భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ కాంట్రాక్టును బీసీసీఐ బుధవారం పొడిగించింది. ద్రవిడ్ రెండేళ్ల పదవీకాలం వరల్డ్ కప్ ఫైనల్‌తో ముగిసిన సంగతి తెలిసిందే. అయితే మెగా టోర్నమెంట్‌లో రోహిత్ సేన అద్భుతంగా ఆడిన నేపథ్యంలో..ఆ జోరును కొనసాగించేందుకు ద్రవిడ్ కాంట్రాక్టును పొడిగించాలని బోర్డు నిర్ణయించినట్టు తెలిసింది. అయితే ఈ పొడిగింపు ఎన్ని సంవత్సరాలనేది మాత్రం వెల్లడించలేదు. ద్రవిడ్‌తోపాటు బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే, ఫీల్డింగ్ కోచ్ టి.దిలీప్ కాంట్రాక్టును కూడా పొడిగించారు.కాంట్రాక్టు విధివిధానాలపై చర్చిస్తున్న బీసీసీఐ..త్వరలో అందుకు సంబంధించిన వివరాలను వెల్లడించనున్నట్టు సమాచారం. గత పదవీకాలం ముగిశాక..ద్రవిడ్‌తో బోర్డు చర్చలు జరిపిందని, అవి ఫలించడంతో కాంట్రాక్టు పొడిగింపు నిర్ణయం తీసుకున్నట్టు బోర్డు వివరించింది. ప్రతిష్ఠాత్మక ఐసీసీ ట్రోఫీ సాధించే క్రమంలో ద్రవిడ్‌కు తాము అండగా నిలుస్తామని బీసీసీఐ కార్యదర్శి జై షా పేర్కొన్నాడు.
ఫైనల్ ఓటమి ముందు వరకు 10 మ్యాచ్‌ల్లో వరుస విజయాలు సాధించడం ద్వారా వరల్డ్ కప్‌లో భారత జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. జట్టు ఈ విధంగా రాణించడంలో ద్రవిడ్ పాత్ర ఎంతో కీలకం. అంతర్జాతీయ స్థాయిలో ఇదే తరహాలో ఆడేలా ద్రవిడ్‌కు మేం అన్ని విధాలుగా మద్దతు ఇస్తాం’ అని షా పేర్కొన్నాడు.
చిరస్మరణీయ విజయాలు..: ‘గత రెండేళ్లుగా ఎత్తుపల్లాలు ఎదురైనా టీమిండియా చిరస్మరణీయ విజయాలు అందుకుంది. ఈక్రమంలో జట్టు కలిసికట్టుగా చేసిన కృషి అమోఘమైనది’ అని ద్రవిడ్ చెప్పాడు. 2021 టీ20 వరల్డ్ కప్ తర్వాత రవిశాస్త్రి స్థానంలో రెండేళ్ల కాలానికి ద్రవిడ్ హెడ్ కోచ్‌గా నియమితుడైన విషయం విదితమే. ద్రవిడ్ ఆధ్వర్యంలో గత ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షి్‌పలో టీమిండియా రన్నర్‌పగా నిలిచింది. వచ్చే ఏడాది జూన్, జూలైలో అమెరికా-వెస్టిండీస్ వేదికలుగా జరిగే టీ20 ప్రపంచ కప్ వరకూ ద్రవిడ్ అండ్ కో పదవీకాలం ఉండనున్నట్టు సమాచారం. ద్రవిడ్ విశ్రాంతి తీసుకున్నప్పుడల్లా అతడి బాధ్యతలు నిర్వహిస్తున్న వీవీఎస్ లక్ష్మణ్‌ను హెడ్ కోచ్‌గా నియమిస్తారని భావించారు. కానీ ఇండియా ‘ఎ’, అండర్-19 జట్లతోపాటు బెంగళూరులోని జాతీయ అకాడమీ వ్యవహారాలపట్లే లక్ష్మణ్ ఆసక్తి చూపినట్టు తెలిసింది. కాగా..ద్రవిడ్ పదవీ కాలం పొడిగింపు పట్ల బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ హర్షం ప్రకటించాడు. మరోవైపు గుజరాత్ టైటాన్స్ కోచ్ ఆశీష్ నెహ్రా..భారత జట్టు హెడ్ కోచ్ పదవిపట్ల ఆసక్తిగా ఉన్నట్టు వార్తలొచ్చాయి. కానీ అతడు ఆ వార్తలను తోసిపుచ్చాడు. అయితే భవిష్యత్‌లో నెహ్రా వైట్‌బాల్ జట్టు కోచ్ అయ్యే అవకాశాలు లేకపోలేదంటున్నారు.