వన్డే ప్రపంచకప్‌నకు ముందు నిర్వహించిన రెండు వామప్ మ్యాచ్‌లను ఆడేందుకు భారత క్రికెట్ జట్టు ఏకంగా 3,400 కిలో మీటర్లు(2,170 మైళ్లు) ప్రయాణించింది. కానీ ఏం లాభం రెండు వామప్ మ్యాచ్‌లు కనీసం ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయ్యాయి. దీంతో భారత ఆటగాళ్ల శ్రమ అంతా వృథా అయిపోయింది. అంతేకాకుండా వన్డే ప్రపంచకప్‌నకు ముందు టీమిండియాకు ప్రాక్టీస్ చేసుకునే అవకాశం కూడా లేకుండా పోయింది. దీంతో భారత జట్టు నేరుగా ప్రపంచకప్‌లోనే బరిలోకి దిగనుంది. ఈ నెల 8న ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్‌తో టీమిండియా ప్రయాణం మొదలుకానుంది. గత శనివారం గౌహతి వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌తో టీమిండియా వామప్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. భారత్, ఇంగ్లండ్ జట్లు ప్రపంచకప్ ఫైనల్‌లో తలపడతాయని విశ్లేషకులు అంచనా వేస్తుండడంతో ఈ మ్యాచ్‌పై ఆసక్తి నెలకొంది. కానీ వర్షం కారణంగా తీవ్ర నిరాశ తప్పలేదు. వరుణుడు కొంచెం కూడా విరామం ఇవ్వకపోవడంతో ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్ రద్దైంది.
ఇక గత మంగళవారం తిరువనంతపురలో నెదర్లాండ్స్‌తో భారత్ వామప్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఇందుకోసం భారత జట్టు గౌహతి నుంచి తిరువనంతపురం వరకు 3,400 కిలో మీటర్లు ప్రయాణించింది. ఈ మ్యాచ్ అయినా సజావుగా సాగుతుందనుకుంటే ఇక్కడ కూడా వరుణుడి ముప్పు తప్పలేదు. దీంతో ఈ మ్యాచ్ సైతం ఒక బంతి కూడా పడకుండానే రద్దైంది. టీమిండియా ఆడాల్సిన రెండు వామప్ మ్యాచ్‌లు ఒక బంతి కూడా పడకుండానే రద్దు అవడంతో మన ఆటగాళ్లకు సరైన ప్రాక్టీస్ లేకుండా పోయింది. దీంతో వామప్ మ్యాచ్‌ల కోసం మన ఆటగాళ్ల చేసిన 3,400 కిలో మీటర్ల ప్రయాణం బూడిదలో పోసిన పన్నీరులా అయిందని అభిమానులు అంటున్నారు. అటు నెదర్లాండ్స్‌కు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. ఆ జట్టు ఆడాల్సిన రెండు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయ్యాయి. ఆ జట్టు ఆస్ట్రేలియాతో ఆడాల్సిన మొదటి వామప్ మ్యాచ్ 14.2 ఓవర్లపాటే సాగి రద్దైంది. అయితే మిగతా జట్ల వామప్ మ్యాచ్‌లపై కూడా వర్ష ప్రభావం పడింది. కానీ ఇలా వారి రెండు వామప్ మ్యాచ్‌లు రద్దవలేదు. ఈ టోర్నీలో భారత్, నెదర్లాండ్స్ మినహా మిగతా జట్లన్నీ కనీసం ఒక వామప్ మ్యాచ్ అయినా ఆడాయి. మొత్తంగా భారత్ ఆడాల్సిన రెండు వామప్ మ్యాచ్‌లు రద్దవడం నిరాశ పరిచే అంశంగా చెప్పుకోవాలి. అయితే టీమిండియా వరుసగా మ్యాచ్‌లు ఆడుతూనే ఉంది కాబట్టి ప్రస్తుతం వామప్ మ్యాచ్‌లు ఆడనంత మాత్రాన వచ్చిన నష్టం ఏం లేదని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. సరైన నెట్స్ ప్రాక్టీస్ ఉంటే సరిపోతుందంటున్నారు. ఇక క్రికెట్ ప్రేమికులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న వన్డే ప్రపంచకప్ 2023 ఈ గురువారం నుంచే ప్రారంభంకాబోతుంది.
Leave a comment