ముంబై: ప్రపంచకప్‌లో భాగంగా మంగళవారం అఫ్ఘానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆటగాడు గ్లెయిన్ మాక్స్‌వెల్ అద్భుతం చేశాడు. అద్భుతం కూడా కాదు. మహాద్భుతం చేశాడనే చెప్పుకోవాలి. అఫ్ఘానిస్థాన్ విసిరిన 292 పరుగుల లక్ష్య చేధనలో 91 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా ఓటమి అంచున నిలిచింది. ఈ క్రమంలో అంతా అఫ్ఘానిస్థాన్‌దే గెలుపునకున్నారు. కానీ గ్లెయిన్ మాక్స్‌వెల్ అద్భుతం సృష్టించాడు. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అండతో తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఒక వైపు కాలి గాయం బాధిస్తున్నప్పటికీ ఏ మాత్రం వెనకడుకు వేయని మాక్సీ ఒంటికాలుతో మిరాకిల్ చేశాడు. అఫ్ఘాన్ బౌలర్లను ఊచకోత కోస్తూ సెంచరీ, డబుల్ సెంచరీ కొట్టి జట్టుకు ఒంటి చేతితో విజయాన్ని అందించాడు. అఫ్ఘానిస్థాన్ ఫీల్డర్లు చేసిన కొన్ని తప్పిదాలు కూడా మాక్సీకి కలిసొచ్చాయి. కమ్మిన్స్‌తో కలిసి 8వ వికెట్‌కు అజేయంగా నెలకొల్పిన 202 పరుగుల భాగస్వామ్యంలో మాక్స్‌వెల్ ఒక్కడే 190 పరుగులు చేశాడంటే అతని విధ్వంసం ఏ స్థాయిలో కొనసాగిందో అర్థం చేసుకోవచ్చు. మొత్తంగా 128 బంతులు ఎదుర్కొన్న మాక్స్‌వెల్ 21 ఫోర్లు, 10 సిక్సులతో 201 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ క్రమంలో లక్ష్య చేధనలో డబుల్ సెంచరీ చేసిన తొలి బ్యాటర్‌గా నిలిచాడు. అటు ఈ విజయంతో ఆస్ట్రేలియాకు సెమీ ఫైనల్ బెర్త్ కూడా ఖరారు అయింది.
విజయం అనంతరం మాక్సీ మాట్లాడుతూ.. తన బ్యాటింగ్ తీరు పట్ల గర్విస్తున్నట్టు చెప్పాడు. జట్టు 92 పరుగులకే 7 వికెట్లు కోల్పోయినప్పుడు ఆందోళన చెందకుండా తమ ప్రణాళిక ప్రకారమే బ్యాటింగ్ చేశామని చెప్పుకొచ్చాడు. ఫీల్డర్లు క్యాచ్‌లు వదిలేయడం కన్నా ఎల్బీడబ్ల్యూ విషయంలో లైఫ్ దొరకడం తనకు ఎక్కువ ఉత్సాహాన్ని ఇచ్చిందని పేర్కొన్నాడు. అదే సమయంలో అఫ్ఘానిస్థాన్ బౌలర్లపై కూడా ప్రశంసలు కురిపించిన మాక్సీవెల్ ఇది తాను ఒక్క అవకాశం కూడా ఇవ్వని ఇన్నింగ్స్ అయి ఉంటే మరింత బాగుండేదని అన్నాడు. ‘‘ఫీల్డింగ్ సమయంలో వేడి ఎక్కువగా ఉంది. బ్యాటింగ్ సమయంలో క్రీజులో సుదీర్ఘంగా ఉండడంతో కాళ్లు పట్టేశాయి. మేం 92 పరుగులకే 7 వికెట్లు కోల్పోయినప్పుడు ఎక్కువగా ఆందోళన చెందలేదు. నా బ్యాటింగ్ తీరు పట్ల గర్వంగా ఉంది. అప్పటికే వికెట్లు పడినప్పటికీ కమిన్స్‌తో కలిసి చివరిదాకా పోరాడాలనుకుని నిర్ణయించుకుని ముందుకు సాగాను. మా ప్రణాళికలకు అనుగుణంగానే బ్యాటింగ్ చేశాం. కొన్ని క్యాచ్‌లు వెళ్లిన వాటిని అఫ్ఘన్ ఫీల్డర్లు వదిలేయడం కలిసొచ్చింది. అయితే నాకు దానికన్నా ఎల్బీడబ్ల్యూ విషయంలో లైఫ్ దొరకడం చాలా ఉత్సాహాన్ని కల్గించింది. అఫ్ఘానిస్థాన్ బౌలర్లు కూడా అద్భుతంగా బౌలింగ్ చేశారు. అయితే ఇది ఒక్క అవకాశం కూడా ఇవ్వని ఇన్నింగ్స్ అయి ఉంటే మరింత బాగుండేది. ఈ మ్యాచ్‌లో నేను ఆడిన విధానం పట్ల గర్వంగా ఉంది. మేము తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడినప్పటికీ ఆ తర్వాత పుంజుకున్న తీరు అద్భుతంగా ఉంది. జట్టుపై మాకు ఎప్పుడూ నమ్మకం ఉంది. ఈ విజయం తర్వాత అది మరింత పెరుగుతుంది.’’ అని చెప్పాడు.
కాగా నూర్ అహ్మద్ వేసిన 21వ ఓవర్ రెండో బంతికి మాక్స్‌వెల్‌ను ఎల్బీడబ్ల్యూ రూపంలో అంపైర్ ఔట్‌గా ప్రకటించాడు. కానీ మాక్సీ రివ్యూకు వెళ్లాడు. రివ్యూలో బంతి స్టంప్స్‌ను మిస్సైనట్టు తేలింది. దీంతో మాక్స్‌వెల్ ఔట్ అయ్యే ప్రమాదం నుంచి బయటపడడమే కాకుండా జట్టును కూడా గెలిపించాడు. పైగా అప్పటికీ మాక్స్‌వెల్ చేసింది 27 పరుగులే. 33 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఉన్నప్పుడు మాక్స్‌వెల్ ఇచ్చిన క్యాచ్‌ను అప్ఘానిస్థాన్ ఫీల్డర్లు వదిలేశారు. దీంతో వచ్చిన అవకాశాలను వినియోగించుకున్న మాక్స్‌వెల్ జట్టును ఒంటి చేతితో గెలిపించాడు.