హైదరాబాద్‌ః ఆదివారం భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటించనున్నరు. వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించడంతో పాటు బాధితులను పరామర్శించారునన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ శనివారం రాత్రి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకొని అక్కడ నుంచి రైలులో భద్రాచలం వరకూ ప్రయాణించనున్నారు. ఇదిలా ఉండగా ఆదివారం సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. కడెం నుంచి భద్రాచలం వరకు ఉన్న గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఈ ఏరియల్ సర్వే కొనసాగనుంది. వరద సహాయక చర్యలను సీఎం పర్యవేక్షించనున్నారు. సీఎం చేపట్టే ఏరియల్ సర్వకు సంబంధించిన హెలికాప్టర్ రూట్ సహా తదితర విధివిధినాలను అధికార యంత్రాంగం పర్యవేక్షిస్తుంది
కాగా, ఎగువ రాష్ట్రాలతో పాటు, తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపిలేకుండా వారం రోజులపాటు కురిసిన వర్షాలతో నదులు, ప్రాజెక్టులు, చెరువులు నిండిపోయాయి. వరద నీరుతో ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మరోవైపు భారీ వర్షాలు, వరదలతో గోదారమ్మ ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద వరద నీరు రికార్డ్ స్థాయిలో చేరుకుంది. దీంతో నది పరివాహక ప్రాంతాలు చిగురుటాకుల వణుకుతున్నాయి. అనేక గ్రామాలు వరద నీటితో నిండిపోయాయి. చర్యలు చేపట్టిన అధికారులు వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. లక్షలాది మంది వరద గుప్పిట్లో చిక్కుకుని బిక్కు బిక్కు మంటూ గడుపుతున్నారు. ఓ వైపు వరద బాధితుల సహాయార్ధం భారత సైన్యం రంగంలోకి దిగింది. మరోవైపు ప్రజా ప్రతినిధులు, అధికారులు వరద బాధితులను పరామర్శిస్తున్నారు. దైర్యం చెబుతున్నారు.