Bharatha Sakthi

తెలంగాణలో ముగిసిన ఎన్నికల ప్రచారం

admin 28/11/2023
Updated 2023/11/28 at 11:02 AM

మంథని
దాదాపు నెల రోజులపాటు హోరాహోరీగా కొనసాగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రచారపర్వం పరిసమాప్తం అయింది. రాజకీయ నాయకుల మైకులు, ప్రచార వాహనాలు, పార్టీల పాటలు ఎక్కడికక్కడ ఆగిపోనున్నాయి. ఈసీ నిబంధనల ప్రకారం పోలింగ్‌ ముగింపు సమయానికి 48 గంటల ముందే ప్రచారాన్ని నిలిపివేయాల్సి ఉంటుంది. కాబట్టి తెలంగాణ పోలింగ్‌ గురువారం జరగనుండడంతో మంగళవారం సాయంత్రం ప్రచారం ముగిసింది. దీంతో మిగిలిన అతికొద్ది సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్ని పార్టీలు భావిస్తున్నాయి.
తెలంగాణ ఎన్నికల సందర్భంగా… గత నెల రోజులుగా హోరాహోరీ ప్రచారం జరిగింది. సభలు, ర్యాలీలు, రోడ్‌షోలతో ఉవ్వెత్తున ప్రచారం నిర్వహించాయి రాజకీయ పార్టీలు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రచార రథాలు పెట్టి ఊరూరా ఊదరగొట్టారు. పాటలతో మారుమోగించారు. తమకే ఓటు వేయాలని… మైకులు అరిగేలా ప్రసంగాలు చేశారు. సాయంత్రం వరకు ప్రచారం చేసి… సమయం ముగిసిన తర్వాత ఎక్కడివాళ్లు అక్కడ సద్దుకోనున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన నాయకులు తెలంగాణ నుంచి వెళ్లిపోవాల్సి ఉంటుంది. ఎన్నికల ప్రచారం ముగిసిన వెంటనే 144 సెక్షన్‌ అమల్లోకి వస్తుంది. మంగళవారం సాయంత్రం నుంచి గురువారం సాయంత్రం వరకు 48 గంటల పాటు మద్యం దుకాణాలను మూసేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. దీంతో మంగళవారం సాయంత్రం నుంచే మద్యం షాపులు మూతపడ్డాయి.
ఇక…. మరోవైపు ప్రలోభాలపర్వం కూడా మొదలైనట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు ప్రచారం చేసిన అభ్యర్థులు… తమ ప్రాంతాల్లో బలాబలాలను అంచనా వేస్తున్నారు. కాస్త బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో ప్రలోభాలకు తెరలేపుతున్నారు. ఓటర్లను ఆకర్షించేందుకు డబ్బుల పంపిణీకి శ్రీకారం చుడుతున్నట్టు సమాచారం. సరాసరిన ఓటుకు 3వేల చొప్పున పంచుతున్నట్టు తెలుస్తోంది. ఒక పార్టీ ఓటుకు రెండు వేలు ఇస్తుంటే… మరోపార్టీ రూ.2500.. ఇంకో పార్టీ ఓటుకు రూ.3వేల వరకు పంచుతున్నట్టు సమాచారం. హేమాహేవిూలు బరిలో ఉన్న నియోజకవర్గల్లో అయితే… డబ్బు, మద్యం పంపిణీ విచ్చలవిడిగా జరుగుతున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే గ్రామాలలో మద్యం సీసాలు కూడా డంపు చేసినట్లు తెలుస్తోంది.
ఎన్నికల పోలింగ్‌కు మిగిలిన ఈ కొన్ని గంటల సమయంలో… ఇంకెంత మంది ఓటర్లను తమవైపు తిప్పుకోవచ్చే ప్రణాళికలు రచ్చిస్తున్నారు అభ్యర్థులు. ఇప్పటివరకు అదిచేశాం… ఇది చేశాం… మళ్లీ పవర్‌ ఇస్తే అది చేస్తాం… ఇది చేస్తాం అంటూ ప్రచారంలో ఊదరగొట్టిన నాయకులు… ఇప్పుడు చివరి ప్రయత్నంగా ఓట్లు కొనేందుకు కూడా సిద్ధమవుతున్నారు. ఎలాగైనా ఈ ఎన్నికల్లో గెలవాలని పట్టుదలతో ఉన్నారు.
తెలంగాణలో జరుగుతున్న ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌`కాంగ్రెస్‌ మధ్య హోరాహోరీ కనిపిస్తోంది. హ్యాట్రిక్‌ కొట్టాలని బీఆర్‌ఎస్‌ పట్టుదలతో ఉంటే… కేసీఆర్‌ ప్రభుత్వాన్ని పడగొట్టి అధికారం చేపట్టాలన్న లక్ష్యంగా ఉంది కాంగ్రెస్‌. ఇప్పటికే గ్యారెంటీల పేరుతో తెలంగాణ ప్రజలకు హావిూ వర్షం కురిపించింది. మరోవైపు… బీఆర్‌ఎస్‌ కూడా సై అంటే సై అంటోంది. కాంగ్రెస్‌ ఎన్ని వ్యూహాలు పన్నినా… ఈసారి కూడా గెలుపు తమదే అన్న ధీమాతో ఉంది బీఆర్‌ఎస్‌. ఇక… తెలంగాణలో బీజేపీ కూడా బలం పుంజుకున్నట్టు తెలుస్తోంది. గత ఎన్నికల కంటే.. ఎక్కువ స్థానాలను బీజేపీ గెలుచుకుంటుందని పలు సర్వేలు చెప్తున్నాయి.
ఇక ఎల్లుండి (గురువారం) పోలింగ్‌ జరగనుంది. పోలింగ్‌కు సమయం దగ్గర పడటంతో… ఎన్నికల నిర్వహణలో అధికారులు బిజీబిజీగా ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో పోలింగ్‌ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సాయంత్రం నుంచి పోలింగ్‌ ఏర్పాట్లు మరింత వేగంగా జరగనున్నాయి.

Share this Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *