టీమిండియా సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లీ రికార్డును బద్దలుకొట్టేందుకు మిస్టర్ 360 డిగ్రీస్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ 3 అడుగుల దూరంలో ఉన్నాడు. తన తర్వాతి మూడు టీ20 ఇన్నింగ్స్‌ల్లో సూర్యకుమార్ యాదవ్ మరొక 60 పరుగులు చేస్తే టీమిండియా తరఫున వేగంగా 2 వేల పరుగులు చేసిన బ్యాటర్‌గా చరిత్ర సృష్టిస్తాడు. ఈ క్రమంలో టీమిండియా తరఫున వేగంగా 2 వేల పరుగులు చేసిన విరాట్ కోహ్లీ రికార్డును సూర్యకుమార్ యాదవ్ అధిగమిస్తాడు. విరాట్ కోహ్లీ 56 టీ20 ఇన్నింగ్స్‌ల్లో 2 వేల పరుగులను పూర్తి చేసుకున్నాడు. దీంతో ఇప్పటివరకు టీ20 క్రికెట్‌లో టీమిండియా తరఫున వేగంగా 2 వేల పరుగులు చేసిన రికార్డు కింగ్ కోహ్లీ పేరు మీదనే ఉంది. కాగా తన అంతర్జాతీయ టీ20 కెరీర్‌లో ఇప్పటివరకు 52 ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్ చేసిన సూర్యకుమార్ యాదవ్ 46 సగటుతో 1,940 పరుగులు చేశాడు. దీంతో మంగళవారం ఆస్ట్రేలియాతో జరిగే మూడో టీ20 మ్యాచ్‌లోనే సూర్యకుమార్ యాదవ్ ఈ రికార్డును అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
కాగా 58 టీ20 ఇన్నింగ్స్‌ల్లో 2 వేల పరుగులు చేసిన కేఎల్ రాహుల్ ఈ జాబితాలో ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్నాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో యువ ఆటగాళ్లతో కూడిన భారత జట్టు అంచనాలకు మించే రాణిస్తోంది. ఇప్పటికే వరుసగా రెండు విజయాలతో 2-0 ఆధిక్యంలో ఉంది. ఈనేపథ్యంలో మంగళవారం కీలకమైన మూడో మ్యాచ్ జరుగనుంది. అదీ గెలిస్తే ఈ మ్యాచ్‌తోనే సిరీస్‌ను ఖాతాలో వేసుకుంటుంది. అటు ఆస్ట్రేలియా జట్టులో స్టార్ క్రికెటర్లు, అనుభవజ్ఞులకు కొదవలేకపోయినా, ఆడిన రెండింట్లోనూ ఓడి నిరాశపరిచింది.