శ్రీకాకుళం, డిసెంబర్ 2
బ్యాంకులో బంగారం మాయమైంది. ఖాతాదారులు తాము తీసుకున్న రుణం తీర్చేసినా వాళ్లకు బంగారం అందలేదు. దీంతో వారు కొద్ది రోజులుగా ఆందోళన చేస్తుండగా, ఆరా తీసిన అధికారులు 7 కిలోల బంగారం మాయమైనట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే గోల్డ్ కస్టోడియన్ విధుల్లో ఉన్న మహిళా ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలో సంచలనం సృష్టించింది.
శ్రీకాకుళం జిల్లా గార ఎస్బీఐలో బంగారం గల్లంతు వ్యవహారం కలకలం రేపింది. ఖాతాదారులు తనఖా పెట్టిన 7 కిలోల బంగారం ఆభరణాలు గల్లంతయ్యాయి. సదరు ఖాతాదారులు రుణాలు తీర్చినా వారికి బంగారం ఇవ్వలేదు. దీంతో వారు ఆందోళనకు దిగారు. దాదాపు రూ.4 కోట్ల విలువైన బంగారం మాయమైనట్లు అధికారులు గుర్తించారు. ఇది ఇంటి దొంగల పనే అనే అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా, విచారణకు ముందే బ్యాంకులో పని చేస్తున్న మహిళా ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడ్డారు. అప్పులు తీర్చిన ఖాతాదారులు నగలు ఇవ్వకపోవడంతో నవంబర్ 27న బ్యాంకు ముందు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం రీజనల్ మేనేజర్, ఆడిట్ కారణంగానే జాప్యం జరుగుతోందని, వదంతులు నమ్మొద్దని వారికి సద్దిచెప్పారు. డిసెంబర్ 8 వరకూ ఓపిక పట్టాలని, ఈ లోపే బంగారం అప్పగిస్తామని హావిూ ఇచ్చారు. అయితే, బ్యాంకులో ఆడిట్ జరుగుతున్న సమయంలోనే గోల్డ్ లోన్స్ బాధ్యతలు చూసే డిప్యూటీ మేనేజర్ స్వప్నప్రియ నవంబర్ 29న ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ క్రమంలో బంగారం పక్కదారి పట్టడంతోనే ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడ్డారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బంగారం మాయం వ్యవహారంలో ఉద్యోగుల ప్రమేయం కూడా ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది.ఈ క్రమంలో మరోసారి ఖాతాదారులు బ్యాంకు ముందు ఆందోళనకు దిగారు. అయితే, బ్యాంకులో నగలు మాయమైనట్లు అంతర్గత విచారణలో గుర్తించినా అధికారులు బయటకు పొక్కకుండా జాగ్రత్తపడ్డారు. బంగారం గల్లంతు వ్యవహారంలో స్వప్నప్రియను బాధ్యురాలిని చేస్తూ, నవంబర్ 20 నుంచి సెలవుపై పంపారు. అనంతరం రెండుసార్లు విచారణకు పిలిపించారు. డిసెంబర్ 8న ఖాతాదారులకు కచ్చితంగా బంగారం అప్పగిస్తామని అధికారులు స్పష్టం చేశారు. అయితే, ఈ లోపే మహిళా ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడడంతో గురువారం పోలీసులను ఆశ్రయించారు. బంగారం మాయం కావడంలో ఉద్యోగుల పాత్రపై అనుమానం ఉందంటూ ఎస్బీఐ రీజినల్ మేనేజర్ రాజు, బ్రాంచి మేనేజర్ సీహెచ్.రాధాకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 7 కేజీల బంగారం ఆభరణాలు (విలువ రూ.4.07 కోట్లు) మాయమైనట్లు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Leave a comment