గుంటూరు, డిసెంబర్ 6
తెలంగాణ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ కు ఏపీ సీఎం జగన్ సాయం చేశారా? ఇందుకుగాను ఓ సీనియర్ నేతను నియమించారా? ఎమ్మెల్యే అభ్యర్థులకు ఫండిరగ్ చేశారా? పొలిటికల్ సర్కిల్లో ఇదో చర్చ నడుస్తోంది. వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలతో ఇది నిజమేనని తేలుతోంది. ఏకంగా ఓ వైసిపి సీనియర్ నాయకుడు ప్రగతి భవన్ లో కూర్చుని మంత్రాంగం నడిపినట్లు సదరు ఎంపీ ఆరోపిస్తున్నారు. దీంతో ఇదో హాట్ టాపిక్ గా మారింది.తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. మూడోసారి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ కొట్టాలన్న కెసిఆర్ ప్రయత్నాన్ని తెలంగాణ ప్రజలు తిరస్కరించారు. కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. దీంతో తెర వెనుక రాజకీయాలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా పోలింగ్ ప్రారంభమవుతుందని.. నాగార్జునసాగర్ పై ఏపీ పోలీసులు దండయాత్ర చేశారు. ప్రజల్లో సెంటిమెంటు రగిల్చి కెసిఆర్ కు రాజకీయ లబ్ధి చేకూర్చాలని జగన్ ఈ ప్రయత్నానికి దిగినట్లు ఆరోపణలు వచ్చాయి. జగన్ అంతటితో ఆగలేదని.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులకు నగదు సాయంతో పాటు ఎలక్షన్ క్యాంపెయిన్ కి అవసరమైన అన్ని రకాలుగా సహకరించినట్లు ఆరోపణలు వస్తున్నాయి.ముఖ్యంగా జగన్ శిబిరంలో కీలక నేతగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రగతి భవన్ లో ఉంటూ ఎన్నికలను రిమోట్ చేసినట్లు కామెంట్స్ వినిపిస్తున్నాయి.2018 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేసింది. కాంగ్రెస్, వామపక్షాలతో కూటమి కట్టి పోటీకి దిగింది. దీంతో సీఎం కేసీఆర్ కన్నెర్ర చేశారు. రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని ప్రకటించారు. అందుకు తగ్గట్టుగానే 2019 ఎన్నికల్లో జగన్కు అంతులేని సాయం చేశారు. అప్పట్లో 1000 కోట్ల నగదు అందించినట్లు వార్తలు వచ్చాయి. కెసిఆర్ భావించినట్టే ఆ ఎన్నికల్లో చంద్రబాబు దారుణంగా ఓడిపోయారు. అధికారంలోకి వచ్చిన జగన్ కెసిఆర్ తో మంచి సంబంధాలు కొనసాగిస్తూ వచ్చారు. ఈ క్రమంలో తెలంగాణ ఎన్నికలు వచ్చాయి. కానీ ఎక్కడ బాహటంగా బీఆర్‌ఎస్ కు మద్దతు తెలపలేదు. లోపాయికారీగా కెసిఆర్ కు అన్ని విధాలా సహకారం అందించి.. గతంలో ఆయన చేసిన సాయానికి ప్రతి సాయం చేసినట్లు కామెంట్స్ వినిపిస్తున్నాయి. తాజాగా ఈ విషయంలో వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు స్పందించారు. ప్రగతి భవన్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసిన మంత్రాంగం తో పాటు నాగార్జునసాగర్ ఘటనను కూడా కేసీఆర్ కోసమే జగన్ చేయించారని ఆయన ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం రఘురామ కృష్ణంరాజు చేసిన సంచలన వ్యాఖ్యలు సోషల్ విూడియాలో వైరల్ అవుతున్నాయి.
Leave a comment