జీహెచ్ఎంసీ బీజేపీ కార్పొరేటర్లతో సమావేశం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తప్పుబట్టారు.. కార్పొరేటర్లు కమ్యూనిటీ సేవ చేయాలన్న వ్యాఖ్యలపై స్పందించారు. ప్రభుత్వాన్ని నడుపుతున్నారా లేక ఎన్జీవోనా అని కౌంటర్ ఇచ్చారు. ‘హైదరాబాద్‌కు వరద సాయం, మెట్రో విస్తరణ, మూసీ పునరుద్ధరణకు ఆర్థిక సాయం అందించేందుకు ఆలోచనలు చేస్తున్నారా? ఐటీఐఆర్‌పై ఏమైనా పురోగతి ఉందా?’ అని ట్వీట్‌లో ప్రశ్నలు గుప్పించారు. హైదరాబాద్‌కు ఏమో ఒట్టి మాటలు.. గుజరాత్‌కు ఏమో నిధుల మూటలా అంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు.
ఈ శతాబ్దంలోనే హైదరాబాద్ భారీ వరదలు ఎదుర్కొందని, కానీ ప్రధాని నరేంద్ర మోదీ ఒక్క రూపాయి కూడా ఆర్థిక సాయం చేయలేదని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. 2018 నుంచి ఇప్పటివరకు ఎన్డీఆర్‌ఎఫ్ నిధులు తెలంగాణకు ఇవ్వలేదని, దానికి సంబంధించిన వివరాలను మంత్రి ట్వీట్ చేశారు. ప్రధాని మోదీని ట్యాగ్ చేసి నిలదీశారు.
ఇక అంతకుముందు జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లు, బీజేపీ ముఖ్య నేతలను ప్రధాని మోదీని ఢిల్లీలోని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా గంటన్నర పాటు సమావేశమై మోదీ పలు విషయాలు చర్చించారు. కార్పొరేటర్లకు రాజకీయ జీవితం ఇప్పుడే ఆరంభమైందని, కష్టపడితే భవిష్యత్‌లో మంచి నాయకులు అవుతారన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండాలని, వారి సమస్యల పరిష్కారానికి పోరాడాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఎమ్మెల్యే స్థాయిలో పోరాటం చేయాలని దిశానిర్దేశం చేశారు.