Bharatha Sakthi

గులాబీ జెండాతో ఎంట్రీ ఇచ్చి.. అదే పార్టీని గద్దె దించిన వైనం!

admin 06/12/2023
Updated 2023/12/06 at 6:50 AM

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో 1969 నవంబరు 8న నర్సింహారెడ్డి, రామచంద్రమ్మ దంపతులకు రేవంత్‌ జన్మించారు. రేవంత్‌కు ఏడుగురు సొదరులు. ఒక సోదరి ఉన్నారు. ప్రాథమిక విద్య అంతా ప్రభుత్వ పాఠశాలలో కొనసాగింది. ప్రైవేటు కాలేజీలో ఇంటర్మీడియట్‌ పూర్తిచేశారు. అనంతరం హైదరాబాద్‌లోని ఏవీ కాలేజీలో బీఏ చదివారు.. చిన్నతనంలో ఆరెస్సెస్‌ నేపథ్యంతో.. డిగ్రీ చేస్తున్న సమయంలో ఏబీవీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. అనంతరం ఓయూలో ఫైన్‌ ఆర్ట్స్‌ పూర్తిచేసి, ఆర్టిస్టుగా మారారు. ప్రింటింగ్‌ ప్రెస్‌ను నిర్వహించారు. ఆ రెండింటిలోనూ సక్సెస్‌ అయ్యాక రియల్‌ ఎస్టేట్‌ రంగంలోకి అడుగుపెట్టారు.

ప్రేమ వివాహం

రేవంత్‌ది ప్రేమ వివాహం. కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అయిన దివంగత జైపాల్‌రెడ్డి తమ్ముడు పురుషోత్తమరెడ్డి కుమార్తె గీతారెడ్డిని రేవంత్‌ ప్రేమించారు. అప్పుడామె ఇంటర్‌ చదువుతున్నారు. అనంతరం ఢిల్లీలోని లేడీ శ్రీరామ్‌ కాలేజీలో డిగ్రీ చదివారు. డిగ్రీ పూర్తయ్యాక.. పెద్దలను ఒప్పించి, 1992లో రేవంత్‌ను పెళ్లి చేసుకున్నారు. అప్పుడు రేవంత్‌ వయసు 24 ఏళ్లు. వారికో కుమార్తె(నైమిషారెడ్డి) ఉన్నారు.

నేతలను ఒక్కతాటిపైకి తెచ్చి..

కాంగ్రె్‌సలో అంతర్గత కుమ్ములాటలు ఎక్కువగా ఉన్న సమయంలో.. ఎవరి దారి వారిదే అన్నట్లుగా పరిస్థితులుండగా అందరినీ ఒకేతాటిపైకి తెచ్చే బాధ్యతలను తన భుజస్కంధాలపైకి ఎక్కించుకున్నారు రేవంత్‌. ఆ మహా క్రతువులో విజయం సాధించారు. ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజల్లో ఎస్టాబ్లిష్‌ చేయడంలో సక్సెస్‌ అయ్యారు. కేసీఆర్‌ సర్కారుకు వ్యతిరేకంగా ప్రజాసమస్యలపై పోరాటం చేసే వారంతా.. కాంగ్రెస్‌ మద్దతు ప్రకటించేలా చేయడంలోనూ సఫలమయ్యారు.

విషయ పరిజ్ఞాని..

రేవంత్‌కు పుస్తకాలు చదివే అలవాటు ఉంది. ఏదైనా అంశానికి సంబంధించి మాట్లాడాలనుకుంటే.. దానిపై అధ్యయనం చేస్తారు. అందుకు సంబంధించిన పుస్తకాలను చదువుతారు. చదివినదానిని ఒంటబట్టించుకుంటారు. సబ్జెక్టుపై పట్టు సాఽధిస్తారు. దాంతో ఆ అంశంపై అవలీలగా మాట్లాడేస్తారు. రేవంత్‌ మంచి మాటకారి కూడా. ప్రజలకు అర్థమయ్యేలా.. వారి భాషలో.. వారి యాసలో చెప్పడంలో రేవంత్‌ దిట్ట. అలాగే తన ప్రసంగంలో ఎక్కడా కూడా సోది లేకుండా సూటిగా స్పష్టంగా విషయాన్ని చెప్పేస్తారు. అందుకే ప్రజలకు ఇట్టే కనెక్ట్‌ అవుతారు. మాస్‌ ఫాలోయింగ్‌ పెరగడానికి కూడా అదే కారణం. అలా రేవంత్‌ జనాకర్షక నేతగా ఎదిగారు. రేవంత్‌ ఆకలికి అస్సలు ఆగలేరు. వేళకు భోజనం చేయడానికే ప్రాఽధాన్యతనిస్తారు.

జీవితంలో ఆటుపోట్లెన్నో..!

రేవంత్‌ తన జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. ఉన్నత విద్య కోసం హైదరాబాద్‌ వచ్చినప్పటి నుంచి కష్టాలను ఎదుర్కొంటూనే.. డబ్బుకోసం ఇంటి నుంచి ఆశించకుండా, తన సంపాదనపైనే దృష్టిసారించారు. ఓ పార్టీ పత్రికలో విలేకరిగా, ఆర్టిస్టుగా పనిచేశారు. ప్రింటింగ్‌ రంగం, ముఖ్యంగా ఆ రోజుల్లో పాపులర్‌ అయిన స్ర్కీన్‌ప్రింటింగ్‌పై పట్టు సాధించారు. అప్పట్లో హైదరాబాద్‌లోని ప్రింటింగ్‌ ప్రెస్‌ రంగంలో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందినవారి ముద్ర బలంగా ఉండేది. వారిలో రేవంత్‌ కూడా ఒకరిగా ఎదిగారు.

మామను మించిన అల్లుడు

రేవంత్‌రెడ్డి రాజకీయాల్లో.. ముఖ్యంగా కాంగ్రెస్‌ పార్టీలో మామ జైపాల్‌రెడ్డిని మించిన అల్లుడిగా పేరు తెచ్చుకున్నారు. నిజానికి జైపాల్‌రెడ్డి తాను ఏదో ఒకరోజు రాష్ట్రానికి సీఎం అవుతానని చెబుతుండేవారు. కేంద్ర మంత్రి వరకు ఎన్నో ఉన్నత పదవులను చేపట్టిన జైపాల్‌రెడ్డి సీఎం కావాలని కలలుగన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆయనకు సీఎం అయ్యే చాన్స్‌ దక్కినట్లే దక్కి.. చేజారిన సందర్భాలెన్నో. అందుకు జైపాల్‌రెడ్డి మనస్తత్వం కూడా ఓ కారణమే..! పదవి అనేది దానంతట అదే వస్తే తీసుకోవడం తప్ప.. సీఎం పదవి కోసం అధిష్ఠానంపై ఒత్తిడికి ఆయన ఏనాడూ ప్రయత్నించలేదు. కాంగ్రెస్‌ పదవుల విషయంలోనూ అంతే..! అయితే.. ఫైర్‌బ్రాండ్‌గా పేరున్న రేవంత్‌రెడ్డి మాత్రం.. కాంగ్రె్‌సలో చేరిన అనతికాలంలోనే టీపీసీసీలో భాగమయ్యారు. ఆ తర్వాత టీపీసీసీ చీఫ్‌ అయ్యారు. ఇప్పుడు ముఖ్యమంత్రి పదవిని చేపడుతున్నారు. అయితే.. జైపాల్‌రెడ్డి విషయంలో కలగానే మిగిలిన సీఎం పదవి, రేవంత్‌కు దక్కడంపై ఆ కుటుంబం హర్షం వ్యక్తం చేస్తోంది.

Share this Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *