“స్వాతంత్య్రం నా జన్మహక్కు. అందుకు సంబంధించిన స్పృహ నాలో ఎప్పుడూ చైతన్యవంతంగా ఉంటుంది. ఆ స్ఫూర్తిని ఏ ఆయుధమూ ఖండించలేదు. ఏ నిప్పూ దహించలేదు. ఏ నీరూ తడిపి ముద్ద చెయ్యలేదు. ఏ గాలీ ఎండిపోయేటట్టు చేయలేదు. మనం స్వయంపాలన కోరాలి. సాధించుకోవాలి.” 1917 లో నాసిక్లో జరిగిన హోం రూల్ లీగ్ తొలి వార్షికోత్సవంలో.. లోకమాన్య బాలగంగాధర తిలక్ ఇచ్చిన ఉపన్యాసంలో నిప్పు కణికలు. అది చెప్పిన తిలక్ వయస్సుమీరిన వ్యక్తే కావచ్చు.. కానీ ఆ మాటలు యువకుల్లో అంతులేని శక్తిని నింపాయి. తనది వృద్ధుడి శరీరమే అయినా తన ఆత్మ మాత్రం ఎప్పటికీ శిథిలం కాదని అన్నారు. స్వాతంత్య్రం అన్న భావనను.. ఆత్మతో అనుసంధానం చేసి, తరువాతి తరం దానిని అనుభవించాలని ఆయన ఆకాంక్షించారు. “స్వరాజ్యం నా జన్మహక్కు. దాన్ని నేను పొంది తీరుతాను” అని గర్జించిన బాలగంగాధర తిలక్.. స్వాతంత్య్రోద్యమ చరిత్రలో భారతదేశ ప్రతిష్టను ఇనుమడింప చేశారు. భారత స్వాతంత్రోద్యమ చరిత్రకు తాత్విక భూమిక పోషించిన వారిలో.. తిలక్ అగ్రగణ్యులు.
1856 జూలై 23 న మహారాష్ట్రలోని రత్నగిరిలో జన్మించారు.. బాల గంగాధర తిలక్. తండ్రి గంగాధర్ రామచంద్ర తిలక్ సంస్కృత పండితుడు. తల్లి పార్వతీ బాయి ఆధ్యాత్మిక సంపన్నురాలు, బాల్యంలో తిలక్ చాలా చురుకైన విద్యార్థి. ప్రత్యేకించి గణితశాస్త్రంలో ఆయన విశేష ప్రతిభ కనబరచేవారు. అన్యాయానికి ఎదురునిలిచే వారు. నిజాయితీతో పాటు ముక్కుసూటితనం ఆయనగా సహజంగా ఉన్న లక్షణం. కళాశాలకు వెళ్ళి ఆధునిక విద్యనభ్యసించిన తొలితరం భారతీయ యువకుల్లో ఆయనొకరు. తిలక్ కు పదేళ్ళ వయసున్నప్పుడు ఆయన తండ్రికి రత్నగిరి నుంచి పూణెకు బదిలీ అయింది. ఇది తిలక్ జీవితంలో పెనుమార్పు తీసుకువచ్చింది. పుణె ఆంగ్లోవెర్నాకులర్ పాఠశాలలో చేరి కొందరు ప్రసిద్ధి చెందిన ఉపాధ్యాయుల వద్ద విద్యనభ్యసించారు. ఐతే పూణెకు వచ్చిన కొంతకాలానికే ఆయన తన తల్లిని, పదహారేళ్ళ వయసులో తన తండ్రిని కోల్పోయారు.
మెట్రిక్యులేషన్ చదువుతున్నప్పుడే సత్యభామ అనే పదేళ్ళ అమ్మాయితో పెళ్ళయింది. మెట్రిక్ పాసయ్యాక దక్కన్ కళాశాలలో చేరాడు. 1877లో తిలక్ గణితశాస్త్రంలో ప్రథమశ్రేణిలో పట్టభద్రుడయ్యారు. ఆ తర్వాత తనచదువును కొనసాగించి LLB పట్టా కూడా పొందారు. తన చిన్ననాటి స్నేహితుడు గోపాల్ గణేశ్ అగార్కర్, ఇంకా మహాదేవ బల్లాల్ నామ్ జోషి, విష్ణుశాస్త్రి చిపూంకర్ కలసి తిలక్.. దక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీని స్థాపించారు. యువతకు నాణ్యమైన విద్యను అందించడమే ఈ సంస్థ ధ్యేయం. భారతీయ చింతన ప్రాతిపదికగా జాతీయ భావాలను పెంపొందించడమే ఆ సొసైటీ ఆశయం. ఈ వ్యవస్థాపకులంతా సంవత్సరం పాటు ఉచితంగానే విధులు నిర్వహించారు. తిలక్ గణితం, సంస్కృతం బోధించేవారు. న్యూ ఇంగ్లీష్ స్కూలు, ఫెర్గూసన్ కళాశాల దక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీయే స్థాపించింది. పూణె కేంద్రంగా ఇవి పనిచేసేవి.
భారత జాతీయ కాంగ్రెస్ ను స్థాపించిన ఐదేళ్ల తరువాత తిలక్ మొదటిసారి సభలకు హాజరయ్యారు. చాలాకాలం ఆ సంస్థలో కొనసాగినా మితవాదుల ధోరణి ఆయనకు సమ్మతంగా ఉండేది కాదు. విన్నపాలు, వినతులు వలస ప్రభుత్వాన్ని లొంగదీయ లేవని తిలక్ సిద్ధాంతం. కానీ ఆయన కాంగ్రెస్లోని చాలామంది ప్రముఖులను విశేషంగా గౌరవించే వారు. దాదాభాయ్ నౌరోజీ అంటే ఎంతో గౌరవం. భారత పేదరికం బ్రిటిష్ పుణ్యమేనన్న నౌరోజీ సిద్ధాంతాన్ని సమర్థించడమే కాకుండా, తన పత్రిక కేసరిలో ఎంతో ప్రాచుర్యం కల్పించారు. అలాగే గోఖలేతో విభేదాలున్నా.. అయినా తనను గౌరవంగా చూసేవారు. కానీ 1907 నాటి సూరత్ కాంగ్రెస్ సభలు తిలక్ ను ఘోర అవమానానికి గురి చేశాయి. అదే.. ఆ సంస్థలో చీలికకు నాందీ పలికింది. ఆ సభలకు అధ్యక్షుడు అరవింద్ ఘోష్ కావడం మరొక విశేషం. కాంగ్రెస్ సాధారణ భారతీయుడికి చేరువ కావాలన్నదే తిలక్ ఆశయం. కానీ అప్పటికి ఆ సంస్థ మహారాష్ట్ర, బెంగాల్ సహా పలు ప్రాంతాలకు చెందిన న్యాయవాదులు, ఉపాధ్యాయుల ఆధీనంలో ఉండేది. ఇంగ్లీష్ తెలిసిన వారికే ప్రవేశం ఉండేది. అయినా ఉదారవాదంలో ప్రజానీకం మనసును తాకే అంశాలు లేవన్నదే తిలక్ అభిప్రాయంగా కనిపిస్తుంది.
జాతీయ కాంగ్రెస్ లో పని చేస్తున్నప్పటికీ.. తిలక్ తనదైన మార్గం నుంచి తప్పుకోలేదు. ఇది కాంగ్రెస్ లోని మితవాదులకు రుచించేది కాదు. ఆయన 1893లో గణేశ్ చతుర్థిని సామూహిక ఉత్సవంగా నిర్వహించే సంప్రదాయాన్ని పూణె, బొంబాయిలలో తీసుకువచ్చారు. అది దేశవ్యాప్త మైంది. తరువాత శివాజీ ఉత్సవాలను కూడా ప్రారంభించారు. శివాజీ పట్టాభిషేకం జరిగిన రాయగఢ్ కోటలోనే ఆయన సమాధి కూడా ఉంది. కానీ అది శిథిలావస్థకు చేరింది. దీనిని పునరుద్ధ రించేందుకు తిలక్ పెద్ద ఉద్యమమే నిర్వహించారు. మతం మనుషులను ఒక శక్తిగా నిలబెడుతుందని తిలక్ నమ్మకం. మతం, వాస్తవిక జీవనం వేర్వేరు కావని.. సన్యాసం స్వీకరించడమంటే జీవితాన్ని త్యజించడం కాదన్నారు. అందులో ఉన్న నిజమైన స్ఫూర్తి ఏదంటే దేశం మొత్తాన్ని కూడా నీ కుటుంబంగానే భావించడం. నీ కుటుంబం కోసమే కాకుండా, ఈ ప్రపంచం కోసం కూడా పనిచేయడం. దీని తరువాత మెట్టు మానవ సేవ. ఆ తరువాతి అడుగు భగవంతుడి సేవ అని అన్నారు తిలక్. అలా మతం ద్వారా ప్రజల మధ్య ఐక్యత సాధించాలన్నదే తిలక్ ఉద్దేశం. అలాగే శివాజీ జీవితానికీ, పోరాటానికీ తిలక్ ఇచ్చిన నిర్వచనం ప్రత్యేకమైనది. హిందువుల హక్కులను హరిస్తూ, వారి మత విశ్వాసాలను దారుణంగా అవమానిస్తున్న మొఘలుల మీద యుద్ధం చేసిన వీరునిగా.. శివాజీని తిలక్ విశ్లేషించేవారు.
ఇటు కాంగ్రెస్ మితవాద రాజకీయాలపై తిలక్ కు నమ్మకం పోయింది. స్వరాజ్యం కోసం పోరాటమే సరైన మార్గమని నమ్మారు. అప్పటివరకు కాంగ్రెస్ ప్రతి సంవత్సరం డిసెంబరు చివరివారంలో మూడు రోజులపాటు సమావేశమై నినదించిన ప్రే, పిటిషన్, ప్రొటెస్ట్ చెయ్యడానికే పరిమితమైందన్న తిలక్.. దాని గురించి చాలా ఘాటైన విమర్శలు చేశారు. సంవత్సరానికొకసారి మూడు రోజులపాటు సమావేశమై కప్పల మాదిరి బెకబెకలాడడం వల్ల ప్రయోజనం లేదన్నారు. అసలు కాంగ్రెస్ సంస్థ బెగ్గర్స్ ఇన్స్టిట్యూషన్ అని అన్నారు. కాంగ్రెస్ సమావేశాలను త్రీ డే తమాషాగా అభివర్ణించాడు. బ్రిటిష్ జాతి మీద జాతీయ కాంగ్రెస్లోని మితవాదులు పెట్టుకున్న నమ్మకం ఒట్టి భ్రమ అన్నది మొదటి నుంచి తిలక్ వాదన. అదే బెంగాల్ విభజనతో రుజువైంది. బెంగాల్ విభజన వ్యతిరేకోద్య మంలో లాలా లజపతిరాయ్, బిపిన్ పాల్లతో కలిసి తిలక్ ప్రధాన పాత్ర పోషించారు. బెంగాల్ ను మత ప్రాతిపదికనే 1905 లో విభజించడాన్ని వ్యతిరేకించారు. అందులో భాగంగా.. బెంగాల్ విభజన వ్యతిరేకోద్యమం జాతీయ స్థాయికి వెళ్లడానికి నాలుగు సూత్రాలను ముందుకు తెచ్చారు. అవి-స్వరాజ్, జాతీయ విద్య, స్వదేశీ, విదేశీ వస్తు బహిష్కరణ. ఇవి తిలక్ అందించినవేనని కొందరి అభిప్రాయం.
ఏప్రిల్ 30, 1908న జరిగిన ముజఫర్పూర్ బాంబుదాడి, తరువాతి పరిణామాల నేపథ్యంలో తిలక్ పై దేశద్రోహం నేరం మోపి అరెస్ట్ చేశారు. ఈ కేసును బొంబాయి హైకోర్టులో మహ్మద్ అలీ జిన్నా వాదించారు. కానీ ఓడిపోవడంతో.. బర్మాలోని మాండలే జైలు శిక్షఅనుభవించారు. 1908 నుంచి 1914 వరకు జైల్లో ఉన్న తిలక్.. అక్కడే గీతా రహస్య పుస్తకం రాశారు. 1916 ఏప్రిల్ లో హోంరూల్ లీగ్ను స్థాపించి దాని లక్ష్యాలను వివరిస్తూ మధ్యభారతదేశంలో గ్రామగ్రామానా తిరిగాడు. అనీబిసెంటు అదే సంవత్సరం సెప్టెంబర్లో మొదలుపెట్టి హోంరూల్ ఉద్యమాన్ని దేశవ్యాప్తం చేసింది. ఆ ఉద్యమం ఉధృతంగా కొనసాగుతున్న సమయంలో ఒక కోర్టుకేసులో లండనుకు వెళ్ళవలసి వచ్చింది. కానీ బ్రిటిష్ ప్రభుత్వ నిజాయితీని నమ్మిన అనీబిసెంటు ఆ ప్రకటనతో ఉద్యమాన్ని అపేసి ప్రభుత్వానికి తన మద్దతు ప్రకటించింది. అలా ఇద్దరు నాయకులదీ చెరొకదారీ కావడంతో హోంరూల్ ఉద్యమం చల్లబడిపోయింది. కానీ ప్రజల్లో తిలక్ రగిలించిన స్ఫూర్తి మాత్రం కొనసాగింది. 1920 లో ఆగస్టు 1న బొంబాయిలో ఆయన మరణించిన వార్త.. నగరంలో దావానలంలా వ్యాపించింది. ఆ ముందు రాత్రి అంతిమ క్షణాలు లెక్కిస్తున్న తిలక్ ను రక్షించేందుకు ప్రముఖ వైద్యులంతా శ్రమించారు. అలాంటి సమయంలో కూడా తిలక్ అన్నమాట ఒక్కటే, ‘స్వరాజ్యాన్ని సాధించలేకపోతే భారతదేశానికి భవిష్యత్తు లేదు అని.