ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని సైబర్ నేరగాళ్లు అడ్డగోలుగా వాడుతున్న విషయం అందరికీ తెలుసు. జనాల నుంచి డబ్బులు కొట్టేసేందుకు.. టెక్నాలజీ సహకారంతో రకరకాల మార్గాల్ని అన్వేషిస్తున్నారు. ఆఫర్ల పేరుతో మెసేజ్‌లు పెట్టి ఊరించడమో, ఏదైనా సమస్య తలెత్తిందని భయబ్రాంతులకు గురి చేయడమో, బ్లాక్‌మెయిల్‌కి పాల్పడి డబ్బులు గుంజడమో వంటివి చేస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి ఫేక్ మెసేజ్ ఒకటి ఓ యువకుడి ప్రాణాలని బలి తీసింది. ఈ విషాదకర ఘటన కేరళలోని కోజికోడ్‌లో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
ఆదినాథ్ అనే 16 ఏళ్ల యువకుడు కోజికోడ్‌లోని ఓ పాఠశాలలో 11వ తరగతి చదువుతున్నాడు. ఇతను బుధవారం సాయంత్రం చెవాయూర్‌లోని తన అపార్ట్‌మెంట్‌లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతని గదిలో లభ్యమైన సూసైడ్ నోట్ ప్రకారం.. అతను ఆన్‌లైన్‌లో మోసపోయినట్లు తెలుస్తోందని ఓ పోలీసు అధికారి తెలిపారు. అతనికొచ్చిన ఒక ఫేక్ చూసి అతడు తీవ్ర భయాందోళనలకు గురై ఉంటాయని, దాంతో అతడు ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ సూసైడ్ నోట్‌ని ఆదినాత్ తన తల్లికి రాశాడని ఆ అధికారి పేర్కొన్నారు. తల్లి ల్యాప్‌టాప్‌లో తాను ఏ అనధికార వెబ్‌సైట్‌లోకి లాగిన్ చేయలేదని, చట్టబద్ధమైన వెబ్‌సైట్‌లోనే తాను సినిమా చూశానని ఆ నోట్‌లో అతడు రాశాడని చెప్పారు.
ఇంతకీ ఆ ఫేక్ మెసేజ్‌లో ఏముంది?
‘‘అనధికార వెబ్‌సైట్‌ను యాక్సెస్ చేయడం వల్ల రూ. 30,000 కంటే ఎక్కువ చెల్లించాల్సి ఉంటుందని ఆదినాథ్‌కు ఎన్‌సీఆర్‌బీ (నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో) పేరుతో నకిలీ సందేశం వచ్చింది. ఒకవేళ ఆ డబ్బులు కట్టకపోతే.. భారీ జరిమానా, జైలు శిక్ష విధిస్తామని అందులో పేర్కొని ఉంది. ఈ మెసేజ్ కూడా ఆదినాథ్‌కు భయం వేసినట్లు తెలుస్తోంది’’ అని ఆ పోలీస్ అధికారి పేర్కొన్నారు. తాము ల్యాప్‌టాప్ బ్రౌజర్ హిస్టరీని పరిశీలించామని, అయితే అతడు అక్రమ వెబ్‌సైట్‌ను తెరిచినట్లు తమకు కనిపించలేదని అన్నారు.
బ్రౌజర్ హిస్టరీ తొలగించబడిందో లేదో తమకు తెలియదన్న ఆయన.. నిజం బయటకు తీసుకురావడానికి తాము దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఇప్పటికే తాము కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామన్నారు. బాలుడి మృతి కారణంగా తల్లిదండ్రులను వేరే ఇంటికి తరలించామన్నారు. వారి వద్ద నుంచి మరింత సమాచారం సేకరించి, వీలైనంత త్వరగా ఈ కేసుని ఛేధిస్తామని, నిందితులకు తగిన శిక్ష పడేలా చేస్తామని హామీ ఇచ్చారు.