లక్నో: సంసార జీవితంలో వచ్చిన విబేధాల కారణంగా భర్తకు దూరంగా ఉంటుంది ఆ మహిళ. తన మూడేళ్ల కూతురిని పోషించుకునేందుకు ఉద్యోగంలో చేరింది. భర్తకు దూరంగా ఉండడాన్ని అవకాశంగా తీసుకున్న తోటి ఉద్యోగి ఆమెతో స్నేహం చేశాడు. స్నేహం పేరుతో అత్యాచారానికి ఒడిగట్టాడు. దీంతో సదరు మహిళ గర్భందాల్చింది. పెళ్లి చేసుకోమంటే ఇస్లాం మతంలోకి మారమని బలవంతపెట్టాడు. చివరకు ఆమెకు ఇష్టం లేకుండానే బలవంతంగా అబార్షన్ కూడా చేయించేశాడు. చివరకు చేసేదేమి లేక మోసపోయానని గ్రహించిన ఆ మహిళ పోలీసులను ఆశ్రయించడంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో జరిగింది ఈ ఘటన.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 32 ఏళ్ల మహిళ భర్తతో విబేధాల కారణంగా అతనికి దూరంగా ఉంటుంది. ఆమెకు మూడేళ్ల కూతురు కూడా ఉంది. దీంతో కూతురుని పోషించుకోవడానికి సదరు మహిళ ఓ ఆర్కెస్టా గ్రూపులో చేరింది. అక్కడే పని చేస్తున్న మరో వ్యక్తి ఖుర్షీద్ హష్మీతో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త స్నేహంగా మారింది. ఆ స్నేహాన్ని అడ్డుపెట్టుకోని సదరు మహిళపై ఖుర్దీద్ హష్మీ బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. అలా కొంతకాలం సాగిన తర్వాత ఆమె గర్భం దాల్చింది. దీంతో సదరు మహిళ తనను పెళ్లి చేసుకోవాలని ఖుర్దీద్ హష్మీపై ఒత్తిడి తెచ్చింది.
అయితే ఖుర్దీద్ మాత్రం అబార్షన్ చేయించుకోవాలని ఆమెపై ఒత్తిడి తెచ్చాడు. కానీ ఆమె ఒప్పుకోకపోవడంతో కొట్టి, చిత్రహింసంలకు గురి చేశాడు. బలవంతంగా అబార్షన్ కూడా చేయించాడు. పెళ్లి చేసుకోమంటే ఇస్లాం మతంలోకి మారమని బాధితురాలిని నిందుతుడు ఖుర్దీద్ హష్మీ బలవంతం చేశాడు. ఇంతలోనే ఖుర్దీద్ మరొక అమ్మాయిని వివాహం చేసుకోని ఆమెను ఇంటి నుంచి వెళ్లగొట్టాడు. చివరకు మోసపోయానని గ్రహించిన సదరు మహిళ పోలీసులను ఆశ్రయించింది. మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు ఖుర్దీద్ హష్మీని అరెస్ట్ చేశారు.