Bharatha Sakthi

పెంచలకోనలో ఎర్రచందనం స్మగ్లర్లు,12ఎర్రచందనం దుంగలు స్వాధీనం : ఒకరి అరెస్టు

Bharath Sakthi 07/07/2023
Updated 2023/07/07 at 8:16 PM

చిత్తూరు, జూలై 7:
శేషాచలం అడవుల నుంచి కొంత మంది ఎర్రచందనం స్మగ్లర్లు రూటు మార్చి వెంకటగిరి, రాపూరు ప్రాంతాల్లోని పెంచలకోన అడవుల్లో మకాం వేశారు. అక్కడ నాణ్యమైన ఎర్రచందనం దుంగలు ఉండటంతో, అటు వైపుకు వెళుతున్నారు. దీనిపై సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ ఇన్చార్జి, కర్నూలు రేంజి డీఐజీ సెంథిల్ కుమార్ అటువైపుకు బలగాలతో కూంబింగ్ కు పంపించారు. దీనికి గాను అదనంగా రెండు బృందాలను నియమించారు. ఇది వరకు టాస్క్ ఫోర్సులో 8టీమ్ లు ఉండగా, మరికొంత మందిని టాస్క్ ఫోర్సులోకి తీసుకుని 10టీమ్ లుగా ఏర్పాటు చేశారు. వీటిలో రెండు టీమ్ లను వెంకటగిరి, రాపూరు వైపుకు కేటాయించారు. ప్రతి రోజూ రాపూరు ప్రాంతంలోనూ కూంబింగ్ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. డీఎస్పీ మురళీధర్ అధ్వర్యంలోని ఆర్ఐ సురేష్ కుమార్ రెడ్డికి చెందిన ఆర్ఎస్ఐ విశ్వనాథ్ టీమ్ రాపూరు రేంజి గోనుపల్లి సెక్షన్ కొత్తూరు పల్లి ఫారెస్టు బీట్ పరిధిలోని పెద్దగట్టు అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు. పెద్దగట్టు వద్ద కొంతమంది ఎర్రచందనం దుంగలను మోసుకుని వెళుతూ కనిపించారు. వారిని హెచ్చరించి పట్టుకునే ప్రయత్నం చేయగా, వారు దంగలను పడేసి పారిపోయారు. వారిని వెంబడించగా, ఒక వ్యక్తి పట్టుబడ్డాడు. అతన్ని తమిళనాడు తిరువన్నామలై జిల్లా జమునామత్తూరు తాలూకా, కోవిలండూరు గ్రామానికి చెందిన మురుగన్ వెల్లయ్యన్ (54)గా గుర్తించారు. ఆ పరిసర ప్రాంతాల్లో 12ఎర్రచందనం దుంగలు లభించాయి. వీరు గత నెల 30న రాపూరుకు వచ్చినట్లు విచారణలో తెలిసింది. మరో ఆరుగురు తప్పించుకోగా, వారిని అన్నాదురై, దక్షిణామూర్తి, రేణుసెన్నూరు, కుప్పస్వామి, వేలు సెన్నూరు, అజిత్ లుగా తెలుసుకున్నారు. వీరి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. రాపూరు రేంజి తేగచెర్ల ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎం.ప్రవీణ్ కుమార్ కూంబింగ్ లో పాల్గొన్నారు. ఈ కేసును తిరుపతి టాస్క్ ఫోర్సు పోలీసు స్టేషన్ లో నమోదు చేయగా, సీఐ జీ.శ్రీనివాసులు దర్యాప్తు చేస్తున్నారు. రాపూరు వైపు నిఘా పెంచాలని డీఐజీ సెంథిల్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. దీనికి అదనంగా మరికొంత మందితో టీమ్ ను కేటాయించారు.

Share this Article