ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ప్రస్తుత సూర్యాపేట జిల్లాలో మేజర్ గ్రామ పంచాయతీ లలో చారిత్రక ప్రాధాన్యం ఉన్న గ్రామం బేతవోలు. హైదరాబాద్ విజయవాడ హైవే కు 8 కి.మీ దూరంలో చుట్టూ పచ్చని వరి పొలాల మధ్య లో ప్రకృతి రమణీయంగా ఉన్న బేతవోలు గ్రామం ఉమ్మడి నల్లగొండ జిల్లాకు ధాన్యాగారం గా ఖరీఫ్, రబీ సీజన్లో దాదాపు 3800 హెక్టార్లలో వరి ధాన్యాన్ని పండిస్తూ నాణ్యమైన వరి ధాన్యం ఎగుమతి లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొదటి స్థానంలో ఉంది. ఈ గ్రామం ప్రధాన నీటి వనరులు నాగార్జున సాగర్ ఎడమ కాలువ ద్వారా వచ్చే నీటి తో వీర్లదేవి చెరువు, చిన్న చెరువు ద్వారా దాదాపు 2500 హెక్టార్లలో ఆయకట్టు కలిగి ఉంది, మరికొంత భాగం సాగర్ ఎడమ కాలువ ద్వారా వచ్చే నీటి ద్వారా పండుతుంది. గ్రామం లో వ్యవసాయం, వ్యవసాయ ఆధారిత పనులు గ్రామస్తుల ప్రధాన ఆదాయ వనరు. దాదాపు 2011 జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 15300, ఓటర్ల సంఖ్య 6500. పూర్వ కాలం నుంచి గ్రామస్తులు కులమతాలకు అతీతంగా కలిసి మెలిసి జీవనం సాగిస్తుండడం వలన గ్రామం శాంతికి మారుపేరుగా చుట్టు పక్కల గ్రామాలకు ఆదర్శంగా ఉంటోంది.
బేతవోలు గ్రామం నిజాం పాలనలో వారి సామంత రాజులు అయిన మక్తేదారుల పాలన క్రింద ఉండి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట సమయంలో గడీల పాలనకు, రజాకార్ల కు వ్యతిరేకంగా ఉద్యమం చేసి దొరల పాలన నుంచి విముక్తి పొందినది. ఆనాటి నుంచి నేటి వరకు కూడా గ్రామస్తులలో ఉద్యమ స్ఫూర్తి, చైతన్యం కలిగిన వారు ఉన్నారు. ఉన్నత విద్యావంతులు, ఉద్యోగులు అధిక సంఖ్యలో ఉండడం వలన గ్రామం లో సామాజిక, రాజకీయ చైతన్యం ఎక్కువ గా ఉంటుంది. బేతవోలు గ్రామం లో ప్రతి ఏటా మహాశివరాత్రి ముందు జరిగే కనకదుర్గమ్మ జాతర గ్రామం లో ప్రధాన పండుగ. మూడు రోజుల పాటు కోలాహలంగా జరిగే ఈ పండుగ లో గ్రామస్తుల తో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొంటారు. మూడు రోజుల పాటు కోలాటం, ప్రభలు, సాంస్కృతిక కార్యక్రమాలతో గ్రామం కన్నుల పండుగగా ఉంటుంది. బేతవోలు గ్రామం రాష్ట్ర స్థాయిలో ఉత్తమ కబడ్డీ క్రీడాకారులకు ప్రధాన కేంద్రం.
గ్రామం లో జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో చెప్పుకోదగ్గ స్థాయిలో నాయకులు లేకపోవడం వలన బేతవోలు గ్రామం చెప్పుకోదగ్గ స్థాయిలో అభివృధ్ధికి నోచుకోలేదు ప్రదానం గా మేజర్ గ్రామ పంచాయతీ గా ఉండి అన్ని అర్హతలు కలిగి ఉన్నప్పటికీ బేతవోలు గ్రామం మండల కేంద్రం హోదా కు నోచుకోలేదు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బేతవోలు గ్రామం కంటే చిన్న గ్రామాలు మండల కేంద్రం గా ఏర్పాటు అయినప్పటికీ బేతవోలు మాత్రం మండలం కేంద్రం గా ఏర్పాటు చేయడం లో వివక్ష కు గురి అయితూనే వుంది . గ్రామం మరియు చుట్టు పక్కల గ్రామాల నుంచి నిత్యం వందల మంది విద్యార్థులు కోదాడ కు ఉన్నత విద్య కోసం వెళుతుంటారు. గ్రామం లో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల కు తోడు జూనియర్ కళాశాలను ఏర్పాటు చేస్తే విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా ఉంటుంది. గ్రామం లో ఆరోగ్య ప్రాథమిక ఉప కేంద్రం ఉన్నప్పటికీ సిబ్బంది కొరత వలన ఇబ్బందులు కలుగుతున్నాయి. గ్రామం లో ప్రాధమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయాలని గ్రామస్తుల ప్రధాన కోరిక. నిత్యం వ్యాపారం, విద్య, ఉపాధి కోసం ప్రజలు గ్రామం నుంచి కోదాడ కు వెళుతుండగా బేతవోలు నుంచి చిలుకూరు మండల కేంద్రం వరకు గల దాదాపు పది కిలోమీటర్ల మేర సరియైన రోడ్డు సౌకర్యం లేక నిత్యం ప్రమాదాలకు కేంద్రం గా మారుతుంది,ఈ రోడ్డు ను డబుల్ రోడ్డు గా ఏర్పాటు చేయాలని గ్రామస్తుల కోరిక కలగానే మిగిలిపోయింది. ప్రధానంగా గ్రామం లో ఉన్న వీర్లదేవి చెరువు అధికారుల నిర్లక్ష్యం వలన గుర్రపు డెక్క తో నిండి పోయి త్రాగు నీరు, మురికి నీరుగా మారిపోయింది. సాగర్ ఎడమ కాలువ నుండి గ్రామం లో ఉన్న చెరువులకు సరియైన కాలువ సదుపాయం లేకపోవడం వలన రైతులు నిత్యం ఇబ్బందులకు గురి అవుతున్నారు. ప్రస్తుత సర్పంచ్ కృషి వలన గ్రామం లో దాదాపు 80 శాతం మేర సి.సి రోడ్ల తో మరియు సురక్షిత త్రాగు నీరు, పారిశుధ్యం, వైకుంఠదామం, పల్లె ప్రకృతి వనాల ఏర్పాటు వలన, ఇతర అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు సాగుతోంది. ప్రధానంగా గ్రామం లో ఉన్న రెండు ప్రధాన ఆలయాలు పురాతన కాలంలో నిర్మించడం వలన నేడు ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వలన శిధిలావస్థలో ఉన్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రధాన గ్రామ పంచాయతీ అయిన బేతవోలు గ్రామంను అభివృద్ధి పధం లో ఇంకా ముందుకు సాగాలని గ్రామస్తులు కోరుతున్నారు.
కిరణ్ గౌడ్, బేతవోలు