Bharatha Sakthi

శ్రీలంక సై ప్రపంచ కప్‌నకు క్వాలిఫై

admin 03/07/2023
Updated 2023/07/03 at 6:54 AM

బులవాయో: తొలుత బౌలర్లు ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే కట్టడి చేయగా..అనంతరం ఓపెనర్‌ నిస్సాంక (101 నాటౌట్‌) అజేయ శతకంతో మెరిసిన వేళ ప్రపంచ కప్‌ క్వాలిఫయర్‌ సూపర్‌ సిక్స్‌లో శ్రీలంక తొమ్మిది వికెట్లతో జింబాబ్వేను చిత్తు చేసింది. దాంతో ఆ జట్టు భారత్‌లో జరిగే వన్డే వరల్డ్‌ కప్‌నకూ అర్హత సాధించింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో టాస్‌ కోల్పోయి మొదట బ్యాటింగ్‌ చేసిన జింబాబ్వే 32.2 ఓవర్లలో 165 పరుగులకు ఆలౌటైంది. విలియమ్స్‌ (56) అర్ధ శతకంతో ఆదుకున్నాడు. 30 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన దశలో సికిందర్‌ రజా (31)తో కలిసి నాలుగో వికెట్‌కు 68 పరుగులు చేయడం ద్వారా విలియమ్స్‌ పరిస్థితి చక్కదిద్దాడు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ తీక్షణ (4/25), మదుశంక (3/15) వణికించారు. అనంతరం 33.1 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 169 పరుగులతో శ్రీలంక విజయం అందుకుంది. కరుణ రత్నే (30), నిస్సాంక తొలి వికెట్‌కు 103 పరుగులు జత చేశారు. నిస్సాంకతోపాటు కుశాల్‌ మెండిస్‌ (25 నాటౌట్‌) అజేయంగా నిలిచాడు. ఇక..ఈ క్వాలిఫయర్‌ టోర్నీలో ఆతిథ్య జింబాబ్వేకిది మొదటి ఓటమి కావడం గమనార్హం.

సంక్షిప్తస్కోర్లు

జింబాబ్వే: 32.2 ఓవర్లలో 165 (విలియమ్స్‌ 56, రజా 31, ఇర్విన్‌ 14, ఇవాన్స్‌ 14, తీక్షణ 4/25, మదుశంక 3/15, పథిరణ 2/18).

శ్రీలంక సై ప్రపంచ కప్‌నకు క్వాలిఫై33.1 ఓవర్లలో 169/1 (నిస్సాంక 101 నాటౌట్‌, కరుణరత్నే 30, కుశాల్‌ 25 నాటౌట్‌).

ఏడోస్థానం కోసం జరిగిన ప్లేఆఫ్‌ మ్యాచ్‌లో నేపాల్‌ 3 వికెట్లతో యూఏఈపై నెగ్గింది. మొదట యూఏఈ 46.5 ఓవర్లలో 181 రన్స్‌కు ఆలౌటైంది. ఛేద నలో నేపాల్‌ 43.2 ఓవర్లలో 185/7 స్కోరు చేసింది.

రెండో ‘బెర్త్‌’ ఎవరికి ?

ఈ గెలుపుతో శ్రీలంక ఖాతాలో మొత్తం ఎనిమిది పాయింట్లు చేరాయి. శుక్రవారం జరిగే సూపర్‌ సిక్స్‌ తమ ఆఖరి మ్యాచ్‌లో ఆ జట్టు ఓడినా..టాప్‌-2లో నిలవడం ఖాయం. మరోవైపు క్వాలిఫికేషన్‌ నుంచి ఒకే బెర్త్‌ మిగిలి ఉంది. ఇది దక్కాలంటే మంగళవారం జరిగే మ్యాచ్‌లో స్కాట్లాండ్‌పై జింబాబ్వే తప్పక నెగ్గాల్సి ఉంటుంది. ఒకవేళ స్కాట్లాండ్‌ చేతిలో జింబాబ్వే పరాజయం చవిచూస్తే..తదుపరి గురువారం జరిగే పోరులో నెదర్లాండ్స్‌ చేతిలో స్కాట్లాండ్‌ భారీ తేడాతో ఓడాల్సి ఉంటుంది. అలా అయితే మెరుగైన రన్‌రేట్‌ ద్వారా రెండో ‘బెర్త్‌’ జింబాబ్వేకు లభిస్తుంది. ఆదివారం నాటి ఓటమితో జింబాబ్వే రన్‌రేట్‌ (+0.030) స్కాట్లాండ్‌ (+0.188) కంటే తక్కువగా ఉంది.

Share this Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *