టీమిండియా స్టార్ పేసర్ దీపక్ చాహర్ దక్షిణాఫ్రికా పర్యటనలో ఆడడంపై సందేహం నెలకొంది. తన తండ్రి అనారోగ్యంతో బాధపడుతుండడంతో ఆయన బాగోగులు చూసుకోవడానికి చాహర్ ఇక్కడే ఉండిపోనున్నాడు. ఇదే విషయాన్ని దీపక్ చాహర్ కోచ్ రాహుల్ ద్రావిడ్‌తోపాటు సెలెక్టర్లకు కూడా చెప్పాడు. ఇటీవల దీపక్ చాహర్ తండ్రి లోకేంద్ర సింగ్ బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యాడు. ఆయనను వెంటనే ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. దీంతో ఆస్ట్రేలియాతో జరిగిన ఐదో టీ20 మ్యాచ్‌కు దీపక్ చాహర్ దూరమయ్యాడు. టాస్ వేసే సమయంలో మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా చాహర్ ఆకస్మాత్తుగా ఈ మ్యాచ్ నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వెల్లడించాడు. ప్రస్తుతం చాహర్ తండ్రి లోకేంద్ర సింగ్ ఆరోగ్యం నిలకడగా ఉంది.
‘‘మా నాన్నను సకాలంలో ఆసుపత్రిలో చేర్చాం. లేదంటే ఆయన పరిస్థితి ప్రమాదకరంగా ఉండేది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మెరుగ్గా ఉంది. ఆస్ట్రేలియాతో చివరి టీ20 మ్యాచ్ ఎందుకు ఆడలేదని చాలా మంది నన్ను అడిగారు. కానీ నాకు మా నాన్న చాలా ముఖ్యం. ఆయన నన్ను క్రికెటర్‌గా చేశాడు. ఇలాంటి స్థితిలో ఆయనను వదిలి ఎక్కడికీ వెళ్లలేను. పూర్తిగా కోలుకునే వరకు మా నాన్నతోనే ఉండాలని నిర్ణయించుకున్నాను. ఆయన కోలుకున్నాక దక్షిణాఫ్రికా వెళ్తాను. ఈ విషయాన్ని కోచ్ రాహుల్ ద్రావిడ్, సెలెక్టర్లకు కూడా చెప్పాను. ప్రస్తుతం మా నాన్న ఆరోగ్యం మెరుగ్గా ఉంది’’ అని దీపక్ చాహర్ తెలిపాడు. అలాగే తాను జట్టులో ఎప్పుడు చేరతాననేది తన తండ్రి కోలుకోవడంపై ఆధారపడి ఉంటుందని చెప్పాడు. ప్రస్తుతం తన తండ్రిని వదిలి వెళ్లలేనని దీపక్ చాహర్ తెలిపాడు. తండ్రి కోలుకుంటే మధ్యలోనైనా సరే చాహర్ భారత జట్టులో చేరే అవకాశాలున్నాయి. లేదంటే సఫారీ పర్యటనకు దీపక్ చాహర్ పూర్తిగా దూరం కానున్నాడు. కాగా సౌతాఫ్రికా పర్యటనకు ఎంపిక చేసిన టీమిండియా వన్డే, టీ20 జట్టులో దీపక్ చాహర్‌కు చోటు దక్కింది. సౌతాఫ్రికా పర్యటనలో భారత జట్టు ఈ నెల 10 నుంచి 14 వరకు టీ20 సిరీస్, 17 నుంచి 21 వరకు వన్డే సిరీస్ ఆడనుంది.