబ్బందులు పడుతున్నాయి. ఈమేరకు తెలంగాణ ట్రాన్స్కో, ఎన్టిపిసి కి అదనపు విద్యుత్ కావాలంటూ విన్నవించుకుంది. తెలంగాణ ఇప్పటికే భారత ఇంధన ఎక్స్చేంజి నుంచి ఏడు కోట్లకు పైగా యూనిట్లు అందుకుంటున్న ఫలితం లేకుండా పోవటంతో తమకు అదనంగా మరి కొంత సరఫరా చేయాలని తెలంగాణ ట్రాన్స్కో తాజాగా ఎన్టిపిసి ని కోరింది. అంతేకాదు దేశవ్యాప్తంగా ఎక్కడ కరెంటు నిల్వలు మిగిలి ఉంటే అది తెలంగాణకే ఇవ్వాలని అడిగింది. తెలంగాణాలో కొద్దిరోజుల పాటు కుండపోత వర్షాలు కురవగా తరువాత ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం నుంచే ఎండ మొదలవుతుండటంతో వాతావరణం వేడెక్కుతోంది. రెండు, మూడు రోజులుగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. ఎండ వేడి పెరగడంతో ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ దెబ్బకి విద్యుత్ వినియోగం కూడా ఎక్కువ అయ్యింది. రాబోయే ఐదు రోజులు కూడా పగటి ఉష్ణోగ్రతలు మరింత పెరుగనున్నట్టు వాతావరణ శాఖ పేర్కొన్నది. ఫిబ్రవరి చివరి వారం, మార్చి మొదటి వారంలో ఉండే మాదిరిగా ప్రస్తుతం వాతావరణం ఉంటుందని చెప్పింది.సాగర్ ఆయకట్టుతో పాటు తెలంగాణ లో అనేక చోట్ల రైతులు లోఓల్టేజీ సమస్యతో సతమతమవుతున్నారు. అంతేకాదు కనీసం 10 గంటలు కూడా విద్యుత్ సరఫరా కావడం లేదని ఆరోపిస్తున్నారు. ఆయకట్టులో బోరు బావుల కింద వేసిన పంటలకు ఈ సమయంలోనే అధికంగా పంట పొలాలకు నీటి అవసరం ఏర్పడుతుందాని చెబుతున్నారు. ఈ సమయంలో విద్యుత్ సరఫరా సక్రమంగా చేయకపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.దేశవ్యాప్త డిమాండు పెరగడంతో ఎక్స్ఛేంజీలో ప్రస్తుతం ఒక్కో యూనిటు సగటున రూ.7కుపైగా చెల్లించి కొనుగోలు చేయాల్సిరావడంతో డిస్కంలు కూడా తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. మొన్న ఆగస్టులో రూ.1,100 కోట్లు, తరువాత సెప్టెంబరులో రూ.650 కోట్లు వెచ్చించి అదనంగా విద్యుత్కొ నుగోలు చేసిన డిస్కంలు ఈ నెలలో మరోసారి కొనాల్సి రావడంతో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి పూర్తిగా , ఎస్టీ, ఎస్టీల ఇళ్లకు 101 యూనిట్ల వరకు ఉచితంగా కరెంటు సరఫరా చేస్తోంది. ఇవే కాకుండా ఎత్తిపోతల పథకాల సరఫరా కలిపి రాయితీల పద్దు కింద నెలకు రూ. 958 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం డిస్కంలకు బడ్జెట్ నుంచి అందజేస్తోంది. ఇక ఈ ఏడాది బారీగా పెరిగిన వినియోగం కారణంగా నెలకు కనీసం మరో రూ. వెయ్యి కోట్లయినా ఇస్తే తప్ప నిరంతర సరఫరా సాధ్యం కాదు అని డిస్కంల వర్గాలు చెబుతున్నాయి. పోనీ అధిక ధరలకు కొనేందుకు సిద్ధమయినా ఎక్స్ఛేంజీలో దొరకని పరిస్థితి ఉందని పేర్కొంటున్నాయి.
Leave a comment