హైదరాబాద్, డిసెంబర్ 7,
119మంది ఎమ్మెల్యేలు ఉన్న తెలంగాణ అసెంబ్లీలోకి ఈ సారి 43మంది రెడ్డి కులానికి చెందిన వారే అడుగుపెట్టనున్నారు. 13 మంది వెలమలు, నలుగురు కమ్మలు, బ్రాహ్మణ, వైశ్య కులాల నుంచి ఒక్కొక్కరు అసెంబ్లీలో అడుగుపెడతారు. అటు బీసీల ఎమ్మెల్యేల సంఖ్య 19గా ఉంది.తెలంగాణ, ఏపీ రాజకీయాలను కులాలను వేరు చేసి చూడలేం. కులసవిూకరణలు, లెక్కలు లేకుండా ఎన్నికలు జరగవు. ఎస్సీ, ఎస్టీలకు ఫిక్సడ్ సీట్లు ఉంటాయి.. మిగిలిన కులాల వారికి ఉండవు. ఎవరైనా ఓపెన్‌గా కంటెస్ట్ చేయవచ్చు. గెలవచ్చు.. అసెంబ్లీలోకి అడుగుపెట్టవచ్చు. ఇక ఎన్నికల్లో ఆ కులానికి ఇది చేస్తాం.. ఈ కులం కోసం ఇది చేస్తాం అని చెబుతు ఓట్లు అడుగుతారు అభ్యర్థులు. మహిళా కోటా కావాలని రోడ్లు ఎక్కుతారు కానీ అసలు టికెట్ కూడా ఇవ్వరు.. ఇక బీసీల కోసం కులగణన చేపడతామని చెబుతారు కానీ టికెట్లు ఇవ్వడంలో వారికి కూడా మొండిచెయ్యే. తెలంగాణ ఎన్నికలు ఫలితాల తర్వాత ఆసక్తికర లెక్కలు బయటకొచ్చాయి. తెలంగాణలో మొత్తం 119నియోజకవర్గాలున్నాయి. అందులో 31 రిజర్వెడ్ సీట్లు. అంటే ఎస్సీ, ఎస్టీ సీట్లు. ఈ సీట్లలో మిగిలినవారు పోటిచేసే ఛాన్స్ లేదు. మొత్తం 19సీట్లలో ఎస్సీలు, 12సీట్లలో ఎస్టీలు నిలబడతారు. ఇక మిగిలిన 88సీట్లు ఓపెన్ క్యాటగిరి. అంటే ఎవరైనా నిలపడొచ్చు. ఈ 88సీట్లలో ఈసారి 43 మంది రెడ్డిలు, 13 మంది వెలమలు, నలుగురు కమ్మలు, బ్రాహ్మణ, వైశ్యకులాల నుంచి ఒక్కొక్కరు అసెంబ్లీలో అడుగుపెడతారు. అంటే 119 మంది ఎన్నికైన ప్రతినిధులలో 52శాతం అగ్రకులాల వారే ఉన్నారు.ఇటీవలి కాలంలో ఎక్కువగా కులగణన గురించి దేశవ్యాప్తంగా తీవ్ర చర్చజరిగింది. ముఖ్యంగా బీసీల శాతం తేల్చేందుకు కులగణన చేపడతామని పలు పార్టీలు ప్రకటించాయి. బీసీల సంఖ్య ఎక్కువగా ఉన్న చోట్ల రిజర్వేషన్ శాతాన్ని పెంచుతామని చెప్పాయి. ఇక తెలంగాణలో గెలిస్తే ‘బీసీ’నే సీఎంగా చేస్తామని బీజేపీ ప్రకటించింది కూడా. అయితే నిజానికి బీసీ ఎమ్మెల్యేల సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఈ సారి తెలంగాణ అసెంబ్లీలో అడుగుపెట్టేవారిలో 19 మంది బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే 16శాతం మంది బీసీలన్నమాట. అటు బీసీ జనాభా 50శాతానికి పైగా ఉందని అంచనా. ఇక 1983 నుంచి తాజా అసెంబ్లీ ఎన్నికల వరకు రెడ్డిలు, వెలమలు, కమ్మలు వారి జనాభా తక్కువగా ఉన్నా అసెంబ్లీలో మెజారిటీ సీట్లలో వారే ఉంటున్నారు. 40 ఏళ్లుగా అధికారంలో ఉన్న పార్టీతో సంబంధం లేకుండా రెడ్డి ఎమ్మెల్యేలు సగటున 30 నుంచి 43, వెలమలు 8 నుంచి 13 మధ్య, కమ్మలు 3`8 మధ్య, బ్రాహ్మణులు 1 నుంచి 7 మధ్య ఉన్నారు.
Leave a comment