గర్బిణీలు.. పుట్టబోయే శిశువుల సంరక్షణ కోసం తెలంగాణ సర్కారు ‘కేసీఆర్ కిట్’ పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల శాతాన్ని పెంచాలనే ఉద్దేశ్యంతో ఈ పథకాన్ని అమలు చేయాలని యెచించింది. కానీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ పథకం అటకెక్కిందా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆరు నెలలుగా కేసీఆర్ కిట్ కోసం బాలింతలు, పుట్టే బిడ్డలకు చేల్లించాల్సిన నగదు బదిలీలు నిలిచిపోవడంతో ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది. దీంతో మేడ్చల్ జిల్లాలో డబ్బుల కోసం లబ్దిదారులు పెద్ద సంఖ్యలో ఎదురుచూస్తున్నారు.ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల శాతాన్ని పెంచేందుకు 2017లో తెలంగాణ ప్రభుత్వం ‘కేసీఆర్ కిట్’ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రవేశపెట్టింది. బాబు పుడితే రూ.12 వేలు, పాప పుడితే రూ.13 వేల నగదు ఈ పథకం కింద అందజేస్తారు. గర్భం దాల్చిన అనంతరం నమోదు చేసుకున్న తర్వాత నాలుగు విడుతలుగా నగదును అందజేస్తారు. ప్రసవం అయ్యాక శిశువు సంరక్షణకు ఉపయోగపడే 16 రకాల వస్తువులను కేసీఆర్ కిట్‌గా ఇస్తారు. రెండు కాన్పుల వరకే ఈ పథకం వర్తిస్తుంది. కేసీఆర్ కిట్ ప్రారంభమయ్యాక మేడ్చల్ జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాలు పెరిగాయి. జిల్లాలోని 39 ప్రభుత్వ ఆసుపత్రులలో పెద్ద ఎత్తున ప్రసవాలు నమోదయ్యాయి. వీటిలో అత్యధికంగా బాలానరగ్ ప్రైమరీ హెల్త్ సెంటర్ 34,213 డెలివరీలు కాగా, కుత్బుల్లాపూర్ పీహెచ్సీలో 22,620, ఉప్పల్‌లో 19,322 ప్రసవాలు నమోదయ్యాయి. ఇలా పథకం ప్రవేశ పెట్టిన 2017, జూన్ 1వ తేదీ నుంచి 2022 జూన్, 24వ తేదీ వరకు ఒక లక్ష 84 వేల 448 ప్రసవాలు జరిగినట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి.కేసీఆర్ కిట్ పథకం కింద జిల్లాలో ఆరు మాసాలుగా చెల్లింపులు ఆగిపోయాయి. గత జనవరి నుంచి రాష్ట్ర సర్కారు నుంచి బడ్జెట్ రిలీజ్ కాలేదని వైద్య వర్గాలు చెబుతున్నాయి. దీంతో 3,974 మంది లబ్దిదారులు కేసీఆర్ కిట్ నగదు కోసం ఎదిరిచూస్తున్నారు. వీరిలో 3,443 మంది లబ్దిదారుల ఎంపిక పూర్తవ్వగా, మరో 531 మంది లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. వీరికి రూ.4 కోట్లకు పైగా బకాయిలు చెల్లించాల్సి ఉంది. కాగా ఏటా ఈ పథకానికి నిధులను ప్రభుత్వం తగ్గిస్తూ వస్తోంది.ఈ పథకానికి 2020 `21, బడ్జెట్ లో రూ.443 కోట్లు కేటాయించగా, 2021` 22 బడ్జెట్లో కేవలం రూ. 355 కోట్లు మాత్రమే కేటాయించారు. బడ్జెట్ కేటాయింపులు తగ్గడంతోనే పథకం సక్రమంగా అమలు కావడంలేదన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అంతేకాకుండా కేసీఆర్ కిట్ పథకం కోసం వేల సంఖ్యలో లబ్దిదారులు ఎదిరిచూస్తున్నారు. దీనికీతోడు ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కేసీఆర్ కిట్ కోసం డబ్బులు చెల్లిస్తుందా..? మరింత కాలయాపన చేస్తుందా..? వేచి చూడాలి మరీ.