వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. తొలి మ్యాచ్‌లో డకౌట్ అయినా ఆప్ఘనిస్తాన్‌పై సెంచరీతో పాటు చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై హాఫ్ సెంచరీతో రోహిత్ రాణించాడు. ఆఫ్ఘనిస్తాన్‌పై 84 బంతుల్లో 131 పరుగులు, ఆస్ట్రేలియాపై 63 బంతుల్లో 86 పరుగులు చేశాడు. జట్టును కూడా రోహిత్ నడిపిస్తున్న తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. దీంతో టీమిండియా మేనేజ్‌మెంట్ సంతోషంగా ఉంది. పాకిస్థాన్‌తో మ్యాచ్ అనంతరం బంగ్లాదేశ్‌తో తలపడేందుకు టీమిండియా రెండు రోజుల క్రితం అహ్మదాబాద్ నుంచి పూణే చేరుకుంది. పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా గురువారం భారత్-బంగ్లాదేశ్ ప్రపంచకప్ మ్యాచ్ ఆడనున్నాయి.
అయితే ఇంతలో కెప్టెన్ రోహిత్ శర్మకు పూణె పోలీసులు షాక్ ఇచ్చారు. తన లంబోర్గిని కారుతో అతి వేగంగా ప్రయాణించినందుకు జరిమానా విధించారు. ముంబై-పూణె ఎక్స్‌ప్రెస్ వేపై హిట్ మ్యాన్ గంటకు 200 కి.మీ, 215 కి.మీ. వేగంతో దూసుకెళ్లాడని ట్రాఫిక్ పోలీసులు ఆరోపిస్తున్నారు. దీంతో రోహిత్ కారుకు మూడు చలాన్లు విధించారు. రోహిత్ అతి వేగంగా డ్రైవింగ్ చేయడం పట్ల ట్రాఫిక్ పోలీసులు ఆందోళన వ్యక్తం చేశారు. అతడు కారులో కాకుండా పోలీసు ఎస్కార్ట్‌తో జట్టు బస్సులో ప్రయాణించాలని సూచించారు.
Leave a comment