Bharatha Sakthi

అడ్డగోలు నిర్మాణాలతో జనాలు బెంబేలు

admin 30/06/2023
Updated 2023/06/30 at 7:27 AM

హైదరాబాద్‌, జూన్‌ 30
నో రూల్స్‌.. ఓన్లీ బిజినెస్‌.. ఇదే ప్రణీత్‌ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ తీరు. నిబంధనలు వారికి అస్సలు పట్టవ్‌. పక్కనే నివాసాలు ఉన్నా.. రాత్రివేళ బ్లాస్టింగ్‌లు, వందల అడుగులలోతు సెల్లార్‌ తవ్వేస్తున్నా.. అధికారులు కన్నెత్తి చూడరు. ఇష్టారాజ్యాంగా ఆకాశహర్మ్యాలు వెలిసినా పట్టించుకోరు. భయంతో స్థానికులు కంప్లైంట్‌ చేసినా.. డోంట్‌ కేర్‌ అంటోంది ప్రణీత్‌ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ. చుట్టుపక్కల జనావాసాలకు భారీగా నష్టం జరుగుతున్నా.. ఎందుకు అధికారులు పట్టించకోవడం లేదు.? ఈ కంపెనీ వెనుక ఉన్న బడాబాబులు ఎవరు..?పర్మిషన్‌ ఇస్తే.. ఇక పట్టించుకోరు. అనుకున్నదొస్తే ఆటువైపు కన్నెత్తి చూడరు. మనీ మేనియాలో పడిపోయిన జీహెచ్‌ఎంసీ అధికారుల పనితీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో రోడ్డు కుంగిన ఘటన స్థానికులను భయబ్రాంతులకు గురిచేస్తోంది. గౌతమినగర్‌లో ప్రణీత్‌ కన్‌స్ట్రక్షన్స్‌ కంపెనీ 9 ఎకరాల్లో భారీ నిర్మాణం చేపట్టింది. సెల్లార్‌ నిర్మాణం కోసం దాదాపు వంద అడుగుల గొయ్యిని తవ్వారు. రాత్రి సమయంలో జిలెటిన్‌ స్టిక్స్‌తో భారీ పేలుళ్లకు పాల్పడుతున్నారు. దీంతో పక్కనే ఉన్న రోడ్డుపై బీటలు ఏర్పడటంతో పాటు.. సెల్లార్‌ గుంత కోసం రోడ్డు అంచువరకు తవ్వేయడంతో గౌతమినగర్‌లో రహదారి సగం వరకు కొట్టుకుపోయింది.రోడ్డు కింద ఉన్న డ్రైనేజీ పైప్‌లైన్‌ పగిలి, మురుగు నీరు సెల్లార్‌ గోతిలోకి చేరుతున్నాయి. పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్లు కృంగిపోయే పరిస్థితి ఏర్పడిరది. రాత్రివేళ భారీ పేలుళ్లతో స్థానిక కాలనీవాసులు నరకం అనుభవిస్తున్నారు. అపార్ట్‌మెంట్‌కి వెళ్లే దారి కూడా మూసుకుపోయింది. స్కూల్‌ పిల్లలు సహా, బయటకు వెళ్లేందుకు స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. దాంతో కాలనీవాసులు సెల్లార్‌ నిర్మాణంపై అభ్యంతరం చెప్పారు. అయినా పట్టించుకోకుండా ప్రణీత్‌ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ నిర్మాణం యధేచ్చగా కొనసాగిస్తోంది.ప్రణీత్‌ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ రూల్స్‌కి విరుద్ధంగా నిర్మాణం చేపబడుతోందని కాలనీవాసులు జీహెచ్‌ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదని స్థానికులు ఆరోపించారు. ప్రణీత్‌ కన్‌స్ట్రక్షన్స్‌ చేపడుతున్న నిర్మాణం వల్ల తమ కాలనీకి ముప్పు పొంచి ఉందని, సరైన జాగ్రత్త చర్యలు తీసుకోకుండా నిర్మాణం చేపడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఎప్పుడు ఎలాంటి ముప్పు సంభవిస్తుందోనని ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బిక్కు బిక్కు మంటూ గడుపుతున్నామని కాలనీవాసులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని డిమాండ్‌ చేస్తూ రోడ్డెక్కారు కాలనీవాసులు.ప్రణీత్‌ కన్‌స్ట్రక్షన్స్‌ కంపెనీ నిర్వాకం వల్ల ఇప్పుడు నాలుగు అపార్ట్‌మెంట్స్‌, ఇళ్లకు ముప్పు ఏర్పడిరది. 50 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. దాంతో నివాసాలు ఖాళీ చేయాలంటూ స్థానికులపై జీహెచ్‌ఎంసీ అధికారుల ఒత్తిడి తీసుకొస్తున్నారు. అయితే తాము ఖాళీ చేయబోమంటున్నారు స్థానికులు.ఇదిలాఉంటే.. భారీ భవన నిర్మాణం కోసం ప్రణీత్‌ కన్‌స్ట్రక్షన్స్‌ కంపెనీ రెండు సార్లు అప్లై చేసుకుంటే జీహెచ్‌ఎంసీ హెడ్‌ రిజెక్ట్‌ చేసినట్లు తెలుస్తుంది. మరోవైపు జోనల్‌ ఆఫీసు నుంచి కూడా ఈ నిర్మాణానికి అనుమతులు ఇవ్వలేదు. పర్మిషన్‌ రాకుండానే రెండు ఎకరాల్లో భారీ సెల్లార్‌ తవ్వకం చేపట్టింది నిర్మాణ సంస్థ. మరి అనుమతులు లేకున్నా నిర్మాణ పనులు చేపడుతుంటే జీహెచ్‌ఎంసీ అధికారులు ఎందుకు పట్టించుకోవడంలేదనే విమర్శలు వెల్లువెత్తాయి.

Share this Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *