డబ్లిన్: వరుణుడి ఖాతాలోకి ఓ మ్యాచ్ చేరింది. ఐర్లాండ్, భారత్ జట్ల మధ్య బుధవారం జరగాల్సిన మూడో, ఆఖరి టీ20 మ్యాచ్ ఒక్క బంతి కూడా పడకుండా రద్దయింది. జోరున వర్షం కురవడంతో టాస్ కూడా సాధ్యపడలేదు. దీంతో మూడు టీ20ల సిరీస్‌ను భారత్ 2-0తో సొంతం చేసుకొంది. ఒకానొక దశలో వరుణుడు శాంతించడంతో కనీసం 5 ఓవర్ల మ్యాచ్ అయినా జరుగుతుందని అభిమానులు భావించారు. పిచ్‌పై కవర్లు తొలగించగా.. ఆటగాళ్లు మైదానంలో ప్రాక్టీస్‌కు దిగారు. కానీ, అవుట్ ఫీల్డ్ చిత్తడిగా మారడంతో ఆట సాధ్యం కాదని తేల్చిన అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. కాగా, చంద్రయాన్-3 ల్యాండింగ్‌ను టీమిండియా ఆటగాళ్లు టీవీలో చూసి ఆనందించారు. ఈ ఫొటోలు, వీడియోను బీసీసీఐ నెట్‌లో పోస్టు చేసింది. ఈ ఉత్సాహంతో భారత ఆటగాళ్లు మ్యాచ్‌లో చెలరేగుతారనుకొంటే.. వరుణుడు నీళ్లు కుమ్మరించాడు. అయితే, వెన్నుముక శస్త్రచికిత్స తర్వాత కోలుకొని బరిలోకి దిగిన తొలి సిరీస్‌లోనే పేసర్ బుమ్రా ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’గా నిలవడం టీమిండియాకు ఊరటనిచ్చే విషయం.