జిల్లాలోని జైపూర్ సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం (ఎస్టిపిపి) కి జాతీయస్థాయిలో నీటి వినియోగ సామర్థ్యంలో అత్యుత్తమ యూనిట్ గా అరుదైన అవార్డును అందుకుంది. ప్రతిష్టాత్మక కౌన్సిల్ ఆఫ్ ఎన్విరో ఎక్సలెన్స్ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో జరిగిన ద్వితీయ జాతీయస్థాయి అత్యుత్తమ థర్మల్ ప్లాంట్ల బహుమతి ప్రదానోత్సవ వేడుకలో సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రానికి బెస్ట్ నేషనల్ వాటర్ ఎఫిషియంట్ యూనిట్ అవార్డును అతిథులు సింగరేణి ప్రతినిధులకు అందజేశారు. జాతీయస్థాయిలో 500 మెగావాట్ల పైబడిన సామర్థ్యం గల సుమారు 150 ప్రభుత్వ, ప్రైవేట్ రంగ విద్యుత్ కేంద్రాలలో సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం ఈ అవార్డును సాధించడం పట్ల సంస్థ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ బలరామ్, ఈఅండ్ఎం డైరెక్టర్ డి సత్యనారాయణ రావు హర్షం వ్యక్తం చేస్తూ, సిబ్బందికి అభినందనలు తెలిపారు. సాధారణంగా థర్మల్ విద్యుత్ కేంద్రాలలో గంటలో ఒక మెగా వాట్ విద్యుత్ ఉత్పాదనకు గరిష్టంగా మూడు ఘనపు మీటర్ల నీటిని వినియోగించడాన్ని ప్రామాణికంగా సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ వారు సూచిస్తుంటారని, సాధారణంగా థర్మల్ విద్యుత్ కేంద్రాలలో ఈ ప్రమాణాన్ని దాటే నీటి వినియోగం ఉంటుందని, ఎస్టిపిపి సిబ్బంది తీసుకున్న ప్రత్యేక చర్యలు, వినియోగిస్తున్న సాంకేతికత వలన ఒక గంటలో మెగావాట్ విద్యుత్ ఉత్పాదనకు నిర్దేశించిన ప్రమాణాల కన్నా తక్కువగా అనగా 2.8 ఘనపు మీటర్ల నీటిని మాత్రమే వినియోగిస్తోందని సింగరేణి యాజమాన్యం వివరించింది. దీనితో ఈ అవార్డును జాతీయస్థాయిలో ఎస్టిపిపి దక్కించుకుందని తెలిపింది. గతంలో సైతం ఈ తరహా అవార్డులను ఇదే ప్లాంటు పలుమార్లు అందుకుందని పేర్కొంది
ప్రత్యేక శ్రద్ధ- ఆధునిక సాంకేతికతతో గుర్తింపు
విద్యుత్ ఉత్పాదనకు అతి తక్కువ నీటిని వినియోగించుకోవడం కోసం సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం వినూత్నమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తోందని, ముఖ్యంగా హైడ్రోబిన్ సిస్టం వినియోగించడం వల్ల నీటి వినియోగం తక్కువగా ఉంటుందంది. అదేవిధంగా జీరో లిక్విడ్ డిస్చార్జి (జెడ్ఎల్డి) వ్యవస్థలను సైతం నిర్వహించడం వల్ల ప్లాంట్ లో వివిధ విభాగాల నుంచి బయటకు విడుదలవుతున్న అపరిశుభ్ర నీటిని సైతం పూర్తి స్థాయిలో శుద్ధి చేస్తూ, తిరిగి వినియోగిస్తుందని వివరించారు. ప్లాంట్లలో ఉత్పత్తి అయ్యే ఫ్లై యాష్ ను సైతం ఎప్పటికప్పుడు బయటకు రవాణా చేస్తూ ఉండటం వల్ల ఈ ప్రక్రియకు వాడాల్సిన నీటిని కూడా పొదుపు చేయగలుగుతుందని పేర్కొంది. నిరంతరాయంగా నీటి నాణ్యత, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్న నేపథ్యంలోనే సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం బెస్ట్ వాటర్ ఎఫిషియెంట్ ప్లాంట్ గా జాతీయ అవార్డుకు ఎంపికైందని తెలిపింది. ఈ అవార్డును ఎస్టిపిపి తరుపున అధికారులు కె చంద్రలింగం, ఎల్జెవి సుబ్బారావు, ఐఆర్ఈడి మాజీ డైరెక్టర్ నుంచి అందుకున్నారు.
పర్యావరణ చర్యలకు అనేక అవార్డులు
సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలో యాజమాన్యం తీసుకుంటున్న అనేక పర్యావరణహిత చర్యలకు ఇప్పటికే పలు జాతీయస్థాయి అవార్డులను ఈ కేంద్రం అందుకుంది. నూటికి నూరు శాతం ఫ్లై యాష్ ను సద్వినియోగం చేస్తున్నందుకుగాను దక్షిణ భారత దేశ స్థాయిలో అత్యుత్తమ ప్లాంట్ గా మిషన్ ఎనర్జీ ఫౌండేషన్ వారి ద్వారా గోవాలో గత నెలలో జరిగిన కార్యక్రమంలో అవార్డును అందుకుంది. ఈ ప్లాంట్ ప్రారంభించినప్పటి నుండి ప్రతి ఏడాది అత్యుత్తమ ఫ్లై యాష్ వినియోగం అవార్డులు అందుకుంటూ వస్తోంది. సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని నూరు శాతం పర్యావరణహిత ప్లాంట్ గా రూపుదిద్దడం కోసం సుమారు 696 కోట్ల రూపాయల వ్యయంతో ఫ్లూ గ్యాస్ డి సల్ఫరైజేషన్ (ఎఫ్.డి.జి) వ్యవస్థను సైతం సింగరేణి సంస్థ ఏర్పాటు చేయబోతుండగా త్వరలో నిర్మాణం పూర్తి కావస్తోంది. దీంతో ఇటువంటి భారీ నిర్మాణాన్ని చేపట్టిన తొలి ప్రభుత్వ సంస్థగా సింగరేణి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందనుంది.