Bharatha Sakthi

మంత్రి కేటీఆర్ విదేశీ పర్యటనకు అన్ని కోట్ల రూపాయలా

admin 09/06/2022
Updated 2022/06/09 at 3:36 AM

KTR Foreign Trip Cost| KT Rama Rao: రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఇటీవల యూకే, దావోస్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ పర్యటనలో భాగంగా చేసిన ఖర్చుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేటీఆర్ 10 రోజుల విదేశీ పర్యటనకు గానూ మొత్తం రూ. 13.22 కోట్లు ఖర్చయింది. దీనిపై విపక్షాలు స్పందిస్తూ ఫైర్ అవుతున్నాయి. ధనిక రాష్ట్రం అని చెప్పుకుంటూ తెలంగాణను దివాలా తీయించారని.. చివరకు అప్పుల దొరకని పరిస్థితికి తెచ్చారని మండిపడుతున్నాయి. ఆదాయం సమకూరడంలోనే కాదు.. ఖర్చులు అతిగా చేయడంలోనూ తెలంగాణ మొదటి స్థానంలోనే ఉందని సెటైర్లు వేస్తున్నాయి.

వివరాల్లోకి వెళ్తే.. గత నెల 22వ తేదీ నుంచి 26 వరకు స్విడ్జర్‌లాండ్‌లోని దావోస్‌లో జరిగిన వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సమావేశాల్లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. అంతకుముందు ఐదు రోజుల పాటు యూకేలోనూ పర్యటించారు. ఆయనతోపాటు ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్‌, మరో 8 మంది అధికారులు వెళ్లారు. తొలుత మంత్రి విదేశీ పర్యటనకు బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.2 కోట్లు కేటాయించింది. అయితే అవి సరిపోవని అదనంగా రూ.7.80 కోట్లు కావాలని అధికారులు కోరడంతో ప్రభుత్వం అందుకు అంగీకరించింది.

ఇలా అప్పటికే మొత్తం రూ.9.80 కోట్లను ఆర్థిక శాఖ విడుదల చేసింది. అయితే అదనంగా రూ.3.42 కోట్లు కావాలని తాజాగా అధికారులు కోరారు. దీంతో ఆర్థిక శాఖ రెండోసారి అదనపు నిధులను మంగళవారం మంజూరు చేసింది. దీంతో మంత్రి కేటీఆర్‌ యూకే, దావోస్‌లలో 10 రోజుల ఖర్చు మొత్తం రూ.13.22 కోట్లకు చేరింది. ఇటు అంతకుముందు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా వివిధ వార్తా పత్రికల్లో ఇచ్చిన యాడ్‌లపై కూడా విమర్శలు వ్యక్తమయ్యాయి.

జూన్ 2వ తేదీన ఏపీ, తెలంగాణల్లోని తెలుగు, ఇంగ్లిష్ వార్తా పత్రికలే కాకుండా.. ఇతర రాష్ట్రాల్లోని ఇంగ్లిష్ పత్రికల ఎడిషన్లతోపాటు తమిళం, మరాఠీ, కన్నడ, ఒడియా లాంటి భారతీయ భాషల్లోనూ కేసీఆర్ ప్రకటనలు కనిపించాయి. దీంతో కేసీఆర్ సర్కార్ తీరుపై ప్రతిపక్షాలు ఫైర్ అయ్యాయి. ‘తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జూన్ 2న దేశవ్యాప్తంగా ఇచ్చిన పత్రికా ప్రకటనల ఖర్చు కనీసం రూ.30 కోట్లు ఉంటది. అసలే ఆర్థిక సంక్షోభంలో కూరుకొని ఉన్నం. జీతాలు టైంకు లేవు, రైతులకు భీమా లేదు, పింఛన్లు లేవు, బిల్లులు లేవు.. ప్రజాధనాన్ని ఇలా ఎలా వృథా చేస్తారు?’ అని బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే ప్రకటనల కోసం ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందో వెల్లడించాలంటూ ఆర్టీఐ ద్వారా ఓ బీజేపీ నేత తాజాగా దరఖాస్తు చేశారు.

Share this Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *