హాంగ్జౌ: ఆసియా క్రీడలు మెన్స్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకుంది. ఆఫ్ఘనిస్థాన్‌తో జరుగుతున్న ఈ ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ముందుగా బౌలింగ్ చేస్తామని తెలిపాడు. ఈ మ్యాచ్ 11.30 గంటలకే ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైంది. ఫైనల్‌లో గెలిచిన జట్టు బంగారు పతకాన్ని కైవసం చేసుకుంటుంది. దీంతో ఆఫ్థనిస్థాన్‌ను ఓడించి స్వర్ణాన్ని ఖాతాలో వేసుకోవాలని భారత జట్టు పట్టుదలగా ఉంది. మరోవైపు ఉమెన్స్ క్రికెట్‌లో భారత క్రికెట్ జట్టు బంగారు పతకం గెలిచిన సంగతి తెలిసిందే.
తుది జట్లు
ఆఫ్ఘనిస్తాన్: జుబైద్ అక్బరీ, మహ్మద్ షాజాద్(వికెట్ కీపర్), నూర్ అలీ జద్రాన్, షాహిదుల్లా కమల్, అఫ్సర్ జజాయ్, కరీం జనత్, గుల్బాదిన్ నైబ్(కెప్టెన్), షరాఫుద్దీన్ అష్రఫ్, కైస్ అహ్మద్, ఫరీద్ అహ్మద్ మాలిక్, జహీర్ ఖాన్
భారత్: యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే, రింకూ సింగ్, జితేష్ శర్మ(వికెట్ కీపర్), షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, అర్ష్‌దీప్ సింగ్
అంతకుముందు కాంస్య పతకం కోసం జరిగిన పోరులో పాకిస్థాన్‌కు బంగ్లాదేశ్ షాకిచ్చింది. పాకిస్థాన్‌పై 6 వికెట్ల తేడాతో గెలిచిన బంగ్లాదేశ్ కాంస్య పతకాన్ని గెలిచింది. వర్షం కారణంగా డక్ వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం మ్యాచ్‌ను 5 ఓవర్లపాటు నిర్వహించారు. మొదట 5 ఓవర్లలో పాకిస్థాన్ జట్టు వికెట్ నష్టానికి 48 పరుగులు చేసింది. ఆ తర్వాత వర్షం రావడంతో మ్యాచ్ ఆగిపోయింది. వర్షం ఆగాక బంగ్లాదేశ్ లక్ష్యాన్ని 5 ఓవర్లలో 65 పరుగులుగా నిర్దేశించారు. 4 ఓవర్లలో 45 పరుగులే చేసిన బంగ్లాదేశ్ చివరి ఓవర్లో 20 పరుగులు చేసి గెలిచింది.