మణుగూరు, మార్చి 11 (భారత శక్తి): ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి ప్రజా దీవెన బహిరంగ సభ కాంగ్రెస్ శ్రేణుల్లో నయా జోష్ నింపింది. సోమవారం మండల పరిధిలోని ప్రభుత్వ ఐటీఐ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రజా దీవెన బహిరంగ సభకు పెద్దఎత్తున కార్యకర్తలు, నాయకులు, అభిమానులు తరలివచ్చారు. ఉమ్మడి జిల్లా మంత్రులు రావడంతో అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నడంతో ప్రాంగణం కిక్కిరిసి పోయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఇతర కేబినెట్ మంత్రులు భద్రాచలం నుండి నాలుగు గంటలకు హెలికాప్టర్ లో వేదిక వద్దకు చేరుకున్నారు. పోలీసు యంత్రాంగం స్వాగతం పలికారు. అక్కడి నుండి కాన్వాయ్ ద్వారా సభ వేదికకు వస్తూ ప్రజలకు అభివాదం చేస్తూ ప్రసంగం చేశారు.
సమస్యలు వివరించిన ఎమ్మెల్యే
పినపాక నియోజకవర్గ ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, అందులో పులుసు బొంత, పోడు భూముల సమస్యలు ఎక్కువగా ఉన్నాయని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించి పినపాక గడ్డా.. కాంగ్రెస్ అడ్డా.. అంటూ గత ప్రభుత్వాలు గారడి మాటలతో ప్రజలను తప్పుదోవ పట్టించదన్నారు. ఎమ్మెల్యే పాయం నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తేలపడంతో కేబినెట్ మంత్రులందరూ ఇక్కడే వున్నారని వారందరి తో చర్చించి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
బలరాం నాయక్ ను గెలిపించండి.
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబాబాద్ పార్లమెంటు అభ్యర్థి మాజీ కేంద్రమంత్రి పోరిక బలరాం నాయక్ ను లక్ష యాభై వేల ఓట్లతో గెలిపించాలని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు సితక్క, సురేఖ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క మల్లు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలు సుభిక్షంగా ఉండాలంటే కేంద్రంలో బిజెపి పాలన పోయి ఇందిరమ్మ రాజ్యం తేవాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్ పాలనలో రూ.400 ఉన్న గ్యాస్ నేడు రూ.1200 లకు పెరిగిందని సామాన్య ప్రజలు బ్రతికే పరిస్థితి లేదని విమర్శించారు. బిఆర్ఎస్ అంటే బిల్లా రంగా సమితి అని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ అంటే పేదల పార్టీ
బిఆర్ఎస్, బిజేపిపై నిప్పులు చెరిగారు. గత పది సంవత్సరాల్లో పేద ప్రజలకు చేసింది ఏమిలేదని నిప్పులు చెరిగారు. సోనియమ్మ ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో ఒక్కటి ప్రమాణ స్వీకారం చేసిన 48 గంటల్లోనే ఒక పథకం ప్రారంభించామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ చెప్పిందే చేస్తుందని, చేసేదే చెపుతుందన్నారు. గత పది సంవత్సరాలల్లో కేసీఆర్ ప్రభుత్వం దోచుకోవడం తప్ప ప్రజలకు చేసిన అభివృద్ధి లేదన్నారు. మాయమాటలు, గారడి మాటలు చెపుతూ ప్రజలను తప్పుదోవ పట్టించి అందలం ఎక్కి కుటుంబ పాలన తో నియంతలా వ్యవహరించి దోచుకున్నారని దుయ్యబట్టారు. సోనియాగాంధీ ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్లు తప్ప డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ప్రజలకు ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. బిడ్డ అల్లుడు ఇంటికి వస్తే ఎక్కడ పడుకుంటారని ఇందిరమ్మ ఇండ్లును డబ్బా ఇండ్లు అంటూ డబుల్ బెడ్ రూమ్స్ కట్టిస్తామని ప్రజలను మభ్యపెడుతూ మోసం చేశారని ఆరోపించారు. ఇప్పుడూ ఆరు గ్యారెంటీలు ప్రజలకు నేరుగా చేరుతుంటే కడుపు తరుక్కపోయి కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీశ్ రావు తప్పుడు ప్రచారం చేస్తూ విషం కక్కుతున్నారని మండిపడ్డారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాకు మహర్దశ..
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపుకు ఖమ్మం జిల్లాలోనే వునాది వడిందని, బీఆర్ఎస్ పార్టీని బొందపెట్టి, ఉమ్మడి జిల్లాలో 9ఎమ్మేల్యేను అందించిన ఖమ్మం గడ్డ రుణం తీర్చుకునేందకు సోనియా గాంధీ జిల్లాకు మూడు మంత్రి పదవులతోపాటు రాజ్యసభ సీటు సైతం కేటాయించడం జరిగిందని తెలిపారు. కాంగ్రేస్ పార్టీకి ప్రజా ఆశీర్వాదం ఉన్న జిల్లా అయిన ఖమ్మంలో నేడు గృహలక్ష్మి పథకమైన ఇందిరమ్మ ఇళ్ళను ప్రారంభించడం సంతోషకర విషయమన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గత కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదలకు ఇచ్చిన పథకాలను ఇవ్వకుండా విస్మరించిందని తెలిపారు. కాంగ్రేస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే పేదలకు అండగా ఉండే పథకాలైన ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించి, కార్పోరేట్ హాస్పటల్లో 10లక్షల వరుకు వైద్యసదుపాయం కల్పించడం జరిగిందన్నారు. పేదింటి ఆడబిడ్డలు కట్టేలపొయ్చితో ఇబ్బంది పడకూడదని కాంగ్రేస్ ప్రభుత్వం దీపం పథకం ప్రారంభించి పేదలకు ఉచితంగా గ్యాస్ పోయి సిలెండర్లు ఇస్తే, గత 10సంవత్సరాల్లో బీజేపి ప్రభుత్వం గ్యాస్ సిలెండర్ ధర రూ. 1200వందలకు పెంచి పేదలనడ్డి విరిచిదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 60 రోజుల్లోనే రూ.500లకే గ్యాస్ సిలెండర్ ను పేదలకు అందించిన ఘనత కాంగ్రేస్ పార్టీకే చెందుతుందన్నారు. అదేవిధంగా తెల్లరేషన్ కార్డు ఉన్న పేదలందరికి 200 యూనిట్ల విధ్యుత్ ను ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. గృహనిర్మాణ శాఖను బీఆర్ఎన్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని, గత పది సంవత్సరాలలో ఒక్క డబుల్ బెడ్రూం ఇంటిని కూడ పూర్తిచేయలేదని ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రేన్ ప్రభుత్వం రూ.22 వేల 5వందల కోట్లతో 4.5 లక్షల ఇళ్ళను నిర్మించి ఇస్తామని హామి ఇచ్చారు. నేడు భద్రాచలంలోని సీతరామచంద్ర స్వామి, యాదాద్రి లక్ష్మి నరసింహస్వామి ఆశిస్సులతో ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం చుట్టామని, తొలివిడతగా నియోజకవర్గానికి 3500 ఇళ్లు మంజూర్ చేయడం జరిగిందని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ నిళ్ళు, నిధులు, నియామకాల పేరుతో అధికారంలోకి వచ్చి, పది సంవత్సరాల్లో ఒక్క ఉద్యోగం కూడ ఇవ్వలేదని, కాంగ్రేన్ ప్రభుత్వం 90రోజుల్లోనే 30వేల ఉద్యోగాలు ఇచ్చిందని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రేస్ ప్రభుత్వ హయంలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్ ల పేర్లు మార్చి వేలకోట్ల రుపాయాల అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్ధులను ప్రకటిస్తుంటే, బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులు కరువయ్యారని ఎద్దేవా చేశారు. కాంగ్రేస్ ప్రభుత్వాన్ని నిర్విర్యం చేసేందకు బీఆర్ఎస్, బిజేపి ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయని, కాంగ్రేస్ పార్టీకి కార్యకర్తలే బలమని, కాంగ్రేస్ పార్టీకి ఎవరెదురొచ్చిన వారికే నష్టమని హెచ్చరించారు. కాంగ్రేస్ పార్టీ కంచుకోట అయిన పినపాక నియోజకవర్గ అభివృద్ధికి పెద్దపీఠ వేస్తామని, పాయం లాంటి ఎమ్మేల్యే పినపాకకు వరమని, పాయం అడిగిన పులుసుబొంత ప్రాజెక్ట్, గోదావరి కరకట్ట నిర్మాణం, పోడుభూములకు పట్టాలు, ముంపు ప్రాంతాల ప్రజలకు శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తానని హామి ఇచ్చారు. అదేవిదంగా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మహబుబాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటిచేస్తున్న పోరిక బలరాం నాయక్ ను అత్యధిక మెజారిటితో గెలిపించాలని ఈ సందర్భంగా కాంగ్రేస్ శ్రేణులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహాల ఇంఛార్జ్ దీపాదాస్ మునీ, ఎఐసీసీ సెక్రటరి రోహిత్ చౌదరి, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సితక్క, (అనసూయ), ఉత్తమ్ కుమార్ రెడ్డి, సురేఖ, భద్రాచలం శాసన సభ్యులు తెల్లం వెంకట్రావు, పొదేం వీరయ్య, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.