Bharatha Sakthi

పాకిస్థాన్‌లో జాక్ మా రహస్య పర్యటన.. కారణమేటంటే

admin 04/07/2023
Updated 2023/07/04 at 10:04 AM

ఇస్లామాబాద్: చైనీస్ బిలీనియర్, అలీబాబా గ్రూప్ సహ వ్యవస్థాపకుడు (Chinese billionaire and co-founder of Alibaba Group, Jack Ma) జాక్ మా అనూహ్యంగా, అకస్మాత్తుగా పాక్‌లో(Pakistan) పర్యటించడం చర్చనీయాంశంగా మారింది. ఈ వార్తలను పాకిస్థాన్ స్థానిక ఇంగ్లీష్ వార్తాపత్రిక ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ ప్రచురించింది. జాక్ మా పర్యటన రహస్యంగా సాగిందని సదరు వార్తా పత్రిక పేర్కొంది. ఈ వార్తలపై స్పందించిన బోర్డు ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ (BOI) మాజీ చైర్మన్ మహమ్మద్ అజ్ఫర్ అహ్సన్.. జాక్ మా పర్యటన నిజమేనని ధృవీకరించారు. జాక్ మా జూన్ 29న లాహోర్‌కు వచ్చారని, 23 గంటలపాటు అక్కడే ఉన్నారని పేర్కొన్నారు. అయితే ఈ పర్యటనలో ప్రభుత్వ అధికారులు, మీడియాకు జాక్ మా దూరంగా ఉన్నారని అహ్సన్ తెలిపారు. జాక్ మా ఒక ప్రైవేట్ ప్రదేశంలో ఉన్నారని తెలిపారు. వచ్చిన పని ముగించుకుని జెట్ ఏవియేషన్ యాజమాన్యంలోని వీపీ-సీఎంఏ పేరుతో రిజిస్టర్ చేసిన ఓ ప్రైవేట్ జెట్‌లో జూన్ 30న తిరిగి వెళ్లిపోయారని చెప్పారు.

జాక్ మా పర్యటన ప్రస్తుతం రహస్యంగా సాగినప్పటికీ, రాబోయే రోజుల్లో ఇది పాకిస్థాన్‌కు సానుకూల ఫలితాలను ఇస్తుందని ముహమ్మద్ అజ్ఫర్ అహ్సన్ ఆశాభావం వ్యక్తం చేసినట్లు ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ వార్తాపత్రిక పేర్కొంది. ‘‘జాక్ మా ఒంటరిగా రాలేదు. ఆయనతోపాటు ఏడుగురు వ్యాపారవేత్తలు కూడా ఉన్నారు. అందులో చైనా వ్యాపారవేత్తలు ఐదుగురు, ఒక డానిష్ వ్యక్తి, ఒక యూఎస్ పౌరుడు ఉన్నారు. వారు హాంకాంగ్ నుంచి నేపాల్ వెళ్లి అక్కడి నుంచి పాకిస్థాన్‌కు వచ్చారు.’’ అని సదరు వార్తా పత్రిక చెప్పుకొచ్చింది. అయితే జాక్ మా అతని బృందం పాకిస్థాన్‌లో పర్యటించడంపై సోషల్ మీడియాలో అనేక ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. జాక్ మా తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఇతర దేశాల్లో విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నారని ఇందులో భాగంగా పాకిస్థాన్‌లో పర్యటించారని పలువురు చెబుతున్నారు. జాక్ మా అనేక వాణిజ్య కేంద్రాలను సందర్శించారని, ప్రముఖ వ్యాపారవేత్తలు, వివిధ వాణిజ్య ఛాంబర్‌ల అధికారులతో సమావేశమయ్యారని అంటున్నారు. అయితే ఈ సమావేశాలు, వ్యాపార ఒప్పందాలకు సంబంధించి ఎలాంటి నిర్దారణ లేదు. దీనిని బట్టి జాక్ మా పాకిస్థాన్‌లో పర్యాటించాడు కానీ ఎలాంటి వ్యాపార ఒప్పందాలు చేసుకోలేదని తెలుస్తోంది.

అయితే జాక్ మా పర్యటన కేవలం వ్యక్తిగత ప్రయోజనాల కోసమేనని అహ్సాన్ ఒక ట్వీట్‌లో స్పష్టం చేశారు. ఇక్కడ ఆసక్తికర విషయం ఏమిటంటే జాక్ మా పర్యటన గురించి చైనా రాయబార కార్యాలయానికి కూడా తెలియదని ఆయన చెప్పారు. అయితే జాక్ మా పర్యటన వ్యక్తిగతమే అయినప్పటికీ పాకిస్థాన్ ఖ్యాతిని పెంచడంలో సహాయపడిందని అహ్సాన్ ఆశాభావం వ్యక్తం చేశారు. మొత్తానికి జాక్ మా తమ దేశంలో పర్యటించడం పాకిస్థాన్‌కు వ్యాపారపరంగా మంచి వాతావరణాన్ని ఏర్పాటు చేసిందనే చెప్పుకోవాలి. అయితే ఈ పర్యటన కేవలం సందర్శనకే పరిమితవుతుందా? లేదంటే భవిష్యత్‌లో ఏమైనా వ్యాపారానికి శ్రీకారం చూడుతుందేమో తెలియాలంటే కొంత కాలం వేచి చూడాల్సిందే.

Share this Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *