బ్యాంకాక్: శాంతిని ప్రబోధించే హిందూ జీవన విలువలతోనే ప్రపంచ శాంతి సాధ్యమని థాయ్‌లాండ్ ప్రధాన మంత్రి స్రెట్టా థావిసిన్ కొనియాడారు. ప్రపంచం కల్లోల పరిస్థితుల్లో చిక్కుకున్నప్పుడు అహింస, సత్యం, సహనం, సామరస్యం వంటి హిందూ విలువలను స్ఫూర్తిగా తీసుకోవాలని, అప్పడు మాత్రమే ప్రపంచంలో శాంతి సాధ్యమని అన్నారు. బ్యాంకాక్‌లో శుక్రవారంనాడు మూడవ ప్రపంచ హిందూ మహాసభలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సభలకు థాయ్‌లాండ్ ఆతిథ్యం ఇస్తోంది. ప్రారంభ సదస్సులో కారణాంతరాల వల్ల స్రెట్రా థావిసిన్ హాజరుకానప్పటికీ, ఆయన తన సందేశాన్ని పంపారు. ప్రధాని సందేశాన్ని సభలో వినిపించారు. హిందూయిజం సిద్ధాంతాలు, విలువలపై ఏర్పాటు చేసిన ప్రపంచ హిందూ మహా సదస్సుకు ఆతిథ్యం ఇవ్వడం తమకు దక్కిన గౌరవంగా భావిస్తున్నామని ఆయన ఈ సందర్భంగా తన సందేశంలో పేర్కొన్నారు. శాంతియుత సహజీవనాన్ని వేదాలు తెలియజేస్తున్నాయని, శాంతియుత విధానాలకు ఈ సిద్ధాంతాలే మూలమని అన్నారు.
మూడవ ప్రపంచ హిందూ మహాసభలకు మాతా అమృతానందమయి, భారత్ సేవాశ్రమ్ సంఘ్‌కు చెందిన స్వామి పూర్ణాత్మానంద్, ఆర్ఆర్ఎస్ సర్‌సంఘ్‌చాలక్ మోహనరావు భగవత్, సర్‌కార్యవహ్ దత్తాత్రేయ హోసబలె, వీహెచ్‌పీ ప్రధాన కార్యదర్శి మిలింద్ పరాండే, ఫౌండర్ ఫెలిసిటేటర్ ఆఫ్ ది ప్రోగ్రాం స్వామి విజ్ఞానంద్ హాజరై జ్యోతిప్రజ్వలన చేశారు. 61 దేశాలకు చెందిన 2200 మంది ప్రతినిధులను ఈ మహాసభలకు ఆహ్వానించారు. 25 దేశాలకు చెందిన ఎంపీలు, మంత్రులు హాజరవుతున్నారు. థాయ్‌లాండ్‌లో ఉంటున్న 10 లక్షల మంది భారత సంతతి ప్రజలు ఇందులో పాల్గోనున్నారు. ఈనెల 24 నుంచి 26 వరకూ మూడురోజుల పాటు ఈ మహాసభలు జరగనున్నాయి.