సాధారణంగా బ్యాంకుల్లో గానీ, స్టోర్స్‌లో గానీ దొంగతనం చేయాలంటే.. దొంగలు ఒక పక్కా ప్లానింగ్ వేసుకుంటారు. తుపాకులతో రంగంలోకి దిగి.. ప్రజల్ని బంధీలుగా చేసి.. తమకు కావాల్సింది దోచుకొని వెళ్లిపోతారు. సినిమాల్లోనూ దాదాపు ఇలాంటి సీన్లనే చూపిస్తుంటారు. కానీ.. అమెరికాలోని ఒక స్టోర్‌లో మాత్రం కనీవినీ ఎరుగని రీతిలో దోపిడీ జరిగింది. 10 కాదు, 20 కాదు.. ఏకంగా 50 మంది సభ్యులు గల ఒక గ్రూపు ఓ స్టోర్‌పై దండయాత్ర చేసి.. అల్లకల్లోలం సృష్టించింది. ఏకంగా లక్ష డాలర్లు విలువ చేసే వస్తువుల్ని దోచుకెళ్లింది. ఇక్కడ వీళ్లు తుపాకులు గానీ, ఇతర ఆయుధాల్ని గానీ వినియోగించలేదు. కేవలం పెప్పర్ స్ర్పే మాత్రమే వినియోగించారు. ఈ ఘటన లాస్ ఏంజెల్స్‌లో ఉన్న టొపంగా మాల్లోని నార్డ్‌స్ట్రామ్ డిపార్ట్మెంట్ స్టోర్‌లో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.
అప్పటివరకూ ఆ స్టోర్‌లో ప్రశాంత వాతావరణం ఉంది. ప్రజలందరూ రొటీన్‌గా తమ షాపింగ్ చేసుకుంటున్నారు. అక్కడి పరిస్థితులన్నీ సవ్యంగా, చాలా కూల్‌గా ఉన్నాయి. కానీ.. ఇంతలో 50 మంది సభ్యుల గ్రూప్ ఆ స్టోర్‌లోకి దూసుకొచ్చింది. ఆ గ్రూపులో ఉన్న ప్రతిఒక్కరూ ముసుగులు ధరించారు. స్టోర్‌లోకి వచ్చిన వెంటనే వాళ్లు భద్రతా సిబ్బందిపై పెప్పర్ స్ర్పేను ప్రయోగించారు. అడ్డమొచ్చిన వాళ్లను చితకబాదారు. అనంతరం చేతికి దొరికిన వస్తువుల్ని తీసుకొని, అక్కడి నుంచి వాళ్లు వెళ్లిపోయారు. ఆ ముసుగు దొంగలు ఎంత వేగంగా దూసుకొచ్చారో, అంతే వేగంగా దోపిడీ చేసి అక్కడి నుంచి జారుకున్నారు. శనివారం సాయంత్రం 4 గంటలకు జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ దుండగులు బీఎండబ్ల్యూ, లెక్సస్ వంటి ఖరీదైన వాహనాల్లో వచ్చి.. ఈ దోపిడీకి పాల్పడ్డారు
స్థానికంగా ఈ దోపిడీ సంచలనంగా మారడంతో.. పోలీసులు ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. ఆ దోపిడీదారులు చేసిన దాడుల్లో ఒక సెక్యూరిటీ సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. పెప్పర్ స్ర్పే కారణంగా అతడు శ్వాసకోశ ఇబ్బందులు ఎదుర్కుంటున్నాడు. చికిత్స నిమిత్తం అతడ్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. స్థానికుల్ని ఈ ఘటన భయాందోళనలకు గురి చేసిందని, తాము వెంటనే వారిని పట్టుకుంటామని అధికారులు తెలిపారు. తమ విచారణలో ఇప్పటికే కొన్ని ఆధారాలు దొరికాయని.. గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని అన్నారు.