Bharatha Sakthi

చంద్రయాన్ 3 ల్యాండింగ్‌ను పాక్ మీడియా ప్రత్యక్ష ప్రసారం చేయాలి: పాక్ మాజీ మంత్రి

admin 23/08/2023
Updated 2023/08/23 at 7:20 AM

చంద్రయాన్ 3 ల్యాండింగ్‌ను పాకిస్థాన్ మీడియా కూడా ప్రత్యక్ష ప్రసారం చేయాలని ఆ దేశ మాజీ మంత్రి ఫవాద్ చౌదరి(Fawad Chaudhry) కోరారు. ఈ మేరక ఆయన ట్విట్టర్(ఎక్స్) వేదికగా ఓ ట్వీట్ చేశారు. చంద్రయాన్ 3 మిషన్ ‘మానవజాతికి చారిత్రాత్మక ఘట్టం’ అని అభివర్ణిస్తూ భారత శాస్త్రవేత్తలను ఆయన అభినందించారు. “పాక్ మీడియా సాయంత్రం 6:15 గంటలకు చంద్రయాన్ 3 ల్యాండింగ్‌ను ప్రత్యక్షంగా చూపించాలి. మానవ జాతికి ఇది చారిత్రత్మక ఘట్టం. భారత శాస్త్రవేత్తలకు అభినందనలు.” అని ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. కాగా ఫవాద్ చౌదరి ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంలో( Imran Khan government) సమాచార, ప్రసార శాఖ మంత్రిగా పని చేశారు. దీంతో ఫవాద్ చౌదరిపై నెట్టింట ప్రశంసలు కురుస్తున్నాయి.

ఇక చందమామపై చెరగని ముద్ర వేసే చరిత్రాత్మక ఘట్టం కోసం యావత్‌ భారతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. చంద్రుడిపై పరిశోధనల కోసం గత నెల 14న నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్‌-3(Chandrayaan-3) వ్యోమనౌక 41 రోజుల సుదీర్ఘ ప్రయాణం తర్వాత జాబిల్లిపై అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. బుధవారం సాయంత్రం 6:04 గంటలకు ప్రజ్ఞాన్‌ రోవర్‌తో కూడిన విక్రమ్‌ ల్యాండర్‌(Vikram Lander) మాడ్యూల్‌ చంద్రుని దక్షిణ ధ్రువాన్ని ముద్దాడనుంది. జాబిల్లిపై మన వ్యోమనౌక అడుగుపెట్టే అపురూప ఘట్టాన్ని ఆవిష్కరించేందుకు ఇస్రో(ISRO) అన్ని ఏర్పాట్లూ చేసింది. ఇస్రో ప్రయోగించిన ఈ మూడో మూన్‌ మిషన్‌ విజయవంతమైతే అమెరికా, సోవియెట్‌ యూనియన్‌ (రష్యా), చైనా తర్వాత చంద్రునిపై దిగిన నాలుగో దేశంగా భారత్‌ రికార్డు సృష్టించనుంది. అలాగే ఇప్పటి వరకు ఎవరికీ సాధ్యంకాని జాబిల్లి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలిదేశంగా చరిత్ర సృష్టించనుంది. ఈ నేపథ్యంలో ఈ చరిత్రాత్మక ఘట్టం కోసం భారత్‌తోపాటు ప్రపంచ దేశాలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

Share this Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *